
వెంకయ్య అన్యాయం జరగనివ్వరు: చంద్రబాబు
ఢిల్లీలో వెంకయ్యనాయుడు ఉన్నంతవరకూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగనివ్వరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏలూరు: ఢిల్లీలో వెంకయ్యనాయుడు ఉన్నంతవరకూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగనివ్వరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. భూమి కొనైనా నిట్ను తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేయాలనుకున్నామని, కేంద్ర మంత్రులు, మంత్రి మాణిక్యాలరావు సహకారంతోనే నిట్ ఏర్పాటు అయిందన్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని నర్సాపురంలో పోర్టు, భీమవరంలో ఆక్వా వర్సిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నానని, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.