కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు.
రాజ్యసభలో సైకిల్ మాయం
రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్‌లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది.
పొత్తులుంటాయి.. కానీ..!
కరకట్ట మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
(వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు)
ఇంకా మారని తీరు
చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్‌లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది.
లోకేష్‌తో లాభమా? నష్టమా?
ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం.
పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.?
బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్‌ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment