పొత్తుల తక్కెడలో కుదరని ఏకాభిప్రాయం
ఎన్ని, ఎక్కడ మీద బేధాభిప్రాయాలు
8 ఎంపీ, 8 ఎమ్మెల్యే సీట్లు కావాలని బిజెపి డిమాండ్
సర్వే నివేదికలు అంటూ చంద్రబాబు కొత్త మెలికలు
రఘురామ కృష్ణరాజును ఎవరు తీసుకోవాలన్నదానిపై చర్చ
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల పంచాయితీ మొదటికొచ్చింది. సీట్ల సంఖ్యపై బీజేపీ పట్టు ఇవ్వాళ స్పష్టమయింది. ఢిల్లీలో కేవలం ఎన్డీయేపై చేరికపైనే చర్చలు జరిగాయని, సీట్ల సర్దుబాటుపై ఇప్పుడు చర్చలు జరపాలని షెకావత్ చెప్పినట్టు తెలిసింది. షెకావత్ ప్రతిపాదనలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖంగుతిన్నారని, 6 ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పాం కదా అని చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఎన్డీఏలో చేరతాం అంటే ఓకే అన్నామని, మా పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాల్లో, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటుందని బిజెపి అధిష్టానం తరపున షెకావత్ స్పష్టం చేసినట్టు తెలసింది. ఇప్పటివరకు ఎల్లో మీడియాలో మీ అంతట మీరే ఆరు ఎంపీ, ఆరు ఎమ్మెల్యేలంటూ ఇన్నాళ్లూ టీడీపీ లీకులు ఇచ్చిందని, దానికి ఒప్పుకోలేదని, 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే ఇవ్వాల్సిందేనని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది.
ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరోసారి సమావేశమైంది. కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, జనసేన అధ్యక్షుడు పవన్ పాల్గొన్నారు.
పురందేశ్వరి లేకుండానే చర్చలు
కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో జరుగుతున్న కీలకమైన చర్చలకు రాష్ట్ర బీజేపీ చీఫ్‌కు పురందేశ్వరికి ఆహ్వానం అందలేదు. పురందేశ్వరి లేకుండానే చర్చలు జరుగుతున్నాయి. ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరుగుతున్న కీలక సమావేశానికి పురందేశ్వరిని బాబు దూరం పెట్టడంపై చర్చనీయాంశమయింది. దీనిపై పురందేశ్వరీ ఏమన్నారంటే.. "పొత్తులపై బీజేపీ కి ఓ విధానం ఉంటుంది, నేను చర్చలకు వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణం ఏం లేదు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, నిన్న పవన్ కళ్యాణ్, నేడు చంద్రబాబు తో చర్చలు జరుగుతున్నాయి, చర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం" అని అన్నారు.
లోక్ సభకు పవన్.?
పవన్ పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేయబోతున్నట్టు తెలిసింది. కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తాడని పార్టీ వర్గాలు ఇచ్చిన లీకును బట్టి తెలుస్తోంది. తొలుత తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ అనుకున్నా... ఎందుకైనా మంచిదని కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కాకినాడ అయితే బెటరని, అలాగే పిఠాపురంలో లక్ష మంది కాపు ఓటర్లు ఉన్నారని కాబట్టి అక్కడినుంచి అసెంబ్లీకి బెటరని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాడు పవన్ కళ్యాణ్. జనసేన ఖాతాలో ప్రస్తుతం నెలిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాలున్నాయి. ఇప్పుడు ఈ సీట్లు యథాతధంగా ఉంటాయా? మార్పులు జరుగుతాయా అన్నది తెలియరాలేదు.
ఢిల్లీలో ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు?
మొదటి నుంచి ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ స్పష్టంగా చెప్పింది. గతంలో బీజేపీ పోటి చేసిన పార్లమెంట్ స్థానాలను కూడా తెలిపింది. అన్ని సామాజిక వర్గ సమీకరణాలను చూసుకుని ముందుకెళ్లడానికి కార్యాచరణ చేసుకుంది. ఇక్కడే చంద్రబాబు మెలిక పెడుతున్నట్టు తెలిసింది. బీజేపీకి ఇవ్వాల్సిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో టిడిపి నేతలు పోటీ చేస్తారని, వాటికి బదులు మరో చోట ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. దీనిపై బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. పార్టీ బలంగా ఉన్న చోట పోటీ చేయాలని ఎవరైనా కోరుకుంటారు కానీ.. ఏ మాత్రం బలం లేని చోట నిలబడితే ఓడిపోవడమే కాకుండా.. పార్టీ పరువు పోతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సోము వీర్రాజుకు వెన్నుపోటు?
అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు పరిశీలనలో ఉంది. రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని సోము వీర్రాజుకు బీజేపీ అగ్రనేతలు అడుగుతున్నారు. ఇక హిందూపూర్ రేసులో విష్ణువర్దన్ రెడ్డి పేరు లిస్టులో ఉంది. అయితే సోము వీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ కాకుండా గతంలో మాదిరి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు మెలిక పెట్టినట్టు తెలిసింది. అందుకు బీజేపీ నో చెప్పినట్లు తెలుస్తోంది.
గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, కడప, శ్రీకాళహస్తి కావాలని బీజేపీ అడిగినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ వెస్ట్ స్థానం కోసం జనసేన పట్టుబడుతోంది. విశాఖ సిటీలో రెండు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది. విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా విశాఖ వెస్ట్ లేదంటే వి.మాడిగుల అసెంబ్లీ కోసం పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సీటును అడుగుతోంది.
మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి అసెంబ్లీ స్థానాలపై సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటికీ ఖరారు కానీ సీట్లపై ఓ వైపు చంద్రబాబు ఇంట్లో మల్లగుల్లాలు నడుస్తుంటే.. సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ విజయవాడలోనే మకాం వేసి తమ వాటా ఏదని రెడీగా వెయిట్ చేస్తున్నారు. రెండు, మూడు గంటలుగా చర్చలు కొనసాగుతున్నా.. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం.
"రఘురామ మాకొద్దు"
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి నుంచి ఎంపీ అయి.. తర్వాత రెబల్‌గా మారిన రఘురామ కృష్ణంరాజు పట్ల మూడు పార్టీల్లో చర్చ జరుగుతోంది. నరసాపురం సీటు తీసుకునేందుకు బిజెపి, జనసేన నిరాకరించినట్టు తెలిసింది. తెలిసి తెలిసి రఘురామ తలనొప్పి మాకెందుకంటూ ఇరు పార్టీల నాయకులు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. ఇన్నాళ్లు ఎంకరేజ్ చేసినందుకు రఘురామను తెలుగుదేశమే తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. నరసాపురం సీటు బిజెపి లేదంటే జనసేన ఖాతాలో వేసేందుకు చివరిదాకా చంద్రబాబు ప్రయత్నించినా.. ఒప్పుకోనట్టు సమాచారం. సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉండడంతో రఘురామ కృష్ణంరాజును పార్టీలోకి ఎలా తీసుకోవాలా అన్నది బాబు ఆలోచిస్తున్నాడు. నరసాపురంలో రఘురామ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడని పక్కాగా సర్వేలు చెబుతుండడం కూడా బాబు ఆందోళనకు మరో కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రఘురామ కృష్ణంరాజును ఎలా వదిలించుకోవాలని బాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment