ఐఐటీల్లో ఫీజుల మోత | The crash of IIT fees | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ఫీజుల మోత

Published Tue, Jan 12 2016 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ఐఐటీల్లో ఫీజుల మోత

ఐఐటీల్లో ఫీజుల మోత

♦ ఐఐటీల్లో 150 శాతం, ఎన్‌ఐటీల్లో 300 శాతం పెంపునకు హెచ్‌ఆర్‌డీ ఓకే
♦ వారం పది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం
♦ {పతిపాదన అమల్లోకి వస్తే వార్షిక ఫీజులు
♦ ఐఐటీల్లో రూ. 2.5 లక్షలు, ఎన్‌ఐటీల్లో రూ. 2 లక్షలు
♦ పేద విద్యార్థులకు గ్యారంటీతో నిమిత్తం లేని బ్యాంక్ రుణాలు..
♦ ఓబీసీలకు క్రీమీలేయర్‌ను బట్టి మినహాయింపు
 
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల్లో చదువు ఇక మరింత భారం కానుంది. పేద విద్యార్థులకు వీటిల్లో చదువు మరింత దూరం కానుంది. ఈ విద్యా సంస్థల్లో ఫీజులు భారీగా పెరగనున్నాయి. పెరి గిన జీతభత్యాల ఖర్చు, ఇతర వ్యయాలను తట్టుకునేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజును 300% పెంచాలన్న ఎన్‌ఐటీ, 150% పెంచాలన్న ఐఐటీల ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదముద్ర వేసింది. తదుపరి జరిగే కేం ద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణ యం తీసుకుని.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోనూ ఫీజులు పెంచనున్నారు.

 పెంపుపై ఇప్పటికే నిర్ణయం
 ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఫీజులు పెంచాలని గతేడాది అక్టోబర్‌లోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో బీహార్ ఎన్నికలు ఉండడంతో దానిని వాయిదా వేసింది. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ ఈ ఫీజు పెంపు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం వస్తే ఈ ఏడాది జూలై నుంచి ఐఐటీ ల్లో చేరే విద్యార్థులు ఏటా రూ. 2.5 లక్షలు, ఎన్‌ఐటీల్లో చేరేవారు రూ. 2 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంటే నాలుగేళ్ల బీటెక్ కోర్సు పూర్తయ్యేసరికి రూ. 10లక్షలు, రూ. 8 లక్షలు కట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం వార్షిక ఫీజులు ఐఐటీల్లో రూ. 90 వేలు, ఎన్‌ఐటీల్లో రూ.70 వేలు మాత్రమే. ఇక ఐఐటీలు, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే 22 శాతం మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మొత్తం ఫీజును భరిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వారి క్రీమీలేయర్‌ను బట్టి ఫీజులో కొంత మినహాయింపు ఉంటుంది.

 విద్యార్థులకు బ్యాంకు రుణాలు
 పేద విద్యార్థులకు బ్యాంకుల నుంచి విద్యా రుణాలిప్పించాలని కేంద్రం భావిస్తోంది. విదేశీ విద్యకు మంజూరు చేస్తున్న తరహాలో కాకుండా వీటికి విద్యార్థి కుటుంబ ఆదాయంతో నిమిత్తం లేకుండా రుణాలు ఇస్తారు. ఐఐటీ లేదా ఎన్‌ఐటీకి ఎంపికైన విద్యార్థి  రుణం కోసం తన కుటుంబ సంవత్సరాదాయం వివరాలను సం బంధిత జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా 15 రోజుల్లోగా అందజేయాలి. ఏటా రూ. 2లక్షల కంటే తక్కువ ఆదాయమున్నవారికి మాత్రమే కేంద్రం కొంత ఫీజును స్కాలర్‌షిప్ రూపేణా, కొంత బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుతుంది.  కోర్సు కొనసాగే నాలుగేళ్లపాటు ఈ విద్యా రుణానికి 4 శాతం వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్ కోర్సుకు ఎంపికయ్యే శారీరక వికలాంగులకు మొత్తం ఫీజు రాయితీ ఉంటుంది.

 ఒక్కో విద్యార్థికి వ్యయం రూ. 3.5 లక్షలు
 ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి కోసం ఏటా సగటున రూ. 3.5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విద్యార్థి చెల్లిస్తున్న రూ. 90 వేల కంటే ఇది రూ.2.6 లక్షలు అధికం. ప్రస్తుతం మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన రూ.2.5 లక్షల ఫీజు అమల్లోకి వచ్చినా కేంద్రం పై కొంత భారం కొనసాగుతుంది. ఎన్‌ఐటీల్లో ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షలు ఖర్చవుతుండగా.. ప్రస్తుతం విద్యార్థుల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రూ.2 లక్షలకు ఫీజు పెం చినా ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష వరకు కేంద్రంపై భారం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తు న్న నేపథ్యంలో ఫీజులు పెంచవచ్చంటూ కేం ద్రం నియమించిన కమిటీ పచ్చజెండా ఊపిం ది. ఐఐటీ, ఎన్‌ఐటీల ప్యాకేజీల వివరాలను కూడా కమిటీ  నివేదికలో పొందుపరిచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement