సాక్షి, విజయవాడ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. ముడుపులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడి అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మండిపడ్డారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.
నాలుగేళ్లు నిద్రపోయావా పవన్..!
దళితులపై దాడుల్లో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని సురేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ అవినీతి పాలన పవన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు పవన్ నిద్రలో ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీపై పవన్ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీరు సరిగా లేదన్నారు. ఇన్నాళ్లు మౌనం వహించిన వెంకయ్య ఫిరాయింపుదారులపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుతో ఉన్న ఫిరాయింపుదారులను ఓడించండి అని వెంకయ్య చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని సురేష్ మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. సబ్‌ప్లాన్ నిధులెంత, మీరు ఖర్చు చేసిందెంత అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జూపూడి డబ్బులు పంచుతూ హైదరాబాద్‌లో పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment