తెలుగు విద్యార్థుల విజయకేతనం | Telugu Students Tops In JEE Advanced 2022 Results | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థుల విజయకేతనం

Published Mon, Sep 12 2022 3:47 AM | Last Updated on Mon, Sep 12 2022 5:17 AM

Telugu Students Tops In JEE Advanced 2022 Results - Sakshi

లోహిత్‌రెడ్డి ఆలిండియా 2వ ర్యాంక్, సాయి సిద్ధార్థ ఆలిండియా 4వ ర్యాంక్‌

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా..   అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది.

కామన్‌ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్‌ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి  2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్‌ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్‌ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్‌ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్‌సీఎల్, జనరల్‌ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్‌ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్‌ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్‌.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌లో తనిష్క కాబ్రా టాప్‌ ర్యాంకర్‌గా (కామన్‌ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 

26.17 శాతం మందికే అర్హత మార్కులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. 

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెలువడడంతో జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్‌ సీట్ల కేటాయింపు అక్టోబర్‌ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్‌ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్‌ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. 

మెరిట్, రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్ల భర్తీ..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్‌ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్‌ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్‌ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు.  

14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు..
ఆర్కిటెక్చర్‌ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.     

ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం
ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా.. 
మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్‌ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను.  
– పోలు లక్ష్మీసాయి లోహిత్‌ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్‌  

నాలుగో ర్యాంక్‌ వచ్చింది. 
మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్‌కోలో ఇంజనీర్‌. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్‌ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్‌ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడమే లక్ష్యం.  
– వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్‌ 

బీటెక్‌ చదువుతా.. 
మాది హైదరాబాద్‌. నాన్న బ్యాంక్‌ మేనేజర్‌. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్‌ చేయడమే నా లక్ష్యం.  
– ధీరజ్‌ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్‌ 

యూఎస్‌లో ఎంఎస్‌ చదువుతా.. 
మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడమే నా లక్ష్యం. 
– వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్‌   

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. 
మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలో ఇంజనీర్‌ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్‌ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. 
– సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్‌ 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్నదే లక్ష్యం.. 
మాది నెల్లూరు. నాన్న కిశోర్‌ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్‌లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్‌ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్నదే నా లక్ష్యం.  
– అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్‌ 

పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. 
మాది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్‌ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో 19వ ర్యాంక్‌ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో 6వ ర్యాంక్‌ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేస్తా.  
– గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్‌ 

సామాజిక సేవే లక్ష్యం.. 
మాది వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం.  
– తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement