ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన కొన్ని సూచనలు ఆహ్వానించదగినవే. కాకపోతే ముందుగా వాటిని ఆయనకు లేదా, గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన రాజకీయ పార్టీకి వర్తింపచేసుకుని, తదుపరి ఇతర పార్టీలకు సూచించి ఉంటే అర్దవంతంగా ఉండేది. రాజకీయ పక్షాలు బాద్యతారహితంగా, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిలలో చర్చ జరగాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు, ఇతర వ్యవస్థలలో వేళ్లూనుకుంటున్న కులం, మతం, ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుణం, సామర్థ్యం, యోగ్యత, నడతలకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉండగా వాటి స్థానంలో కులం, డబ్బు, మతం, నేర స్వభావాలకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.
ఇవన్ని ఆయన జనరల్‌గా మాట్లాడినట్లు కనిపించినా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మాట్లాడుతున్నారన్న భావన కలగడమే ఇబ్బందికరంగా ఉంటోంది. ఇతర రాష్ట్రాలలో ఉచిత హామీలుకాని, ఆచరణ సాద్యం కాని వాగ్దానాలు అనేకం చేస్తున్నా వాటిని పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్న కొందరు ప్రముఖులు ఎపికి వచ్చేసరికి మాత్రం సుద్దులు చెబుతున్నారన్న అనుమానం ఉంది. వెంకయ్య నాయుడు కూడా అలా మాట్లాడేరేమోనన్న సంశయం వస్తుంది. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఏపీలో ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని బిజెపి నేతలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
నిజమే.. అసలు గుమ్మడి కాయల దొంగలను వదిలేసి, ఇతరులపై మాత్రం నిందలు మోపుతున్నారన్న భావన కలిగితేనే విమర్శలు వస్తాయన్న సంగతి గ్రహించాలి. అలాగే తమకు కావల్సినవారు ముఖ్యమంత్రిగానో, మరే కీలకమైన పదవిలోనో ఉన్నప్పుడు గుర్తుకు రాని అంశాలు ఇప్పుడే జ్ఞప్తికి వస్తున్నాయన్న భావన కలిగితేనే ప్రతిస్పందన వస్తుంది. లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. నిజంగానే వెంకయ్యనాయుడు ధైర్యంగా చెప్పదలిచి ఉంటే, ఏ ఏ హామీలు ఆచరణ సాధ్యం కానివో నిర్దిష్టంగా చెప్పగలిగి ఉండాల్సింది. అలాగే ఏ స్కీములు వృదా అయినవో ఆయన వివరించి ఉండాలి. అలాకాకుండా ఏపీకి వచ్చి ఆ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వెంకయ్య వంటివారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం వస్తుంది.
మరి అదే వెంకయ్య నాయుడు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఏకంగా లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు తనపక్కనే కూర్చున్న చంద్రబాబును ఉద్దేశించి అదెలా సాధ్యమని అప్పటికప్పుడే సభలలో ప్రశ్నించి ఉంటే ప్రజలంతా ఆయనను శెహబాష్ అని మెచ్చుకునేవారు. లక్షల కోట్లతో అమరావతి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు హడావుడి చేసినప్పుడు అదెలా కుదురుతుందని వెంకయ్య అడిగి ఉంటే అంతా బాగా మాట్లాడారని అభినందించేవారు. టీడీపీ వందల కొద్ది హామీలు ఇచ్చినప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉంది. వారి పార్టీతో తమకు ఏమి సంబంధం అని తప్పించుకోవచ్చు. కాని ఇద్దరూ కలిసి ప్రచారం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు కదా!పోనీ బీజేపీ చేసిన వాగ్దానాల విషయానికే వద్దాం. తిరుపతిలో మోదీగారితో కలిసి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యమైనదా?కాదా? అది సాధ్యమైనదే అయితే కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? వెంకయ్య దాని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు.
ఆంద్ర ప్రదేశ్కు కేంద్ర మంత్రిగా వెంకయ్య ఏమీ చేయలేదని అనజాలం. ఆయా విద్యాసంస్థలు రావడానికి ఆయన కృషి చేశారు. అది వేరే విషయం. కాని ప్రత్యేక హోదాను వెంకయ్యే పట్టుబట్టి సాధించారని 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా చెప్పుకున్నారు కదా?కాని అది ఇవ్వలేదు. అంటే వెంకయ్య ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చారా? ఉత్తరప్రదేశ్‌లో పలు ఉచిత స్కీములతో పాటు రుణమాఫీ హామీ కూడా 2017 ఎన్నికలలో ఇచ్చారు. అప్పుడు వెంకయ్య అలాంటివి వద్దని చెప్పలేకపోయారే. ముస్లింల మక్కా యాత్రకు సబ్జిడీ ఇవ్వడంపై విమర్శించే బీజేపీ నేతలు నాగాలాండ్లో క్రైస్తవులు జెరుసలెం వెళ్లడానికి ఆర్దిక సాయం చేస్తామని ఎలా ప్రకటించారు. మరి అది తప్పా?రైటా? అన్నది కూడా ఆయన తెలియచేయాలి.
తెలంగాణలో దళితులకు పదిలక్షల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిని వెంకయ్య నాయుడు వ్యతిరేకిస్తే ఆ మాట ఆ రాష్ట్రంలో చెప్పి ఉండాలి కదా? ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెడితే వెంకయ్యతో సహా కొందరు ప్రముఖులు గగ్గోలుగా మాట్లాడారు. వారి పిల్లలు, మనుమళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. తెలంగాణలో ఆంగ్ల మీడియం పెడితే మాత్రం ఎవరూ నోరెత్తలేదు. ఇదంతా తమాషాగా ఉంటుంది. బీజేపీ ఎదిగిందే మతపునాదుల మీద అన్నది అత్యధిక ప్రజల అభిప్రాయం.
దానిని నిర్దారిస్తూ ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకు కూడా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు?మరి అది సరైనదేనా? కర్నాటకలో హిజబ్ వివాదం వంటివాటిని సృష్టించింది ఎవరు? దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ హామీ ఇవ్వడం సరైనదేనా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని అంటున్నారు. అది మత సామరస్యానికి ఉపకరిస్తుందా? జమ్ము-కశ్మీర్ లో ఆర్టికిల్ 370 రద్దు చేస్తామని బీజేపీ గతంలోనే చెప్పింది.
దానిని మోదీ ప్రభుత్వం అమలు చేసింది. కాని ఆ తర్వాత ఇంతవరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదు. పైగా ఉగ్రవాదుల బెడద పోలేదు. మరి బీజేపీ విదానం ఆచరణ సాధ్యం అనుకోవాలా? లేక కాదనుకోవాలా;? ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్లుగా మాట్లాడితేనే విమర్శలు వస్తాయి.ఆంద్రప్రదేశ్‌లో మతం పేరుతో వివాదాలు సృష్టించడానికి బీజేపీ నేతలు గత రెండేళ్లలో ఎన్ని ప్రయత్నాలు చేసింది తెలియదా? కాకపోతే ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నందువల్ల ఆయన వీటి గురించి పట్టించుకుని ఉండకపోవచ్చు. ఏపీ వచ్చినప్పుడు ఆ విషయాలు ప్రస్తావించడం ఆయనకు ఇబ్బంది కావచ్చు.
కులం గురించి ఆయన మాట్లాడారు. వద్దన్నారు. ఆ భావనే వద్దన్నారు. కాని ఆచరణలో అలాగే ఉంటోందా? ఈ విషయంలో ఆయన చుట్టూ ఉన్నవారి గురించి రాయడం ఇష్టం లేదు. కర్నాటకలో ఎడ్యూరప్పను కాని, ఆ తర్వాత బొమ్మైని కాని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో తెలియదా? ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల ,పోలీసు అదికారుల సమావేశంలో మాట్లాడుతూ తమవారికే పనులు చేయాలని చెబితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కులం,మతం, చూడవద్దు, ప్రాంతం చూడవద్దు, పార్టీ చూడవద్దు అని అదే అధికారులకు సూచించారే.
ఆయా సంక్షేమ పధకాలలో జగన్ అలాగే చేస్తున్నారే. మరి వెంకయ్య దానిని గుర్తించరా? గుణం గురించి మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఒక ప్రముఖుడు ఇరుక్కుంటే కాపాడింది ఎవరు? అలాంటివి ఏ కేటగిరి కిందకు వస్తాయి? నిజంగానే పార్టీలను చూడదలిస్తే కృష్ణా జిల్లా పరిషత్ ఆవరణలో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రముఖుడు, ఇప్పటి టీడీపీ నేత తండ్రి అయిన పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహానికి అనుమతి ఇచ్చి ఉండేవారా? అలాగే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరుతో జగన్ జిల్లా ఏర్పాటు చేసి ఉండేవారా?. ఆయా సంక్షేమ పధకాలు కులం, మతం చూడకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి వేస్తున్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? వృద్దులకు ఇళ్లవద్దకే పెన్షన్ ఇచ్చే కొత్త సంస్కృతిని తీసుకు వచ్చింది జగన్ కాదా? మరి వీటన్నిటిని కూడా వెంకయ్య నాయుడు పరిగణనలోకి తీసుకుని మాట్లాడి ఉంటే అంతా ప్రశంసించేవారు. ఏది ఉచితం కాదు. ఏది కాదు.. అంటే కాలాన్నిబట్టి పరిస్థితిని బట్టి మారిపోతుంది.
ఒకప్పుడు ఎన్.టి.ఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటే అప్పటి ఇతర రాజకీయ పక్షాలు ఆయనను తీవ్రంగా విమర్శించాయి. కాని చివరికి ఆయనే రైట్ అయ్యారు. 1994లో తిరిగి ఆయన అదే స్కీమ్ తీసుకు వచ్చినప్పుడు అది మానవ ఉత్సాదకకు సంబందించిన అంశం కనుక కాపిటల్ వ్యయం గా చూడాలని తెలుగుదేశం వాదించింది. మరి ఇప్పుడు బడులను నాడు-నేడు కింద అభివృద్ది చేయడం పెట్టుబడి వ్యయం అవుతుందా?లేదా ? కనీసం ఈ అంశాలకైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించి, ఆ తర్వాత ఆయన చెప్పదలిచిన హితోక్తులు చెప్పి ఉంటే ఎవరూ ఆక్షేపించేవారు కాదు కదా? ఏది ఏమైనా వెంకయ్య నాయుడు గొప్పవారు. ఆయన గొప్పస్థానంలో ఉన్నారు. అయినా ఆయన పక్షపాతంగా మాట్లాడుతున్నారన్న భావన సమాజానికి వెళ్లడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్ రాయడం జరిగింది తప్ప, ఆయనపై గౌరవం లేక కాదు.
కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment