చంద్రబాబు విష రాజకీయంలో మరో పావు
ఎన్నికల వేళ హఠాత్తుగా తెరపైకి ప్రశాంత్ కిషోర్
కరకట్ట ఇంట మంతనాలు, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్
సర్వేల్లేవు, రిపోర్టుల్లేవు, అంతా పీకే అంచనాలే.!
'బీహారు రాజకీయ నేత, ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత కిషోర్ ఇప్పుడు అవుట్ డేటెడ్ అయ్యారా? ఆయన ఏపీలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి అప్ డేట్ అవకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా మాట్లాడారా? సర్వేలు చేయడమే మానుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ జోస్యం చెప్పడంలో కుట్ర కోణం కనిపించడం లేదా?'
చంద్రబాబు తనను బీహారు డెకాయిట్ అని గతంలో దూషించిన సంగతి మర్చిపోయి, ఇప్పుడు ఆయనతో రహస్య ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? ఇలాంటి అనేక సందేహాలు వస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం సహజంగానే కలకలం రేపుతుంది. హైదరాబాద్‌లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో కీలకమైనది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రాజకీయ జోస్యం. ఆయన చిత్తశుద్దితో ఏపీలో పర్యటనలు చేసి, లేదా తన మనుషులతో ప్రజాభిప్రాయం తెలుసుకుని ఏమైనా వ్యాఖ్యానించి ఉంటే అది వేరే సంగతి. అప్పుడు ఆయన అభిప్రాయంపై విభేదించవచ్చు. లేదా సపోర్టు చేయవచ్చు.కానీ ఆయన అలా కాకుండా బీహారు నుంచి ఒక రోజు కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చి, ఏపీపై మాట్లాడడం కాస్త అసహజంగానే ఉంటుంది.
కొంతకాలం క్రితం ప్రశాంత కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. అదేదో కామన్ మిత్రుడు ఒత్తిడి చేస్తే వెళ్లి కలిశానని చెప్పారు. చంద్రబాబుకు ఉండే నెట్ వర్క్ అలాంటిదన్నమాట. ఎవరినైనా ట్రాప్ చేయగల సత్తా ఆయన సొంతం. చంద్రబాబు నివాసంలో కలిసిన తర్వాత ఏమి రాజకీయ చర్చలు జరిగాయో కానీ, రోజువారిగా టీడీపీ చేసే విమర్శలనే ఆయన మాట్లాడినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ తర్వాత ప్రశాంత కిషోర్ వాటి గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు సడన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షమై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను వ్యతిరేకంగా మాట్లాడి ఏపీలోని పెత్తందారుల కూటమిలో ఆయన కూడా జాయిన్ అయ్యారన్న అభిప్రాయాన్ని కలిగించారు. కరకట్ట ఇంటికి ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొచ్చేందుకు నారా లోకేష్ ఏకంగా ఓ ప్రత్యేక విమానాన్నే తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఏపీ ప్రజలెవరూ మరిచిపోలేదు.
ఇదే ప్రశాంత కిషోర్‌పై 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేసింది అందరికి తెలుసు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత కిషోర్ గొప్పవాడికింద ఈ మీడియా ప్రొజెక్టు చేసే పనిలో పడింది. ఆయన చెబితే అన్నీ జరిగిపోతాయన్నట్లుగా పిక్చర్ ఇస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రశాంత కిషోర్ చేసిన రాజకీయ జోస్యాలన్నీ విఫలం అయ్యాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ మూడోసారి గెలుస్తుందని కిషోర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. చత్తీస్ గడ్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2022 లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవదని చెబితే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది.
ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత కిషోర్ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం అవుతున్నారని తెలిసిపోతుంది. ఆయన ఐ పాక్ అనే సర్వే సంస్థ గతంలో ఉండేది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థతో అన్ని బంధాలు వదులుకున్నానని పలుమార్లు చెప్పారు. దాంతో ఏపీకి ఆయనకు కాంటాక్ట్ పోయినట్లయింది. అయినా పర్వాలేదు. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల బలబలాలను పరిశీలించి పోల్చి విశ్లేషణ ఇస్తే పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. ఆయన అలా చేయలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓడిపోవడానికి చెప్పిన ఆయన చేసిన వాదన అర్ధరహితంగా ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కితేనే ఓట్లు పడవని అన్నారు. కాసేపు ఆయన చెప్పింది నిజమే అనుకుందాం!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న స్కీములకు సుమారు ఏభైవేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతోంది. దానికి మూడు నుంచి నాలుగు రెట్ల మేర అంటే ఏడాదికి సుమారు లక్షన్నర కోట్లను తాను బటన్ నొక్కుతానని చంద్రబాబు అంటున్నారు కదా! చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్కీములను ఎద్దేవ చేసి ఏపీ మరో శ్రీలంక అవుతుందని ఆరోపించేవి. అదే చంద్రబాబు మూడు రెట్లు డబ్బు పంచుతానని అంటుంటే మాత్రం వీరు ఆహా, ఓహో అంటూ ప్రచారం చేస్తున్నాయి. అంతే తప్ప చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తే మూడు లేదా నాలుగు శ్రీలంకలు అవుతుందని చెప్పడం లేదు. పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు శరాలను వదలుతున్నాడని పచ్చ మీడియా సంబరపడింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్‌ల గురించి ఏమంటారు? ప్రజలు వాటికి ఎందుకు ఆకర్షితులయ్యారు? ఈ విషయాలను ప్రశాంత కిషోర్ పరిగణనలోకి తీసుకున్నారా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా సంక్షోభ సమయం రెండేళ్లలో ఎలాంటి కార్యాచరణ అమలు చేసింది ప్రశాంత కిషోర్ ఎన్నడైనా గమనించారా? ఈ ఐదేళ్లలో ఏపీలో ఎన్ని కొత్త వ్యవస్థలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చింది ఆయన తెలుసుకున్నారా? వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించడం వాస్తవం కాదా! గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ చేయలేదా? రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇలా అనేక మార్పులు వచ్చింది ఆయన చూడలేదా! వృద్దులకు పెన్షన్లను ఇళ్లవద్దకే తీసుకువెళుతున్నది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాదా! స్కూళ్లు బాగు చేయడం అభివృద్ది కాదా! స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్ తీసుకు వస్తున్నది నిజం కాదా?
అలాగే, ఆస్పత్రులను బాగు చేసి ప్రజలకు ఆరోగ్య సురక్ష క్యాంపులను పెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పేమిటి? అభివృద్ది విషయానికి వస్తే వీటన్నిటిలో అభివృద్ది కనిపించడం లేదా? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 800 గ్రామాలకు నీటి పథకం, నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, పదిహేడు మెడికల్ కాలేజీలు, విజయవాడ వద్ద వరద రాకుండా పెద్ద గోడ నిర్మాణం, వెలిగొండ టెన్నెల్ పూర్తి, అవుకు రెండో టన్నెల్ పూర్తి, కుప్పంకు నీరు, ఓర్వకల్ వద్ద గ్రీన్ కో ప్లాంట్, కొప్పర్తి పారిశ్రామికవాడ, రామాయంపట్నం వద్ద కొత్త పరిశ్రమలకు ఏర్పాట్లు, విశాఖ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తదితర ఐటి కంపెనీలు, నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్శిటీ మొదలైనవీ ఏవీ అభివృద్ది కాదని ప్రశాంత కిషోర్ అనుకుంటున్నారా! ఏదో ఒక చోట ఒక భారీ భవంతి కడితేనే అభివృద్ది.. గ్రామాలలో ఏభైవేల భవనాలు కడితే అభివృద్ది కాదని ఈయన కూడా అనుకుంటున్నారా?
ఇలా.. అసలు ఏపిలో తిరగకుండానే, పేదల, దిగువ మధ్య తరగతి ప్రజల మనో భావాలు తెలుసుకోకుండా ప్రశాంత కిషోర్ ఎలా మాట్లాడతారు? పోనీ వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు టైమ్ లో జరిగాయా? నిజంగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం ఎందుకు తహతహలాడారు?అది చాలదన్నట్లుగా బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటున్నట్లుగా పెత్తందారుల కూటమిలో ఈయన కూడా చేరారా? బీహారులో సొంత పార్టీ పెట్టి పాదయాత్రలు చేసినా ఎందుకు ప్రజాదరణ పొందలేకపోతున్నారు? ఇవన్ని పరిశీలిస్తే ప్రశాంత కిషోర్ ఏదో రహస్య ఎజెండాతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.
గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన సలహాదారుగా పనిచేశారు. అప్పుడు రూపొందించిన నవరత్నాల కార్యక్రమంలో ఈయనకు కూడా బాగస్వామ్యం ఉంది కదా! దానినే ఇప్పుడు తప్పు పడుతూ ఎలా మాట్లాడతారు? అంటే ఇది కపటత్వం కాదా? ప్రజలు వీటన్నిటిని గమనించకుండా ఉండరు. కృత్రిమమైన వ్యతిరేకత సృష్టించడానికి ఈయన వ్యాఖ్యలను టీడీపీ, ఎల్లోమీడియా ప్రచారం చేయవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టడం కూడా పెద్ద కష్టం కాదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment