సీఎం వైఎస్ జగన్‌: ఇంగ్లిష్‌ మీకేనా? | YS Jagan Fires on Chadrababu Naidu, Pawan Kalyan and Venkaiah Naidu Over Comments on English Medium - Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మీకేనా? : సీఎం జగన్‌

Published Tue, Nov 12 2019 3:08 AM | Last Updated on Tue, Nov 12 2019 10:40 AM

CM YS Jagan Comments On Chandrababu and Pawan Kalyan and Venkaiah About English Medium - Sakshi

ప్రముఖ కవి అబ్దుల్‌ సలాం షహెమేరీకి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ నేషనల్‌ అవార్డు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌

అయ్యా చంద్రబాబు గారూ.. మీ కొడుకు ఏ మీడియంలో చదివారు? రేపు మీ మనవడు ఏ మీడియంలో చదవబోతున్నాడు? అయ్యా వెంకయ్యనాయుడు గారు.. మీ కొడుకు, మనవళ్లు ఏ మీడియంలో చదివారు? అయ్యా యాక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌ గారూ.. మీకు ముగ్గురు భార్యలు, నలుగురో అయిదుగురో పిల్లలు.. మరి వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?

సాక్షి, అమరావతి బ్యూరో: ఇంగ్లిష్‌ మీడియంలో చదివితేనే  పోటీ ప్రపంచంలో రాణించగలమని, అందుకే మన పిల్లలు కూడా గొప్ప పాఠశాలల్లో ఇంగ్లిష్‌  మీడియంలో చదవాలని ఆరాటపడి వారం క్రితం జీఓ విడుదల చేయగానే ఏం జరుగుతోందో మనందరం చూస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి ఇంగ్లిష్‌ మీడియం ఎందుకని.. తెలుగు మీడియం చాలదా? అనే స్వరాలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన అన్నారు. విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం భారతరత్న డాక్టర్‌ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 132వ జయంతి సందర్భంగా మైనార్టీ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం మాట్లాడారు. దేశ తొలి విద్యా మంత్రిగా ఎనలేని సేవలందించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి (నవంబరు 11)ని అప్పట్లో మహానేత వైఎస్సార్‌ 2008లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. మౌలానా.. సుదీర్ఘంగా 1958 వరకు 11 ఏళ్ల పాటు దేశ తొలి విద్యా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేశారని, నేడు ఉన్న పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించినవేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

చదువుల దీపం కుటుంబాలకు వెలుగునిస్తుంది 
‘‘నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో పేదల గుండెచప్పుడు విన్నాను. వారి కష్టాలు స్వయంగా చూశాను. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారు. ఇదే సమయంలో దేశంలో సగటున అది 27 శాతం మాత్రమే. ఈ పరిస్థితి మారాలి. మనం ఇంగ్లిష్‌ మీడియంలో చదవక పోవడం వల్ల చాలా నష్టపోయాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే పేద కుటుంబాల బతుకు మారుతుంది. ప్రతి పేదవాడి ఇంట్లో ఓ ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ తయారైతేనే వారి జీవితాలు మారుతాయి. అందుకే ఆ దిశగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తాం. తెలుగు, ఉర్దూలలో ఏదో ఒక భాష తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 7,8,9,10 తరగతుల్లో వరుసగా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తాం. ఆ విధంగా మన పిల్లలు నాలుగేళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ వంటి పరీక్షలు చక్కగా రాయగలుగుతారు. 

‘నాడు – నేడు’కు 14న శ్రీకారం
నవంబరు 14న ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రాష్ట్రంలో 45 వేల స్కూళ్లు ఉండగా, వాటిలో 15 వేల స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఆయా స్కూళ్ల ప్రస్తుత ఫొటోలు తీస్తాం. వాటిని పూర్తిగా మార్చిన తర్వాత పరిస్థితిని చూపుతాం. ప్రతి స్కూల్‌లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌ బోర్డులు, ఫ్యాన్‌లు, ప్రహరీ, మంచి నీరు, లైట్లు వంటి అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తాం. నాడు–నేడు కార్యక్రమంలో మార్పు చేసే స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 

ఉన్నత విద్యలోనూ మార్పులు 
స్కూళ్ల దగ్గర నుంచి మొదలయ్యే విప్లవాత్మక మార్పులు ఉన్నత విద్య వరకు విస్తరిస్తాం. తద్వారా పిల్లలు ఉద్యోగాలకు దగ్గరయ్యే విధంగా మార్పులు చేస్తాం. అన్ని కోర్సుల్లో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ అమలు చేయబోతున్నాం. ఉన్నత విద్యలో పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేస్తాం. ఆ విద్యార్థులకు హాస్టల్, మెస్‌ చార్జీల కింద రూ.20 వేలు ఇస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డిసెంబర్‌ లేదా వచ్చే జనవరిలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలను వారికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా చేతిలో పెడతాను. 

మదర్సా బోర్డు ఏర్పాటు 
మదర్సాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని అ«ధికారులను ఆదేశించాం. అక్కడ వారు బోధిస్తున్న భాషతో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో విద్యను అభ్యసించాలి. అందుకు వారు ఒప్పుకుంటే అమ్మ ఒడి పథకం కూడా అమలు చేస్తాం. గతంలో పెళ్లికానుక అని చంద్రబాబునాయుడు పెట్టిన పథకం ఆగిపోయింది. ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన ఏ పథకం కూడా అమలు కాలేదు. అందుకే వైఎస్సార్‌ పెళ్లికానుక అమలు చేస్తాం. గతంలో ఇచ్చిన రూ.50 వేలకు బదులు రెటింపు మొత్తంలో లక్ష రూపాయలు సహాయం చేస్తాం. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నాకు గుర్తున్నాయి. మార్చి వరకు సమయం ఇస్తే అమలు చేస్తాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు షేక్‌ బి.అంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను,  మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్,  కె.రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, మైనార్టీ నేత జనాబ్‌ రెహమాన్, ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ అకాడమి చైర్మన్‌ ఎస్‌ ఎండి ఇలియాజ్‌ రిజ్వీ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ మాధవీలత, మైనార్టీ, విద్యా శాఖల అధికారులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


అవార్డుల ప్రదానం
ఉర్దూ భాషలో సేవలు అందించిన వారితో పాటు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు సీఎం వైఎస్‌ జగన్‌ పురస్కారాలను ప్రదానం చేశారు. తొలుత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ నేషనల్‌ అవార్డు కింద లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని వైస్సార్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సీఎస్‌ అబ్దుల్‌ సలాం షహెమేరీకి ప్రదానం చేశారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల కింద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ మహ్మద్‌ నిస్సార్‌ అహ్మద్, అధ్యాపకుడు డాక్టర్‌ సయ్యద్‌ మున్నీర్‌ మోహియుద్దీన్, రిటైర్డ్‌ ఉర్దూ లెక్చరర్‌ డాక్టర్‌ జీనత్‌ మున్నీసా, ప్రధానోపాధ్యాయులు సయ్యద్‌ హిదయతుల్లా, ఖాజీం అబ్దుల్‌ మక్బూల్‌లకు ప్రదానం చేశారు. 35 మందికి బెస్ట్‌ ఉర్దూ టీచర్‌ అవార్డు, 33 మందికి బెస్ట్‌ ఉర్దూ స్టూడెంట్‌ అవార్డు అందజేశారు. పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన టి.దుర్గాభవానీ, కె.నితీష్‌ చంద్ర, వై.హారిక, టి.గ్రీష్మ, మారుతీ భాగ్యలక్ష్మి, పూజిత, ఇంటర్‌లో ప్రతిభ చూపిన వి.శివప్రసాద్, ఎం.శ్రీనివాస్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో జీహెచ్‌ శ్రీదేవి, గీతాదేవి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విభాగంలో అడుసుమిల్లి సాయితేజా, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో దివ్యవెంకట కొండలకు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యా పురస్కారాలను సీఎం అందజేశారు.

మైనార్టీల అభివృద్ధికి రూ.952 కోట్లు
భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని 2008లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినంగా ప్రకటించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుంది. ఖరగ్‌పూర్, ముంబయిలో ఐఐటీలు స్థాపించడంతో పాటు సాహిత్య అకాడమీ, నృత్యం, మ్యూజిక్, డ్రామా అకాడమీలను స్థాపించేందుకు ఆజాద్‌ కృషి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.952 కోట్లు కేటాయించడం ద్వారా మైనార్టీల పట్ల వైఎస్‌ జగన్‌ తన ప్రేమను చాటుకున్నారు. ముస్లిం మహిళల వివాహానికి సాయం రూ.లక్షకు పెంపు, ఇమామ్, మౌజమ్‌ల గౌరవ వేతనం పెంపు, ఇఫ్తార్‌ విందులకు నిధుల కేటాయింపు, స్వయం ఉపాధి, స్కిల్‌ డెవలప్‌మెంట్,  హజ్‌ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక వసతులు, ఏపీ స్టేట్‌ ఉర్ధూ అకాడమి, ముస్లింలతో పాటు క్రైస్తవులు, నూర్‌ బాషా ఫెడరేషన్‌లకు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 
– షేక్‌ అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి) 

విద్యతోనే పేదరికం నిర్మూలన
నాణ్యమైన విద్యతో పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పని చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని.. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన అంజాద్‌ బాషాకు ఉప ముఖ్యమంత్రి హోదాను ఇవ్వడం ద్వారా మైనార్టీల పట్ల వైఎస్‌ జగన్‌ తన ప్రాధాన్యతను చాటుకున్నారు. అబ్దుల్‌ కలాం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను అందిస్తున్నాం. ఈసారి ఈ అవార్డులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికే ఇస్తున్నాం. తద్వారా వారిని ప్రోత్సహించడం, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా వారిని తయారు చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. జగనన్న అమ్మ ఒడి పథకం దేశ చరిత్రలోనే ఒక చక్కటి పథకంగా నిలిచిపోతుంది.  
– ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖామంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement