National Institutes of Technology
-
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్‌గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్‌టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్‌టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ మిగులు సీట్లు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేటగిరీల్లో అర్హుల కొరతతోనూ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు చేరినవారిలోనూ కొంతమంది వేర్వేరు కారణాలతో మధ్యలో చదువు మానుకుంటున్నారు. దీనివల్ల కూడా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్డీ విభాగాల్లో గత రెండు, మూడేళ్లుగా మిగిలిపోతున్న సీట్లను గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్న సీట్లు.. కొన్ని కేటగిరీల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోతుండడంతో గత కొన్నేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. దేశంలో 23 ఐఐటీల్లో వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీల్లో 2020–21లో 5,484 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో 476 సీట్లు బీటెక్లోనివే. ఇక పీజీ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ 5,296 సీట్లు మిగిలిపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. యూజీలో 361 సీట్లు, పీజీలో 3,083 సీట్లు, పీహెచ్‌డీలో 1,852 ఖాళీగా ఉండిపోయాయి. ఎన్ఐటీల్లోనూ మిగులు.. ఇక ఎన్ఐటీల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మొత్తం 31 ఎన్ఐటీల్లో 2020–21లో 3,741 సీట్లు, 2021–22లో 5,012గా ఉన్నాయి. యూజీ కోర్సుల్లో కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ సీట్లు మిగిలిపోతున్నాయి. 2021లో 2,487 మిగలగా 2021–22లో ఈ సంఖ్య 3,413కి చేరింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించలేకపోవడమే సీట్లు మిగిలిపోవడానికి కారణమని కేంద్రం గతంలోనే తేల్చింది. జాతీయ విద్యాసంస్థల్లోకి ప్రవేశించాలంటే నిర్ణీత పరీక్షల్లో అభ్యర్థులు అర్హత మార్కులను సాధించాల్సిందే. ముఖ్యంగా వివిధ రిజర్వేషన్ల కేటగిరీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. 2022–23కి సీట్ల అందుబాటు ఇలా.. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ తొలి విడతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే పూర్తి చేసింది. ఇక రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 11న అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర విద్యాసంస్థల్లో సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించనుంది. ఈసారి యూజీ ప్రథమ సంవత్సరానికి ఐఐటీల్లో 16,234, ఎన్ఐటీల్లో 23,997 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 110 జాతీయ విద్యాసంస్థలు దేశంలో ఐఐటీలు సహ వివిధ కేటగిరీల్లో 110 జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నవే. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు (ఐఐఎస్ఈఆర్లు), 29 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వివిధ విభాగాల వారీగా 50,882 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐఐటీలు, ఎన్ఐటీలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌కు ఏటా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించినవారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. ఇందులోనూ నిర్దేశిత అర్హత మార్కులు సాధించి టాప్‌లో నిలిచినవారిని ఐఐటీలకు ఎంపిక చేస్తున్నారు. మిగిలినవారికి ఎన్ఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), దివ్యాంగులు ఇలా ఆయా కేటగిరీల్లో సీట్లు కేటాయింపు జరుగుతోంది. -
జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ పైనా ప్రభావం జేఈఈ మెయిన్ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్డ్ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. -
తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ఇళ్లు సీజ్
సాక్షి, హన్మకొండ(కాజీపేట): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్‌రావు ఇళ్లు, ఆస్పత్రులపై బుధవారం తెల్లవారుజామున సీబీఐ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రహమత్‌నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉండే డైరెక్టర్ ఇళ్లపై విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన సీబీఐ సీఐ ఎ.సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు) -
గేటు దాటకుండానే ఆఫర్ లెటర్లు.. అమెజాన్‌లో ముగ్గురికి రూ.32 లక్షల జీతం
సాక్షి, తాడేపల్లిగూడెం: నిట్ విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో లక్షల్లో వేతనాలతో లక్కీచాన్స్ కొట్టేశారు. ఇంకా నిట్ గేటు దాటకుండానే ఆఫర్లు లెటర్లు అరచేతిలోకి వస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు(ఎంఎన్సీ) ఏపీ నిట్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి క్యూ కడుతున్నాయి. 2018–22 బ్యాచ్‌లో అప్పుడే 170 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఏడాది వేతనం కనిష్టగా 7.8 లక్షలు కాగా.. గరిష్టంగా రూ.26 లక్షలు పొందారు. 2017–21 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ. 32 లక్షల ప్యాకేజీతో అదుర్స్ అనిపించారు. దీంతో ఆరేళ్ల క్రితం నిట్ ఏర్పాటైప్పుడు ఎంఎన్సీలకు నిట్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కొత్త నిట్‌లో ల్యాబ్‌లు సరిగా ఉండవు, విద్యా బోధన ఎలా ఉంటుందో అన్న అనుమానంతో క్యాంపస్ ఇంటర్వూ్యలపై వెనకడుగు వేశారు. అయితే ఏపి నిట్ విద్యార్థులు తమ టాలెంట్‌తో ఆ సందిగ్ధతకు చెక్ పెట్టారు. 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఏడాది వేతనంగా కనీసం రూ.3.5 లక్షలు, గరిష్టంగా రూ.6 లక్షల ప్యాకేజ్ పొందడమంటే జాక్‌పాట్‌గా విద్యార్థులు భావించేవారు. ఇప్పుడు భారీ వేతనాల తో ఆఫర్లు రావడంతో నిట్‌లో చదివేందుకు క్రేజ్ పెరగుతోంది. నిట్‌లో ప్లేస్‌మెంటు, ట్రైనింగ్ సెల్ శిక్షణ ఫలవంతమైంది. నిట్ డైరెక్టర్ అండ్ టీమ్ కృషి ఫలి తాలనిస్తుంది. బయటకు వచ్చే బ్యాచ్‌ల్లోని విద్యార్థుల్లో అర్హత సాధించిన వారిలో దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు వస్తున్నాయి. వేతనాలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి. నిట్ నుంచి ఇంతవరకూ మూడు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వచ్చారు. వారిలో 895 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015–21 విద్యా సంవత్సరం వరకు మూడు బ్యాచ్‌లు బయటకు వచ్చాయి. చదవండి: (Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) క్యూ కడుతున్న కంపెనీలు తాడేపల్లిగూడెం నిట్‌లో క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంఎన్సీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్, అడట్రాన్, ఫానాటిక్స్, ఫ్యాక్ట్‌సెట్, టీసీఎస్, ఎల్అండ్టీ, మోడక్ ఎనలిటిక్స్, ఇన్ఫో ఎడ్జ్, కిక్ డ్రమ్, కాగ్నిజెంట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నాయి. ►2015–19 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –282 ►2016–20 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –303 ►2017–21– బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –310 ►2018–22 బ్యాచ్‌లో 170 మందికి ఇంతవరకూ ఆఫర్ లెటర్లు వచ్చాయి. -
ఒత్తిడితో4,400మంది ఐఐటీ, ఎన్ఐటీయన్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) విద్యాసంస్థలకు కూడా డ్రాపవుట్లు తప్పడం లేదు. గడిచిన మూడేళ్లలో ఈ రెండు ఇన్స్టిట్యూట్ల నుంచి దాదాపు 4,400మంది విద్యార్థులు చదువు పూర్తి చేయకుండానే తిరుగుబాట పట్టారని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. 2012-13 నుంచి 2014-15 మధ్యకాలంలో ఐఐటీ కాలేజీల నుంచి 2,060 మంది, ఎన్ఐటీల నుంచి 2,352 మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేశారని ఆమె వెల్లడించారు. అయితే వీరిలో విద్యాసంస్థల్లో ఒత్తిడి భరించలేక కొందరు, ఉద్యోగాలు వచ్చి కొందరు, అనారోగ్యంతో మరికొందరు, వ్యక్తిగత కారణాలతో ఇంకొందరు కోర్సును మధ్యలో వదిలేసి వెళుతున్నట్లుగా తెలిపారు. అయితే, అకాడమిక్ ఒత్తిడి కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు వెనక్కి వెళుతున్నట్లు తెలిసింది. రూర్కీ ఐఐటీ నుంచి ఎక్కువగా (228) డ్రాపవుట్లు నమోదు కాగా, ఖరగ్ పూర్ (209)తో తరువాతి స్థానంలో ఉంది. ఇక డ్రాపవుట్లే లేని ఐఐటీలుగా మండి, జోధ్‌పూర్, మద్రాస్, రోపర్ నిలిచాయి. దేశంలో మొత్తం 16 ఐఐటీ కాలేజీలు, 30 ఎన్ఐటీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇక ప్రతి విద్యాసంస్థలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి విద్యార్థుల భావోద్వేగాలు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా డ్రాపవుట్ సమస్యను అధిగమిస్తామని స్మృతి ఇరానీ తెలిపారు.