సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లోనూ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే కొన్ని కేటగిరీల్లో అర్హుల కొరతతోనూ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు చేరినవారిలోనూ కొంతమంది వేర్వేరు కారణాలతో మధ్యలో చదువు మానుకుంటున్నారు. దీనివల్ల కూడా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్‌డీ విభాగాల్లో గత రెండు, మూడేళ్లుగా మిగిలిపోతున్న సీట్లను గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందని చెబుతున్నారు.
గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్న సీట్లు..
కొన్ని కేటగిరీల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోతుండడంతో గత కొన్నేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. దేశంలో 23 ఐఐటీల్లో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీల్లో 2020–21లో 5,484 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో 476 సీట్లు బీటెక్‌లోనివే. ఇక పీజీ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ 5,296 సీట్లు మిగిలిపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. యూజీలో 361 సీట్లు, పీజీలో 3,083 సీట్లు, పీహెచ్‌డీలో 1,852 ఖాళీగా ఉండిపోయాయి.
ఎన్‌ఐటీల్లోనూ మిగులు..
ఇక ఎన్‌ఐటీల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మొత్తం 31 ఎన్‌ఐటీల్లో 2020–21లో 3,741 సీట్లు, 2021–22లో 5,012గా ఉన్నాయి. యూజీ కోర్సుల్లో కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ సీట్లు మిగిలిపోతున్నాయి. 2021లో 2,487 మిగలగా 2021–22లో ఈ సంఖ్య 3,413కి చేరింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించలేకపోవడమే సీట్లు మిగిలిపోవడానికి కారణమని కేంద్రం గతంలోనే తేల్చింది. జాతీయ విద్యాసంస్థల్లోకి ప్రవేశించాలంటే నిర్ణీత పరీక్షల్లో అభ్యర్థులు అర్హత మార్కులను సాధించాల్సిందే. ముఖ్యంగా వివిధ రిజర్వేషన్ల కేటగిరీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి.
2022–23కి సీట్ల అందుబాటు ఇలా..
2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ తొలి విడతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇటీవలే పూర్తి చేసింది. ఇక రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 11న అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు తదితర విద్యాసంస్థల్లో సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించనుంది. ఈసారి యూజీ ప్రథమ సంవత్సరానికి ఐఐటీల్లో 16,234, ఎన్‌ఐటీల్లో 23,997 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
110 జాతీయ విద్యాసంస్థలు
దేశంలో ఐఐటీలు సహ వివిధ కేటగిరీల్లో 110 జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నవే. 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 1 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు (ఐఐఎస్‌ఈఆర్‌లు), 29 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వివిధ విభాగాల వారీగా 50,882 సీట్లు ఉన్నాయి.
వీటిలో ఐఐటీలు, ఎన్‌ఐటీలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌కు ఏటా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించినవారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తున్నారు. ఇందులోనూ నిర్దేశిత అర్హత మార్కులు సాధించి టాప్‌లో నిలిచినవారిని ఐఐటీలకు ఎంపిక చేస్తున్నారు. మిగిలినవారికి ఎన్‌ఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), దివ్యాంగులు ఇలా ఆయా కేటగిరీల్లో సీట్లు కేటాయింపు జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment