పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్‌నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా?
► పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది.
► ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి?
► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది.
► అయితే, వైఎస్సార్‌సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం.
►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం.
►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది?
20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.
చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది.
175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment