JEE Advanced
-
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్‌లనే కౌన్సెలింగ్‌లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్‌ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్‌కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్‌గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్‌లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపీ సెట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)ను ఈసారి ముందుకు జరిపి ఏప్రిల్‌లోనే నిర్వహించాలన్న ఉన్నత విద్యా మండలి ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసినట్టు తెలిసింది. జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని తెలిపినట్లు సమాచారం. ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. ఈసారి సెట్‌ను ముందే నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ. మే 18 తర్వాత అయితే ఓకే.. మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం వెల్లడించే వీలుంది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడుతుంది.ఇవన్నీ పట్టించుకోకుండానే ఈఏపీ సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని మండలి భావించింది. ఇలా చేయడం వల్ల మెయిన్స్, అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తోంది. అడ్వాన్స్డ్ తర్వాతే ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మండలిలోనూ భిన్నాభిప్రాయాలు ఈఏపీ సెట్‌ను ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై మండలిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి? కన్వీనర్‌ను ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈఏపీసెట్ నిర్వహించే జేఎన్టీయూహెచ్కు వీసీని కూడా నియమించలేదు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తంచేశారు. -
టాపర్ల ఎంపిక.. ఐఐటీ బాంబే..
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లకు ఐఐటీ బాంబే (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబే)అగ్రగామి ఎంపికగా కొనసాగుతోంది. ఈ ఏడాది టాప్–10 జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులంతా ఐఐటీ–బాంబేలోనే ప్రవేశాలు పొందారు. మొదటి 25 ర్యాంకుల్లో 24 మంది, 50 ర్యాంకుల్లో 47 మంది, 1000లోపు ర్యాంకుల్లో 246 మంది ఐఐటీ–బాంబే నుంచే ఇంజనీర్లుగా ఎదిగేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్య, పరిశోధన రంగంలో అగ్రగామిగా ఐఐటీ బాంబే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే.. 2018లో కేంద్ర ప్రభుత్వం దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ హోదాను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జాతీయ సాంకేతిక విద్యను విస్తరించడంలో భాగంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ ‘జేఈఈ అడ్వాన్స్డ్–2024’ నివేదికను విడుదల చేసింది. అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ, జోసా కౌన్సెలింగ్‌లో కీలకంగా వ్యవహరించిన (జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్–2) ఆచార్య అన్నాబత్తుల రత్నకుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. 2024–25 విద్యా సంవత్సరానికి 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. 1.80 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో 17,695 మంది 23 ఐఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో భారతీయ పౌరసత్వ మూలాలున్న 88 మంది, ఇద్దరు విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. బాంబే తర్వాత ఢిల్లీనే.. దేశంలోని 23 ఐఐటీల్లో ఐఐటీ బాంబే తర్వాత టాప్ ర్యాంకర్ల ఫేవరెట్ ఎంపికగా ఐఐటీ–ఢిల్లీ మారింది. ఇందులో టాప్–50 ర్యాంకర్లలో ఇద్దరు, టాప్–100లో 23 మంది, టాప్–200లో 50 మంది, టాప్–500లో 109, టాప్–1000లో 204 మంది ప్రవేశాలు పొందారు. ఆ తర్వాత తొలి వెయ్యి ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్‌లో 128 మంది, ఐఐటీ కాన్పూర్‌లో 117 మంది, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 82 మంది, ఐఐటీ గౌహతిలో 69 మంది, ఐఐటీ రూరీ్కలో 55 మంది, ఐఐటీ హైదరాబాద్‌లో 41 మంది, ఐఐటీ వారణాసిలో 23 మంది, ఐఐటీ ఇండోర్‌లో ఐదుగురు, ఐఐటీ గాం«దీనగర్‌లో ఒకరు ప్రవేశాలు పొందారు. మహిళా విద్యార్థులప్రవేశాలు ఇలా.. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఐఐటీల్లో సీట్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024–25 ప్రవేశాల్లో 23 ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లు 3,566 ఉండగా.. మొత్తం సీట్లు 17,760కు చేరాయి. వీటిలో 17,695 సీట్లు భర్తీ చేశారు. వీటిలో సుమారు 80 శాతం ప్రవేశాలు పురుషులే పొందుతున్నారు. ఏటా ఐఐటీల్లో ప్రవేశాలు పొందుతున్న మహిళలు మాత్రం కేవలం 3 వేల వరకు మాత్రమే ఉంటున్నారు. గడచిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 73 మంది మాత్రమే అధికంగా ప్రవేశాలు తీసుకున్నారు. ఐఐటీలో అత్యధికంగా ఖరగ్‌పూర్‌లో 363, వారణాసిలో 301, బాంబేలో 278, రూర్కీలో 275, ఢిల్లీలో 246, కాన్పూర్‌లో 248, మద్రాస్‌లో 231 మందితో పాటు హైదరాబాద్‌లో 120, తిరుపతిలో 50 మంది మహిళలు ప్రవేశాలు పొందారు. తెలియకుంటే.. మిన్నకుంటే మేలు! జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాము కలలుకన్న ఐఐటీల్లో సీట్లు సాధించేందుకు ప్రతి మార్కును లెక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైనస్ మార్కులు ఉండటంతో తెలియని ప్రశ్నల జోలికి వెళ్లడం లేదు. ఇలా పేపర్–1 గణితంలో 7వ ప్రశ్నను 80.31 శాతం మంది విడిచిపెట్టేశారు. ఇలా ప్రశ్నలు1, 3, 4, 5, 14, 17కు సుమారు 60 శాతానికిపైగా విద్యార్థులు సమాధానాలు రాయలేదు. ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు అత్యధికంగా 82.32 శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ఇలా 2, 3, 6, 16 ప్రశ్నలు 60 శాతానికిపైగా దూరంగా ఉన్నారు. కెమిస్ట్రీలో చాలావరకు జవాబు రాయడానికి ప్రయత్ని0చినట్టు తెలుస్తోంది. ఇలానే పేపర్–2లో గణితంలో 5వ ప్రశ్నకు అత్యధికంగా 71.11 శాతం మంది, ఫిజిక్స్‌లో 7వ ప్రశ్నకు 72.27 శాతం మంది జవాబు రాయలేదు. మొత్తంగా చూస్తే రెండు పేపర్లలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా నూరు శాతం మంది జవాబు పెట్టకపోవడం గమనార్హం. -
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. పెరిగిన కటాఫ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్ ఈసారి పెరిగింది. జనరల్ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్ కటాఫ్ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 109గా, రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ షురూ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు. -
జోసా కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ)లలో కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. 10 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది.17 వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు రౌండల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 23 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 2024–25 విద్యాసంవత్సరానికి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో మొత్తం 57,152 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు జోసా సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. గణనీయంగా పెరిగిన సీట్లు.. గత ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో గణనీయంగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, ఉపాధి అవకాశాలతో ఇంజనీరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. అయితే 2019 ముందు వరకు అత్యున్నత ప్రమాణాలతో నడిచే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టు సీట్ల సంఖ్య ఉండేది కాదు. దీంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లిపోయేవారు.దీన్ని నివారించడానికి 2024 నాటికి ఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు వాటిలో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడం ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల సంఖ్యను పెంచింది. అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఈ సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. 5 ఏళ్లలో 18 వేలకు పైగా సీట్ల పెంపుఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా కేంద్రం పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477, 2023లో 57,152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఆయా విద్యా సంస్థల్లో మహిళలకు 20 శాతం సూపర్ న్యూమరరీ కోటాతో సీట్లు కేటాయించుకునే వీలును కేంద్రం కల్పించింది.కౌన్సెలింగ్‌కు మొత్తం 121 విద్యా సంస్థలు.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరి, ఏప్రిల్ సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అందులో టాపర్లుగా నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఈ నెల 9న అడ్వాన్స్డ్ తుది ఫలితాలను విడుదల చేయనుంది. అనంతరం 10 నుంచి నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభించనుంది. మొత్తం 121 విద్యా సంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌టీఐల్లో జోసా ప్రవేశాలు కల్పిస్తుంది. ఆయా విద్యా సంస్థల్లో సీట్లు మిగిలిపోతే జూలై 17 నుంచి వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టనుంది.జోసా కౌన్సెలింగ్ తేదీలు.. ⇒ జూన్ 18న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక⇒ జూన్ 20న మొదటి విడత సీట్ల కేటాయింపు⇒ జూన్ 27న రెండో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 4న మూడో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 10న నాలుగో విడత సీట్ల కేటాయింపు⇒ జూలై 17న ఐదో విడత సీట్ల కేటాయింపు -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2024 ఈనెల 26న (ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ మద్రాస్ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్–1, పేపర్–2 పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ పరీక్ష మ.2.30 గంటల నుంచి 5.30 వరకు జరగనుంది. గతంలో నిర్వహించిన అడ్వాన్స్డ్ పరీక్షలకు భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్టర్ కావడం విశేషం. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ కాగా ఈసారి దీనికి మించి హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా.. ఈ పరీక్షలకు అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపుగా 46వేల మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచి్చనట్లు సమాచారం. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక నుంచి కూడా ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో బోర్డుల పరీక్షలు, సీబీఎస్ఈ పరీక్షలు ముగియడం, జేఈఈ మెయిన్స్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంతకుముందు.. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లలోనూ కలిపి 14.10 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తున్నారు. ఇలా ఈసారి 2,50,284 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా 1.91 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇలా..అన్రిజర్వ్డ్ (ఆల్) : 97,351 అన్రిజర్వ్డ్ (పీడబ్ల్యూడీ) : 3,973 ఈడబ్ల్యూఎస్ : 25,029 ఓబీసీ : 67,570 ఎస్సీ : 37,581 ఎస్టీ : 18,780జూన్ 9న ఫలితాలు.. 10 నుంచి జోసా కౌన్సెలింగ్.. మే 31న వెబ్సైట్లో అభ్యర్థుల ప్రతిస్పందనల కాపీలు అందుబాటులో ఉంచనుంది. జూన్ 2న తాత్కాలిక జావాబుల కీ, జూన్ 3 వరకు అభిప్రాయాల స్వీకరణ, జూన్ 9న తుది జవాబుల కీ, అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించనుంది. జూన్ 10 నుంచి జోసా తాత్కాలిక సీట్ల కేటాయింపు చేపడుతుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీచేస్తోంది.బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి.. ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉంది. అలాగే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను ఐఐటీ మద్రాస్ సంస్థ అడ్మిట్ కార్డుల్లో వివరంగా పొందుపరిచింది. అవి.. ⇒ అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిరీ్ణత సమయానికి ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశానికి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ⇒అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డులను తీసుకురావాలి. దానితో పాటు అధికారిక ఫొటో ఐడీ కార్డునూ తెచ్చుకోవాలి. అడ్మిట్‌కార్డు జిరాక్స్ కాపీని ఇని్వజిలేటర్లకు అందించి ఒరిజినల్ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి. ⇒ అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలిని శుభ్రం చేసుకోవాలి. ⇒ అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్ వ్రస్తాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు. ⇒బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. ⇒పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలను అనుమతించరు. ⇒అభ్యర్థులు ట్రాన్స్పరెంట్ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి. ⇒అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత గరిష్టంగా 1.91 లక్షల మంది పరీక్షకు నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ పరీక్షకు 1,89,744 మంది దరఖాస్తు చేశారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో రెండేళ్ల కిందటి వరకు 60 శాతం మంది కూడా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 76 శాతానికి పెరిగింది. ఉత్తీర్ణత శాతం తక్కువే..అడ్వాన్స్డ్ పరీక్షకు నమోదు చేసుకున్నవారితో పోలిస్తే హాజరయ్యేవారి సంఖ్య ఏటా తక్కువగానే ఉంటోంది. అలాగే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య కూడా స్వల్పమే. గత కొన్నేళ్లుగా పరీక్షలకు సంబంధించి కటాఫ్ మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతూ వచ్చింది. జనరల్‌తో పాటు రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గతేడాది అత్యధికంగా 1.80 లక్షల మందికి పైగా పరీక్ష రాస్తే 43,773 మంది మాత్రమే అర్హత సాధించారు. గతేడాది కటాఫ్ కూడా బాగా పెరిగింది. ఇక అడ్వాన్స్‌డ్‌లో పురుషులతో పోలిస్తే మహిళల హాజరు, ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, వాటిలో అర్హత సాధించాలంటే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. రెండు సెషన్లలో పరీక్షదేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆన్లైన్లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 21,844, తెలంగాణ నుంచి 24,121 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన 2.50 లక్షల మందిలో సుమారు 60 వేల మందికిపైగా పరీక్షకు దరఖాస్తు చేయలేదు. వారు 12వ తరగతి/ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించలేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. -
‘అడ్వాన్స్డ్’ మోతాదూ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సిలబస్ తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీనిపై త్వరలో స్పష్టత ఇచ్చే వీలుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ సిలబస్ ను తగ్గించారు. మేథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పది టాపిక్ల వరకూ తీసేశారు. ఇదే తరహాలో అడ్వాన్స్‌డ్‌లోనూ నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పె రుగుతోంది. అన్ని రాష్ట్రాలూ సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఏ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నిపుణు ల నుంచి సలహాలు తీసుకున్నారు. సిలబస్‌లో ఏ తరహా మార్పులు చేయాలనే అంశంపై పలు దఫా ల చర్చలు జరిగినట్లు ఎన్టీఏ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా 2020 నుంచి 2022 మధ్య బోధన పూర్తిస్థాయిలో సాధ్యపడనందున టె న్త్, ఇంటర్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించారు. 2024లో జరిగే జేఈఈ పరీక్షకు ఈ విద్యార్థులే హాజరు కా నుండటంతో జేఈఈ మెయిన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. విద్యార్థుల్లో ‘అడ్వాన్స్డ్’ఆందోళన... గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ అర్హు ల్లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందికే అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఐదేళ్లుగా అ డ్వాన్స్‌డ్ రాస్తున్న వారి సంఖ్య 1.60 లక్షలు దాట డం లేదు. దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది పరీక్షకే హాజరు కావట్లేదని ఎన్టీఏ గుర్తించింది. అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభిస్తున్నా అన్ని ఐఐటీలలో కలిపి సీట్లు 16 వేలకు మించి లేవు. ఇందులోనూ టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన వరకే అగ్రశ్రేణి ఐఐటీల్లో సీట్లు వస్తున్నాయి. అడ్వాన్స్డ్ పేపర్ కొన్నేళ్లుగా కష్టంగా ఉండటంతో విద్యార్థులు పోటీ పడేందుకు భయపడుతున్నారు. జేఈఈ ర్యాంకుతో ఎన్ఐటీల్లో సీటు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిలబస్‌లో మార్పులు తేవాలని వివిధ రాష్ట్రా లు అడ్వాన్స్డ్ నిర్వాహక ఐఐటీలను డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో తొలగించిన టాపిక్స్ అడ్వాన్స్‌డ్‌లో కొనసాగించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మేథ్స్‌లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు నిపుణుల కమిటీ ఇటీవల ఎన్టీఏకు అందించిన నివేదిక ప్రకారం గణితంలో కొన్ని టాపిక్స్‌ను తొలగించే వీలుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్, టాన్జంట్స్ అండ్ నార్మల్స్, ప్లాన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్, మేథమెటికల్ రీజనింగ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వంటి టాపిక్స్ ఉండకపోవచ్చని సమాచారం. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ) -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘వాట్సాప్ కాపీయింగ్’
సాక్షి, హైదరాబాద్: మొన్న టీఎస్పీఎస్సీ.. నిన్న పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం పూర్తిగా మరువక ముందే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌లో మైనర్ విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం జరిగిన ఈ పరీక్షలో ఒక మైనర్ విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడగా, అతని సహకారంతో నలుగురు వాట్సాప్ ద్వారా మాస్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయారు. మొత్తం ఐదు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా వీరిపై హైదరాబాద్, రాచకొండల్లోని నాలుగు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ సంస్థ వ్యవహారాన్నీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పరీక్ష హాళ్లలోకి స్మార్ట్ఫోన్లు రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సోదరుడు, స్నేహితుల కోసం.. కడపకు చెందిన టీచర్ కుమారుడైన ఓ విద్యార్థికి పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు, ఇంటర్మీడియట్లో 1000కి 940 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లోనూ 94 శాతం మార్కులు సాధించాడు. హైటె క్ సిటీ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న ఇతడికి ఒక సోదరుడితో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ఐదుగురూ ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. కడప విద్యార్థికి సికింద్రాబాద్ ప్యాట్నీ సమీపంలో ఉన్న ఎస్వీఐటీ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండగా, అతని సోదరుడికి మౌలాలిలో, ఇద్దరు స్నేహితులకు (వీరిద్దరూ సోదరులు) మల్లాపూర్‌లో, మరొకరికి ఎల్బీనగర్లోని కళాశాలల్లో సెంటర్లు పడ్డాయి. అయితే తన సోదరుడితో పాటు స్నేహితులకు కూడా మంచి మార్కులు రప్పించాలని భావించిన కడప విద్యార్థి ఐదుగురితో ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. కళాశాలల్లో తనిఖీ చేసే సిబ్బంది కళ్లుగప్పిన ఈ ఐదుగురూ పరీక్ష కేంద్రాల్లోకి తమ స్మార్ట్ఫోన్లు తీసుకువెళ్లారు. కంప్యూటర్ స్క్రీన్ ఫొటోలు తీసి.