చంద్రబాబు బీసీ వ్యతిరేకి : జస్టిస్‌ ఈశ్వరయ్య | Chandrababu, the opposite of weak sections : justice eswaraiah | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బీసీ వ్యతిరేకి : జస్టిస్‌ ఈశ్వరయ్య

Published Mon, Apr 8 2019 7:12 AM | Last Updated on Mon, Apr 8 2019 7:34 AM

Chandrababu, the opposite of weak sections : justice eswaraiah - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5శాతం రిజర్వేషన్‌ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు. అందుకే కాపులు కూడా చంద్రబాబును నమ్మరు. రాజధానిగా అమరావతి ఎంపిక, హైదరాబాద్‌లో హైటిక్‌ సిటీ వెనుకా.. చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలే తప్ప, పేద ప్రజలు ఆయనకు పట్టరు. బాబు న్యాయవ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవడానికి చేయని ప్రయత్నంలేదు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పచ్చిగా దొరికిపోయాడు. ఇదీ అసలైన క్విడ్‌ ప్రో కో కేసు! చంద్రబాబు పేరును చేర్చి అదనపు చార్జిషీట్‌ వేయాలి. ఎవరి ఓటు ఉంచాలో, ఎవరిది తీసివేయాలో తెలుసుకోవడం కోసమే డేటా చోరీ. ఎవరేమిటో తెలుసు కోవడానికే ఆ డేటా కావాల్సి వచ్చింది. లేకుంటే డేటాతో ఏం పని? అందుకే  చంద్రబాబు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలి అంటున్న.. జస్టిస్‌ ఈశ్వరయ్యతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

అతి సాదాసీదా కుటుంబంలో పుట్టి.. 
వీధి లైట్ల వెలుగులో చదివి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి బడుగు బలహీన వర్గాల తరఫున పని చేస్తున్న జస్టిస్‌ ఈశ్వరయ్య నిర్మొహమాటి. సామాజిక న్యాయమే ధ్యేయమంటారు. వ్యవస్థలను ధ్వంసం చేయడంలో పాలకులు పోటీపడుతున్నారని చెప్పే ఆయన... దేశంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న విపరీత పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు, వెంకయ్య, రామోజీ.. అందరూ ఒకే గూటి పక్షులు
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ హోదాలో నేను మూడేళ్లు ఢిల్లీలో ఉన్నా. కేంద్ర క్యాబినెట్‌ హోదా అది. వెంకయ్య నాయుడు నిర్వహించే ఉగాది వేడుకలకు సుప్రీంకోర్టులోని కమ్మ జడ్జీలను మాత్రమే పిలిచేవారు. వాళ్ల కులపిచ్చికి ఇది పరాకాష్ట. అయితే ప్రతిచోటా ఉన్నట్టే జస్టిస్‌ చలమేశ్వర్, ఎల్‌.నాగేశ్వరరావు లాంటి వాళ్లు అందుకు మినహాయింపు. సామాజిక న్యాయానికి కట్టుబడిన వాళ్లు. బీజేపీలో ఉండి కూడా వెంకయ్య నాయుడు తన కులం వాళ్లను పరిరక్షించుకుంటారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, రామోజీరావు లాంటి వాళ్లందరి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మాలాంటి సామాజిక నిర్మాణానికి పని చేస్తున్న వారిని మాత్రం దూరం పెడతారు. 

జస్టిస్‌ భట్‌ను బదిలీ చేయించింది బాబే 
చంద్రబాబు తీరుకు ఇటీవల జరిగిన మంచి ఉదాహరణ మీకు చెబుతా. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జస్టిస్‌ ఎస్వీ భట్‌ అని మంచి న్యాయమూర్తి ఉన్నారు. చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయన్ను ఈ మధ్య బదిలీ చేశారు. ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ నేను విన్నదేమిటంటే.. ఆయన (చంద్రబాబు)  న్యాయవ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారు.

భట్‌ కొలీజియంలో నెంబర్‌ 2గా ఉన్నారు గనుక తమ మనుషుల్ని ప్రమోట్‌ చేయరేమోనని, నిష్పక్షపాతంగా ఉంటాడని, వాళ్ల కేసుల్లో ఫేవర్‌ చేయడేమోనని భావించి.. న్యాయవ్యవస్థను నియంత్రణలో పెట్టుకోవడానికి ఆయన్ను బదిలీ చేయించారని నాకు తెలిసింది. అందుకే జస్టిస్‌ భట్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి కేరళ హైకోర్టుకు బదిలీ చేశారు. జడ్జీల ఎంపిక ఎలా ఉంటుందంటే.. కొలీజియం సిఫార్సు చేసిన తర్వాత ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర న్యాయశాఖ, సుప్రీంకోర్టులకు కాపీలు (పేర్లున్న ప్రతులు) వెళ్తాయి.

అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయా జడ్జీలపై ఏమైనా కేసులు, ఆరోపణలు, ఇతర వివరాల గురించి ఐబీ ద్వారా ఆరా తీస్తుంది. గవర్నర్, ముఖ్యమంత్రి ఆయా వ్యక్తులపై ఉన్న కేసుల వివరాలను ఆధారాలతో సహా నోట్‌లో కామెంట్‌ రాసే అధికారమే ఉంది. కాని పలానా వాళ్లను జడ్జీలుగా నియమించవద్దని రాసే అధికారం లేదు. అయితే చంద్రబాబు మాత్రం ఐదుగురు జడ్జీలపై నిరా«ధారమైన ఆరోపణలు రాసి వారిని అడ్డుకున్నారు. ఇప్పుడేమో భట్‌ను బదిలీ చేయించారు. 

బీసీలను జడ్జీలుగా తిరస్కరిస్తూ కేంద్రానికి బాబు లేఖ
చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని చెప్పడానికి ఒక బలమైన కారణముంది. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. న్యాయవ్యవస్థపై ఆధిపత్యం చెలాయించుకునేందుకే వారిని రికమెండ్‌ చేయలేదు. చంద్రబాబు కుట్రతో అభ్యంతరాలు రాయించారని, వీటిని ఒప్పుకోకూడదని జస్టిస్‌ చలమేశ్వర్‌ కామెంట్‌ రాయడంతో వారంతా హైకోర్టు న్యామూర్తులయ్యారు.

నాడు బీసీలు ఇద్దరు, ఎస్సీ ఒకరు న్యాయమూర్తులయ్యారు. నేను కొలీజియంలో ఉన్నప్పుడు జడ్జీలుగా నియమించిన వారిలో ఒకరైన ప్రవీణ్‌ కుమార్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. నేను రిటైర్‌ అయిన తర్వాత నా జూనియర్‌ను రికమెండ్‌ చేస్తే.. దానిపైనా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. మాకు నీతి, నిజాయితీ లేదట. నా జూనియర్‌కు ఇంటిగ్రిటీ, క్యాలిబర్‌ లేదట. హైకోర్టు న్యాయమూర్తి అయ్యే అర్హత లేదట. ఇంకో బీసీ మీద కూడా అలాగే రాశారు.

అభినవ్‌ కుమార్‌ అనే బ్రాహ్మణుడి మీద, గంగారామ్‌ అనే ఓ ఎస్సీ జడ్డీ మీద కూడా ఇలాగే రాశారు.  ప్యానల్‌లో ఉన్నది ఒక్క ఎస్సీ జడ్డీ అయితే ఆయన మీద ఎందుకు అభ్యంతరం చెప్పారో విచిత్రం. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే ఇలాంటి వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. 

కాపులకు నమ్మక ద్రోహం
ఈ మధ్యన చంద్రబాబు రిజర్వేషన్లు ఆయన సొంత జాగీరయినట్లు జనరల్‌ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిని వారికి కేంద్రం కల్పించిన 10 శాతంలో.. 5 శాతం కాపులకు ఇస్తానని చెబుతూ గెజిట్‌ కూడా ఇచ్చాడు. చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లని తెచ్చిన చట్టం రాజ్యాంగపరంగా చెల్లదు. ఆ విషయం చంద్రబాబుకు తెలిసినా కాపులకు నమ్మక ద్రోహం మోసం చేస్తున్నాడు. చంద్రబాబు సామాజికంగా వెనుకబడిన తరగతుల వారి మీద ఒలకబోస్తున్నది నిజమైన ప్రేమ కాదు. కాపులు కూడా ఆయన్ను నమ్మరు. వారికి కూడా తెలుసు ఇది (రిజర్వేషన్లు) నిలవదని. 

నెహ్రూ కుటుంబాన్నైనా మరచిపోతారేమో గాని వైఎస్సార్‌ను మరువరు..
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా సంక్షేమ పథకాలను అమలు చేసి దేశం మొత్తాన్నీ ప్రభావితం చేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలలో నన్ను బాగా ప్రభావితం చేసింది ఆరోగ్య శ్రీ. ఎంతోమంది పేదలు
ఉచితంగా వైద్య సేవలు పొందారు. రాజశేఖరరెడ్డి పథకాలను ఎవరూ మరచిపోరు. నెహ్రూ కుటుంబాన్ని అయినా మరచిపోతారేమో గాని వైఎస్‌ను ప్రజలు మరచిపోరు.

నాడు హైటెక్‌ సిటీ పేరుతో దోపిడీ 
హైటెక్‌ సిటీ ఎక్కడ వస్తుందో తన కులస్తులకు, వర్గస్తులకు చంద్రబాబు ముందే చెప్పారు. ఎంతోమంది పేదలవి, అమాయకులవి ప్రత్యేకించి లంబాడీ ప్రజల భూములను కారు చౌకగా కొల్లగొట్టారు. నిజమైన పాలకుడైతే, దూరదృష్టి ఉన్న నాయకుడైతే.. పేదలకు ముందుగా హైటెక్‌ సిటీ వస్తుందని చెప్పి, భూములు అమ్ముకోవద్దు, మంచి రేటు వస్తుందని చెప్పి ఉండాల్సింది. కానీ చంద్రబాబు తన దూరదృష్డిని పేదల్ని మోసగించి కుట్రపూరితంగా తన వర్గం బాగు కోసం ఉపయోగించారు. అలాగే రింగ్‌రోడ్డు విషయంలోనూ తనకు కావాల్సిన వాళ్ల భూములున్న చోటల్లా అలైన్‌మెంట్‌ మార్చి లబ్ధి చేకూర్చారు.

నేడు అమరావతి పేరుతో దోపిడీ
ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులకు, ఇండిపెండెంట్‌ కమిటీకి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించాడు. నూజివీడని, దొనకొండని ఏవేవో పుకార్లు పుట్టించి.. అమాయకులందరూ అటువైపు భూములు కొనుక్కునేలా చేశాడు. ఆ తర్వాత తన కులం వాళ్లందరూ అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధానిని ప్రకటించారు.

చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సారవంతమైన భూముల్ని బలిపెట్టారు. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో చిత్తశుద్ధి గానీ, నిజాయితీగానీ, పారదర్శకత గానీ లేదు. హైటెక్‌ సీటీ అయినా.. రింగ్‌ రోడ్డయినా.. అమరావతి రాజధాని అయినా.. ఆయన తన వర్గం ప్రయోజనాలను మాత్రమే కాపాడారు. సామాన్యులకు చేసింది ఏమీ లేదు. 

డేటా చోరీ దుర్మార్గం
ఇప్పుడు ఎలాగూ బ్యాలెట్‌ పేపర్లు రావు గనుక అసలు ఓట్లనే గల్లంతు చేసే సరికొత్త పద్ధతులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తనకు వ్యతిరేకంగా ఉన్నోడి ఓటే తీసేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత కన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఉంటుందా?  నిజానికి ఓట్ల చేర్పింపుపై విస్తృతంగా ప్రచారం చేయాలి. ఓట్లు తొలగించడంలో భాగమే డేటా చోరీ.

ఎవరి ఓటు ఉంచాలో, ఎవరిది తీసివేయాలో తెలుసుకోవడం కోసమే ఈ డేటా చోరీ. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆధార్‌ సమాచారాన్నీ, ఎన్నికల కమిషన్‌ సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం తన చేతిలో ఉంది కదా అని ప్రైవేటు సంస్థలకు అప్పగించడమంటే ఓట్లను తొలగించడానికే. ఎవరేమిటో తెలుసుకోవడానికే చంద్రబాబుకు ఆ డేటా కావాల్సి వచ్చింది.  అందుకే వీరు తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. 

అసలైన క్విడ్‌ ప్రో కో ఓటుకు కోట్లు కేసు
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పచ్చిగా దొరికిపోయాడు. ఒకవేళ ఆ కేసులో ఏమీ పస లేదనుకుంటే.. విచారణ కోరి చంద్రబాబు తన నీతి నిజాయితీని నిరూపించుకోవచ్చు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కైపోయారు అప్పుడు. వాస్తవానికి అసలైన క్విడ్‌ ప్రో కో ఇది! కిందకు వస్తుందిది. ఇద్దరూ కూడబలుక్కుని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవద్దని అనుకుని ఉంటారని.. కేంద్రంలో ఉన్న పెద్ద బుర్రలు ఈ ఇద్దర్నీ కూర్చోబెట్టి రాజీ చేయడం వల్ల సహజ రీతిలో చార్జిషీట్‌ వేసి విచారణ జరగాల్సిన కేసు మూలపడిందన్నది నా అనుమానం.   

పార్టీ ఫిరాయింపులు క్విడ్‌ ప్రో కో
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తున్నారు, కార్లు, బంగళాలు ఇస్తున్నారు. అంటే.. దానర్థం ఏమిటీ? మీరు పార్టీ ఫిరాయించండి, మేము లబ్ధి చూపిస్తామనే కదా. ఇది కచ్చితంగా క్విడ్‌ ప్రో కో. 
పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయడం.. ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం వేరు కథ. దాని చట్టం వేరు. క్విడ్‌ ప్రో కో చట్టం వేరు. కానీ వైఎస్సార్‌ సీపీ వాళ్లు ఏమి చేశారంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించమని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాకాకుండా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ కింద చర్య తీసుకోమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసి.. వాళ్లను ప్రాసిక్యూట్‌ చేయమని అడగాలి. 

బీసీలకు తీవ్ర అన్యాయం 
చంద్రబాబు చర్య వెనుకబడిన తరగతుల(బీసీలకు) వారందరికి వ్యతిరేకం. అందుకే వెనుకబడిన తరగతుల వారంతా ఆయన మీద కోపంగా ఉన్నారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నీట్‌)లో ఎంబీబీఎస్‌ యూజీ సీట్లలో సెంట్రల్‌ పూల్‌ కింద కేటాయించిన 15 శాతం సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. దీనిపై బీసీలు చంద్రబాబును కలసి రిజర్వేషన్లు కల్పించాలని ఫిర్యాదు చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు  వ్యవహరిస్తున్నారు. దీంతో నేనే సుప్రీంకోర్టులో పిటిషన్‌(డబ్లు్యపీ నెంబర్‌ 323/2019) వేశా. త్వరలోవిచారణకు రానుంది. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారు. గ్రామ పంచాయితీల రిజర్వేషన్ల విషయంలోనూ అన్యాయంగానే
వ్యవహరిస్తున్నారు. 

సర్కారీ సొమ్ముతో ఓట్ల కొనుగోలు
అన్నిటి మాదిరే రాజకీయమూ వ్యాపారమైంది. తెలంగాణలో రాజ్యమేలుదామని మొన్న తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు పెద్దఎత్తున డబ్బు, దస్కాన్ని పెట్టి ప్రచారం నిర్వహించి దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆంధ్రలో ఆయన సీటు ఉంటుందో ఊడుతుందో, కుప్పం పోవాల్సివస్తుందో తెలియదు గాని, తెలంగాణలో మాత్రం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాడని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. చంద్రబాబే పెట్టుబడి పెట్టి, కులాలను విడదీసి, డబ్బులిస్తూ గెలవాలనుకుంటున్నారు.

ప్రజల్ని ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాలని చూస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణం. వాస్తవానికి రాజకీయం అంటే ప్రజాసేవ. రాజకీయ నాయకులు అంటే ప్రజా సేవకులు. జడ్జీలైనా, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గవర్నమెంటు ఉద్యోగులయినా, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా వారందరూ ప్రజా సేవకులు. వారికి ప్రజలే అధిపతులు. కానీ వీళ్లెవరయినా ప్రజా సేవకులమని అనుకుంటున్నారా? ప్రజల్ని భక్షించే వాళ్లు కనబడుతున్నారు గాని రక్షించే వాళ్లు లేకుండా పోయారు.   

ఆ మాటతో బాబు ఖంగు
యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ ప్రకాశరావు ఉన్నప్పుడు ఎవరో ఒక కేసు వేశారు. అదేమిటంటే ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను అడ్డం పెట్టుకుని కొందరు పారిశ్రామికవేత్తలు–వైఎస్‌ జగన్‌ పెట్టే సాక్షి దినపత్రికలో క్విడ్‌ ప్రో కింద పెట్టుబడులు పెట్టారని ఆరోపణ చేశారు. దాన్ని జస్టిస్‌ ప్రకాశరావు నా వద్దకు పంపారు. నిజానికి ఆ రోజు ఒక్క న్యాయవాది కూడా జగన్‌కు వ్యతిరేకంగా వాదించేందుకు ముందుకు రాలేదు. సీబీఐ వకీలు గానీ, అడ్వకేట్‌ జనరల్‌ గానీ మరెవ్వరూ గాని వ్యతిరేకించలేదు.

అయినా కూడా నా మనస్సాక్షి ప్రకారం.. ఇదేదో ఆరోపణ వచ్చింది..  ఏ తప్పూ చేయని సీత మీదనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె తన పాతివ్రత్యాన్ని ఎలా నిరూపించుకుందో.. అదే విధంగా ఈ ఆరోపణల్లో నిజమేమిటో నిగ్గు తేల్చాలని ఆవేళ నోటీసులు ఇచ్చా. ఆ తర్వాత వైవీ చౌదరి కుమార్తె పెళ్లిలో చంద్రబాబు కలిసి.. అన్నా, మీరు బాగా చేస్తున్నారన్నా అన్నాడు. అప్పుడు నేనన్నా.. ఆ ప్లేస్‌లో మీరున్నా (చంద్రబాబు) నేను అదే పని చేసి ఉండేవాణ్ణి అన్నా. అంతే చంద్రబాబు కంగుతిన్నాడు.  

నిజాయతీపరుడైతే స్టే తెచ్చుకోకుండా ఉండాల్సింది 
వైఎస్‌ విజయమ్మ వేసిన కేసు విషయానికి వస్తే– జస్టిస్‌ రోహిణీ, అశుతోష్‌ మహంతో బెంచ్‌కు ఈ పిల్‌ వస్తే వాళ్లు కొట్టి వేశారు. ఆ తీర్పు సమంజసం కాదని నేను గట్టిగా చెబుతా. ఎందుకంటే.. విజయమ్మ ఒక ఆరోపణ చేశారు. నిజంగా చంద్రబాబు ఏమీ తప్పు చేయకుంటే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించకుంటే.. తన పవిత్రతను నిరూపించుకోవాలనుకుంటే ఆ కేసును ఎదుర్కోవాల్సింది.

ఈవేళ జగన్‌ ఎదుర్కొంటున్నట్టే ఎదుర్కోవాల్సింది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా తమ బాధ్యతను విస్మరిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా చంద్రబాబును, వాళ్ల వర్గ సామ్రాజ్యాన్నికాపాడడానికే పని చేస్తోందనడం వాస్తవం. వాస్తవాలను అణచివేసి చంద్రబాబును విపరీతంగా హైప్‌ చేసేందుకు తాపత్రయపడుతున్నది. ఏ రోజన్నా ఆ పత్రికలు చంద్రబాబు చేసిన తప్పుల గురించి రాసిన పాపాన పోలేదు. 

రాత్రికి రాత్రే రిపోర్టు రాయించుకున్నారు.. 
కాపులపై ఆయన చిత్తశుద్ధి ఎంతటిదో చూడండి. మంజునా«ధ్‌ కమిషన్‌ వేశారు. ఆయన కాపుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై డేటా సేకరించారు. చంద్రబాబు ఆ డేటాను ఎందుకు ప్రచురించలేదు? మంజునాధ్‌ హైకోర్డు జడ్జిగా పని చేశారు. మంచి పేరున్న వ్యక్తి. మంజునాధ్‌ నివేదిక ఇవ్వడానికి ముందే ఐదుగురు సభ్యులున్న కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్‌ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టి పక్కదోవ పట్టించి నివేదిక తీసుకున్నారు. ఇదే కమిషన్‌ రిపోర్టని చెప్పుకున్నారు. కనీసం మరి దాన్నైనా ఎందుకు పబ్లిష్‌ చేయలేదు?  

హైకోర్టు ఏర్పాటువివాదంపై 
రాష్ట్ర విభజన తర్వాత 10, 15ఏళ్లు హైదరాబాద్‌లోనే హైకోర్టు ఉండే వెసులుబాటు ఉంది. అయితే కొందరు హైకోర్టు న్యాయవాదులు 2015లో కోర్టులో కేసు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కళ్యాణ్‌ సేన్‌ గుప్తా ఆదేశాలిస్తూ.. పూర్తిగా భవనాలు, మౌలిక వసతులు కల్పించే వరకు ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. చంద్రబాబు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ ఇస్తూ.. 2018 డిసెంబర్‌ 15లోగా అన్ని భవనాలు, సౌకర్యాలు పూర్తి చేస్తానని పేర్కొన్నారు. దాని ఆధారంగా రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారు.

2019 జనవరి 1న ఏపీలో హైకోర్టును ప్రారంభిస్తున్నట్టు నోటిఫికేషన్‌ వెలువడింది. తీరా అక్కడకు వెళితే భవనాలు పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలోనే కోర్టు ఏర్పాటయింది. ఈలోగా తాత్కాలికంగా ఒకటి పూర్తయిందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకువచ్చి ప్రారంభోత్సవం అంటూ హడావిడి చేశారు. అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి రాష్ట్రపతిని,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం పక్కదోవ పట్టించగలడు ఈ పెద్దమనిషి.  

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా చార్జీషీట్‌లో పేరు లేకపోవడమేంటి?
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరును వందసార్లు చెప్పి.. చార్జిషీట్‌లో ఆయన పేరు లేకుండా వేస్తే దాన్ని ఏమనుకోవాలి? అసలదేమి చార్జిషీట్‌. వీళ్లు చేయకపోయినా జడ్డి అయినా ఆ పని చేయవచ్చు. ఇప్పుడైనా చంద్రబాబు పేరును చేర్చి అదనపు చార్జిషీట్‌ వేయాలి. కేసు విచారణ జరపాలి. వాస్తవానికి సాక్ష్యాలను, ఆధారాలను బట్టి కేసు ఉంటుంది. కానీ అవన్నీ ఈవేళ మ్యానేజ్‌ అవుతున్నాయి కదా. ఇంత రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ కింద కేసు వేయకపోవడం ఏమిటో అర్థమే కావడం లేదు. నిజాయితీని నిరూపించుకున్నప్పుడే కదా ప్రజలలో క్రెడిబులిటీ ఉండేది, ఆ పని చంద్రబాబు చేయలేదు. 

ఓటును అమ్ముకోవద్దు
‘‘ప్రధానమంత్రి ఓటుకైనా.. కూలీ ఓటుకైనా ఒకటే విలువ. ఎవరైతే మీకు మంచి చేస్తారో వారికే ఓటు వేయాలి. డబ్బుకు, మద్యానికి ఆ ఓటును అమ్ముకోవద్దు. ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయండి. సామాజిక న్యాయం ఎవరుకల్పిస్తారో.. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజలతోనే తన జీవితాన్నికొనసాగిస్తున్న వ్యక్తులకే ఓటు వేయాలి. నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించాలి’’ 

పాఠశాల విద్యను జాతీయం చేయాలి..
పాఠశాల విద్యను జాతీయం చేయాలని నేను జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాధమిక విద్య ఎంత బాగుంటే ..భావితరం అంత బాగుంటుంది.  విద్య, వైద్యం, పెన్షన్ల వంటి వాటిని జగన్‌ నవరత్నాల్లో ప్రకటించారని పేపర్లలో చదివా. జగన్‌కు నా విజ్ఞప్తి ఏమిటంటే.. చట్టసభలలో ఇంతవరకు అడుగుపెట్టని కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి.   

– ఆకుల అమరయ్య, సాక్షి ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement