ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ...
ఏలూరు : ఒకే పార్టీలో పుట్టాను... అదే పార్టీలో పెరిగాను... చివరి వరకు అక్కడే ఉంటానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్.ఐ.టి సంస్థకి మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం ఏడు విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ తప్పక వస్తుందన్నారు.
ఏపీ ఎక్స్ప్రెస్ వేగాన్ని కూడా తప్పకుండా పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. భుమి లేకుండా విద్యా సంస్థలు, ఇళ్లు, రైళ్లు వస్తాయా అంటూ భూ సేకరణను అడ్డుకుంటున్నా వారిని పరోక్షంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను ముందు చూపు లేకుండా విభజించిన వారు నన్ను విమర్శిస్తున్నారని వెంకయ్య ఆరోపించారు.
మన ప్రధాని దుబాయి పర్యటన సందర్భంగా అక్కడి యువరాజు ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ మోదీని కలిశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో వారసత్వం కాదు... జవసత్వం కావాలన్నారు. రాష్ట్ర నాయకుల గురించి ప్రస్తావిస్తూ ఢిల్లీలో ఎవరిని కలిసేందుకు వచ్చినా ముందే నా వద్దకే వస్తారన్నాని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.