పథకం ప్రకారం దర్శిలో జనసేనకు మొండిచేయి
టికెట్‌పై ఆశతో ఐదేళ్లు కష్టపడిన టీడీపీ, జనసేన నేతలు
ప్లాన్ ప్రకారం జనసేనలోకి గరికపాటి
చివరకు కాపులకు మొండిచేయి
సొంత సామాజికవర్గానికి జైకొట్టిన బాబు
ఆగ్రహంతో రగిలిపోతున్న సేనలు
ప్రకాశం: టీడీపీ అధినేత జిత్తుల మారి నారా ఎత్తులతో జిల్లాలోనే జనసేన కుర్చీ మడతెట్టేశాడు. నాలుగేళ్లుగా దర్శిలో కష్టపడిన స్థానిక టీడీపీ, సేనలకు చంద్రబాబు మొండిచేయి చూపారు. ఇక్కడ అభ్యర్థి విషయంపై చివరి వరకూ ఇటు టీడీపీ.. అటు జనసేనలను ఊరించారు. ఆశావహులను ఉసూరుమనిపించారు. చివరకు ఈ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని జిల్లా ఎల్లలు దాటి తన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళకు టికెట్ ఇచ్చి స్థానిక నేతలకు బాబు మార్క్ షాక్ ఇచ్చారు.
దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నాలుగేళ్లుగా జనసేన పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో గిద్దలూరు తర్వాత జనసేనలు ఆశించింది దర్శి స్థానాన్నే. 2019లో ఇక్కడ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు కాపు సామాజిక వర్గానికి చెందిన బొటుకు రమేష్. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన వరికూటి నాగరాజు కూడా 2024లో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.
ఒక వేళ పొత్తులో భాగంగా జనసేనకు ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వాల్సి వస్తుందేమోనని టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్క్ కుట్ర రాజకీయానికి తెరతీశారు. అప్పటి వరకూ గ్లాసు పార్టీని నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పోటీగా తన సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని జనసేనలోకి పంపేందుకు పథకాన్ని రచించారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో ఉన్న నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గరికపాటి వెంకట్‌ను జనసేన పార్టీలోకి పంపారు.
పక్కా ప్లాన్ ప్రకారం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గొట్టిపాడుకు చెందిన వెంకట్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాడు. భారీగా జనసేన, టీడీపీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జనసేన టికెట్ నాదేనంటూ స్పీడ్ పెంచి హంగామా చేశారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు వంటి పలు కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించిన టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న పమిడి రమేష్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇక వెంకట్ అన్నీ తానై వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో సమీకరణాలు మారిపోతూ వచ్చాయి.
గాల్లో కృష్ణ చైతన్య..
అద్దంకిలో ఉన్న బాచిన చెంచు గరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్యలను పార్టీలోకి తీసుకుని అవసరమైతే జనసేన నుంచి పోటీ చేయాలని బాబు కండీషన్లు పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబు ఈయన కంటే ధనవంతుడికి గాలం వేశారు. రహస్యంగా ఆయనతో చర్చలు జరుపుతూనే మరో పక్క కృష్ణచైతన్యకు మొండిచేయి చూపారు. చివరకు చీరాల టికెట్ అయినా కేటాయించాలని గరటయ్య చంద్రబాబును కోరారు. అక్కడా వారిని చివరి వరకూ ఊరించి ఉసూరుమనిపించారు. బాబు రాజకీయ కుట్రలకు ప్రస్తుతం తండ్రీ, కొడుకుల పరిస్థితి అగమ్యంగా మారింది. ఇక కమ్మసామాజిక వర్గానికి చెందిన గోరంట్ల రవికుమార్‌ను ఇన్‌చార్జిగా రంగంలోకి దింపారు.
ఆయన్ను స్థానిక కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పూర్తిగా వ్యతిరేకించారు. జనసేన కానీ, టీడీపీ అయినా స్థానికులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎల్లో మీడియా ద్వారా రోజుకో పేరును తెరపైకి తెచ్చి స్థానిక నేతలను గందరగోళానికి గురిచేశారు. ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో కొత్త పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు స్థానిక కేడర్‌ను సైతం పట్టించుకోకుండా పొరుగు జిల్లాకు చెందిన గొట్టిపాటి లక్ష్మికి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
వాస్తవానికి నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్‌గా ప్రైవేట్ క్లీనిక్ నిర్వహిస్తున్న ఆమె అక్కడే టికెట్ ఆశించారు. అయితే ఆమెకు అనూహ్యంగా దర్శి టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయంపై రెండు పార్టీల నేతలు విస్మయానికి గురయ్యారు. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ ఎలా పనికొస్తుందంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. టికెట్ ఆశలతో స్థాయిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చుచేసుకున్న జనసేన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటూ ఆ పార్టీ కార్యకర్తలు సైతం హెచ్చరిస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థి లక్ష్మి బంధువులు రంగంలోకి దిగినట్టు తెలిసింది. అతనితో చర్చలు జరుపుతున్న విషయం స్థానిక కేడర్‌కు తెలిసింది. నీతో పాటు మేము కూడా పార్టీలో కష్టపడ్డాం. రూ.లక్షలు ఖర్చుచేశాం..మరి మా పరిస్థితి ఏంటని నిలదీసినట్టు స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చంద్రబాబు ఎత్తులకు జనసేనలు చిత్తయ్యారు.
ఇవి చదవండి: చీరలతో ఓటర్లకు ఎర.. ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంట్రీతో గుట్టురట్టు!
Comments
Please login to add a commentAdd a comment