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షను అభ్యర్థులు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్లో ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న ప్రత్యక్షమవుతూ ఉంటే.. విద్యార్థులు జవాబులు టిక్ చేస్తూ పోతుంటారు. కడప విద్యార్థి కంప్యూటర్ స్క్రీన్‌పై తాను టిక్ చేసిన ప్రతి జవాబును ప్రశ్నతో సహా కనిపించేలా స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు తీసి, వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం ద్వారా మిగిలిన నలుగురికీ చేరేలా చేశాడు. ఎస్వీఐటీ కాలేజీలో పరీక్ష హాలు పెద్దదిగా ఉండటం, ఇన్విజిలేటర్ విధుల్లో ఉన్న సిబ్బంది ఒకేచోట కూర్చుండిపోవడంతో దాదాపు గంటన్నర పాటు ఈ తతంగాన్ని ఎవరూ గుర్తించలేదు. 10.30 గంటల సమయంలో మల్లాపూర్ కేంద్రంలో ఇన్విజిలేటర్ అక్కడి విద్యార్థి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండటాన్ని గమనించారు. అందులో ఉన్న వాట్సాప్ గ్రూపులో కంప్యూటర్ స్క్రీన్ ఫొటోలను చూసిన ఆయన సదరు విద్యార్థిని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్వీఐటీ కాలేజీ పరీక్ష కేంద్రంలోని కడప విద్యార్థి నుంచి ఈ ఫొటోలు వస్తున్నట్లు తెలుసుకుని ఆ సెంటర్ అధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కడప విద్యార్థిని తనిఖీ చేయగా అతడి వద్ద స్మార్ట్‌ఫోన్ లభించింది. ఇదే క్రమంలో మౌలాలి, ఎల్బీనగర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మరో ముగ్గురినీ పట్టుకున్నారు. వాట్సాప్ ద్వారా హైటెక్ మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు పాల్పడిన ఈ ఐదుగురూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ తరఫున జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐఓఎన్ సంస్థకు క్షమాపణ పత్రాలు రాసి ఇచ్చారు. సంస్థ సిబ్బంది ఆదివారం రాత్రి మార్కెట్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, నాచారం పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం? విద్యార్థులపై పోలీసులు ఐపీసీలోని 188 (ప్రభుత్వం నిషేధించిన వస్తువులు పరీక్ష హాలులోకి తీసుకుపోవడం), 420 (మోసం)తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్) యాక్ట్‌లోని 4 (బీ), 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదుగురి ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే సరైన తనిఖీలు లేక స్మార్ట్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాయని అధికారులు చెప్తున్నారు. నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న తనిఖీ సిబ్బంది, ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లకూ నోటీసులు ఇచ్చి విచారించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు. -
లెక్కలతోనే ఇక్కట్లు..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1.9 లక్షల మంది దరఖాస్తు చేయగా, అందులో 85 శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 44వేల మంది బాలికలు ఉన్నారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఈసారి ఈ పరీక్షలో ప్రశ్నల సరళి గతంలో మాదిరిగానే మధ్యస్థంగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు ఒకింత సులభంగా ఉన్నా, గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈసారి సిలబస్‌ను బోర్డు సిలబస్‌తో సమానంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ సిలబస్‌నే పేర్కొన్నప్పటికీ ప్రశ్నలను రూపొందించిన తీరు వినూత్నమైన రీతిలో ఉందని వివరించారు. ముఖ్యంగా గణితానికి సంబంధించిన ప్రశ్నల చిక్కులు విప్పడం విద్యార్థులకు కష్టంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షకు కోచింగ్ నిర్వహించిన కార్పొరేట్ విద్యా సంస్థ అకడమిక్ డీన్ ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం.. ఇక, ఐఐటీ గౌహతి ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్–1లో మొత్తం 180 మార్కులకు 51 ప్రశ్నలు అడిగారు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌లో 17 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగంలో 60 మార్కులు చొప్పున ప్రశ్నలిచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం మేథమెటిక్స్‌లో ప్రశ్నల సరళి అంతుచిక్కని రీతిలో కఠినంగా ఉంది. ‘ప్రశ్నలను అర్థంచేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువ సమయం మేథమెటిక్స్ విభాగపు ప్రశ్నలకే వెచ్చించాల్సి వచ్చింది’.. అని హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థి శ్రీకాంత్ వివరించాడు. ఫంక్షన్స్, మేట్రిక్స్, ఎల్లిప్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపాడు. ప్రాబబులీటీ, కాంప్లెక్సు నెంబర్స్, త్రీడీ, జామెట్రీల నుంచి కొంచెం మంచి ప్రశ్నలు వచ్చాయని మరికొందరు చెప్పారు. ఇక ఫిజిక్స్ విభాగంలో కైనమేటిక్స్, థర్మో డైనమిక్స్, మోడరన్ ఫిజిక్సు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, గ్రావిటేషన్, ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. మేథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోల్చిచూస్తే ఈసారి ఫిజిక్స్ సులభంగా ఉందనే చెప్పుకోవచ్చని పలు కోచింగ్ సంస్థల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నలు ఒకింత అసమతుల్యంగా ఉన్నా మేథమేటిక్స్ అంత గజిబిజిగా లేదన్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలను రాయడంలో విద్యార్థులు ఇబ్బందిపడినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి నేరుగా ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ కైనటిక్స్, లోనిక్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమినీస్, పాలిమర్స్, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా మిక్స్డ్ కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీలో కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. జూన్ 11న ప్రిలిమనరీ కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 11న ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు జూన్ 9 నుంచి వారికి అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. జూన్ 18న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది. సీఆర్ఎల్ కటాఫ్ 86–91 మధ్య ఉండొచ్చు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులకు వారు సాధించిన మార్కుల ఆధారంగా రెండు రకాల ర్యాంకులను ప్రకటించనున్నారు. ఒకటి కామన్ ర్యాంకు లిస్టుకు సంబంధించినది కాగా.. మరొకటి అడ్మిషన్ల ర్యాంకుకు సంబంధించినది. అడ్మిషన్ల ర్యాంకులు మొత్తం సీట్లు, పరీక్ష రాసిన అభ్యర్థులు, సంస్థల వారీగా ఆయా సంస్థల్లో సీట్ల కేటాయింపులో చివరి ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ర్యాంకు కటాఫ్ నిర్ణయిస్తారు. అలాగే, ర్యాంకు లిస్టుకు సంబంధించి కటాఫ్ మార్కులు ఈసారి జనరల్ కేటగిరీలో 86–91 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓబీసీలో 71–76, ఈడబ్ల్యూఎస్‌లో 77–82, ఎస్సీలకు 51–55, ఎస్టీలకు 39–44గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
89 పర్సంటైల్ సాధిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 పరీక్షలు శనివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించారు. తొలి సెషన్‌కు 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 8.23 లక్షల మంది, రెండో సెషన్ పరీక్షలకు 9.4 లక్షల మంది రిజిస్టర్ కాగా 99 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గణాంకాలు చెబుతున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరిగానే ఉన్నందున అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా అదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్ల కటాఫ్ స్కోరు మార్కులను పరిగణనలోకి తీసుకొని ఈసారి జనరల్ కేటగిరీకి 88 నుంచి 89 స్కోరు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారని చెబుతున్నారు. రెండో సెషన్ ప్రాథమిక కీ, అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటించనుంది. 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.50 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. అందువల్ల నెలాఖరులోగానే మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఎత్తేసిన అడ్వాన్స్‌డ్‌కు అర్హతకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎన్టీఏ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు సాధిస్తేనే ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందుతారు. తొలి సెషన్ మాదిరిగానే రెండో సెషన్ ప్రశ్నలు రెండో సెషన్ పరీక్షల ప్రశ్నల కాఠిన్యత మొదటి సెషన్ మాదిరిగానే ఉందని అభ్యర్థులు తెలిపారు. చివరి రోజైన శనివారం కెమిస్ట్రీ పేపర్ మోడరేట్‌గా ఉందని తెలిపారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఫిజిక్సులో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పలు విద్యా సంస్థల అధ్యాపకులు చెప్పారు. 12వ తరగతి చాప్టర్లలోని అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కైనమెటిక్స్, గ్రావిటేషన్, సింపుల్ హార్మొనిక్ మోషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఏసీ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్సు, రే, వేవ్ ఆప్టిక్స్ అంశాలతో సహా న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలను అడిగారు. మేథమెటిక్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా, అన్ని చాప్టర్ల నుంచి వచ్చాయని అధ్యాపకులు వివరించారు. అభ్యర్థులకు ఒకరికి కష్టంగా, మరొకరికి సులభంగా ప్రశ్నలు వచ్చాయనే పరిస్థితి తలెత్తకుండా అందరికీ సమన్యాయం జరిగేందుకు నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా స్కోరు మార్కులు ప్రకటించనున్నారు. అత్యధిక, అత్యల్ప స్కోరులను ఆధారం చేసుకొని నార్మలైజేషన్ చేయడం ద్వారా అభ్యర్థులకు స్కోరు లభిస్తుంది. -
జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. -
కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్డ్–2023
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 పరీక్షలు కొత్త సిలబస్‌తో జరగనున్నాయి. సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ అడ్మిషన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ jeeadv. ac.in లో పొందుపరిచింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్‌ను అనుసరించాల్సి ఉంటుంది. పాత సిలబస్‌లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్‌తో అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్‌ను రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. మార్పులు ఇలా జేఈఈ అడ్వాన్స్డ్ గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్‌లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్‌లోని ఫోర్స్డ్ అండ్ డాంపడ్ ఆసిల్లేషన్స్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. అదే విధంగా కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు. సీబీఎస్ఈ విద్యార్థులకు సులువు కొత్త సిలబస్‌లో ఎక్కువగా సీబీఎస్ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు గతంలోకంటే ఎక్కువ సిలబస్‌ని అనుసరించాల్సి వస్తుందన్నారు. కొత్త సిలబస్ జేఈఈ మెయిన్‌కు అనుసంధానంగా ఉండేలా చేయడం వల్ల మెయిన్‌కి ప్రిపేర్ అయిన వారు అవే అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సిలబస్‌ను పెంచినప్పటికీ, పరీక్ష సులువుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెయిన్‌లోని అధ్యాయాలు అడ్వా న్స్‌డ్‌లో చేర్చినందున సిలబస్ పెరిగినట్లు పైకి కనిపించినప్పటికీ, అవే అంశాలు కనుక అంతగా భారం ఉండదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఐఐటీలలో వివిధ కోర్సులు చదవాలనుకొనే వారు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పరీక్షలు ఇలా.. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (యూసీఈఈడీ) కింద ఈ కొత్త పేపర్ నమూనా, సిలబస్ ప్రవేశపెట్టినట్లు జేఏబీ ప్రకటించింది. కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్–ఎ, పార్ట్–బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్–బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన చిత్రాల డ్రాయింగ్ అందులోనే చేయాలి. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్‌గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్‌టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్‌టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
అడ్వాన్స్డ్ పేపర్ హార్డే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. దీంతో ఈ ఏడాది జేఈఈ పరీక్షల ప్రక్రియ ముగిసింది. అడ్వాన్స్డ్ ఫలితాలు సెప్టెంబర్ 11న వెలువడనున్నాయి. 12వ తేదీన కౌన్సెలింగ్ మొదలవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్తా కష్టంగానే ఉన్నట్టు నిపుణులు, విద్యార్థులు తెలిపారు. గణితం అత్యంత కష్టంగా, సుదీర్ఘ ప్రశ్నలతో ఉంటే, ఫిజిక్స్ కాస్త మధ్యస్తంగా ఉందని, ఇందులోనూ సుదీర్ఘ ప్రశ్నలతో సమయం ఎక్కువ పట్టిందని విద్యార్థులు తెలిపారు. కెమెస్ట్రీ సాధారణంగా, స్కోర్ ఎక్కువ చేసేలా ఉండటం కొంత ఊరటనిచ్చిందని చెప్పారు. రెండు పేపర్లలోని మూడు సబ్జెక్టుల్లో మిక్స్డ్ కాన్సెప్ట్ ప్రశ్నలే వచ్చాయని నిపుణులు విశ్లేషించారు. చుక్కలు చూపించిన మేథ్స్ అడ్వాన్స్డ్ కోసం రెండేళ్ళుగా సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కూడా మేథ్స్ సబ్జెక్టులో వచ్చిన ప్రశ్నలు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఊహించిన చాప్టర్స్ నుంచే ప్రశ్నలు వచ్చినా జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నట్టు విద్యార్థులు తెలిపారు. సీక్వెన్స్ అండ్ సిరీస్, కాంప్లెక్స్ నంబర్స్, డిఫైన్ అండ్ ఇంటిగ్రేషన్స్, లిమిట్స్ ఫంక్షన్స్, అప్లికేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ డెరైవేటివ్, ప్రొబబులిటీ వంటి చాప్టర్లకు సంబంధించిన ప్రశ్నలు కొంత కష్టంగానే ఉన్నట్టు తెలిపారు. ఫిజిక్స్‌లో ఆప్టిక్స్, కైన్‌మ్యాటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్, సర్ఫేస్ టెన్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజమ్ చాప్టర్ల ప్రశ్నలు కొన్ని తేలికగా, మరికొన్ని మోడరేట్‌గా ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు. కెమిస్ట్రీలో అన్ని చాప్టర్ల ప్రశ్నలు తేలికగా సమాధానం చెప్పేలా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని మార్కులు సాధిస్తే అర్హత? అడ్వాన్స్డ్ కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు. ఊహించిన చాప్టర్ల నుంచి వచ్చినా కఠినమే.. అనుకున్న చాప్టర్ల నుంచే వచ్చినా ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. పోటీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ర్యాంకులు కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేసే వీలుంది. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి కాస్తా హార్డ్‌గానే అడ్వాన్స్డ్ పేపర్ ఇచ్చారు. – ఎంఎన్ రావు (జేఈఈ ప్రత్యేక బోధకుడు) -
అడ్వాన్స్‌డ్‌ను అధిగమిస్తున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడంటే అతిశయోక్తి కాదు. అయితే వీటిలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్ అత్యంత క్లిష్టమైనవి. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధిస్తేనే ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. ర్యాంకులు సాధించడం అటుంచి ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించడమే ఒకప్పుడు కష్టంగా ఉండేది. 15 ఏళ్ల క్రితం ఐఐటీలు, ఎన్ఐటీల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా వీటికి శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. నాణ్యమైన మెటీరియల్ కొరత కూడా ఉండేది. అయితే 2008 నుంచి కొత్త ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా శిక్షణా కేంద్రాలూ పెరిగాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ శిక్షణ కూడా అందుబాటులో కొచ్చింది. దీంతో ఐఐటీల్లో సీటు సాధించేవారి సంఖ్య పెరిగింది. 2007లో ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో కేవలం 3 శాతంలోపు మాత్రమే ఉన్న ఉత్తీర్ణుల సంఖ్య తాజాగా 30 శాతం వరకు చేరడం ఇందుకు నిదర్శనం. గతంలో ఐఐటీ–జేఈఈగా, జేఈఈ మెయిన్‌గా, ఏఐఈఈఈగా వేర్వేరు పేర్లతో కొనసాగిన ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్గా కొనసాగుతున్నాయి. ప్రవేశానికి రెండంచెల విధానం.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లను ప్రవేశపెట్టారు. ఈ పరీక్షల కోసం ప్రస్తుతం 10 లక్షల మందికిపైగా పోటీ పడుతున్నారు. ఏక పరీక్ష విధానం ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు లక్షల్లోనే పరీక్ష రాసేవారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో క్వాలిఫై అయినవారు 2007లో 2.96 శాతం, 2008లో 2.77 శాతం, 2009లో 2.60, 2010లో 2.87, 2011లో 2.81, 2012లో 5.02 శాతం మంది ఉన్నారు. 2013 నుంచి రెండు విడతల వడపోత విధానం (జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్) అమల్లోకి వచ్చాక మెయిన్ పరీక్ష దాటుకుని అడ్వాన్స్డ్ పరీక్ష దాకా వచ్చే అభ్యర్థుల సంఖ్య తగ్గింది. 2013లో అడ్వాన్స్డ్ పరీక్షకు 1,26,749 మంది దరఖాస్తు చేయగా 1,15,971 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,834 మంది (17.96 శాతం) అర్హత మార్కులు సాధించారు. 2014లో 22.70, 2015లో 22.47, 2016లో 24.76, 2017లో 31.99 శాతం, 2018లో 20.61, 2019లో 23.99 శాతం, 2020లో 28.64 శాతం, 2021లో 29.19 శాతం మంది అడ్వాన్స్డ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేతృత్వంలో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. జూలైలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2.5 లక్షలమంది అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. అయితే, కేవలం 1.60 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. ఈసారి పేపర్–1, పేపర్–2 కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ప్రకటించింది. సరైన జవాబు రాస్తే 4 మార్కులు, సమాధానం తప్పయితే ఒక మార్కు మైనస్ అవుతుంది. ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వనిధులతో నడిచే ఇతర సంస్థల్లో దాదాపు 50 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా నిట్‌లో, అడ్వాన్స్డ్ ర్యాంకు ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందే వీలుంది. -
28న జేఈఈ అడ్వాన్స్డ్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ – 2022 పరీక్షను ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్సైట్ (https://jeeadv.ac.in/) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు మినహా పాత విధానంలోనే పరీక్ష జరగనుంది. అడ్వాన్స్డ్ పరీక్షలో న్యూమరికల్ వ్యాల్యూ విభాగంలోని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు. తక్కిన విభాగాల్లోని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. జేఈఈ మెయిన్‌ను 13 మాధ్యమాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్‌డ్‌ను మాత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి.. మూడు గంటలు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పేపర్–1, పేపర్–2ల్లో ఒక్కోదానిలో 54 ప్రశ్నలుంటాయి. ఒక్కో పేపర్‌కు 180 చొప్పున మొత్తం 360 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు మినహా తక్కిన విభాగాల్లో తప్పుగా రాసినవాటికి నెగిటివ్ మార్కులుంటాయి. మార్కుల విధానంలో ఫుల్ మార్కులు, పార్షియల్ మార్కుల విధానం అమలవుతుంది. సెప్టెంబర్ 3న ప్రొవిజినల్ ‘కీ’.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐఐటీ భువనేశ్వర్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు ఐఐటీ మద్రాస్ జోన్ పరిధిలో 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రెస్పాన్సు కాపీలను సెప్టెంబర్ 1 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రొవిజినల్ ఆన్సర్ కీని అదే నెల 3న విడుదల చేస్తారు. వీటిపై 3, 4 తేదీల్లో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆన్లైన్లో స్వీకరిస్తారు. తుది ఆన్సర్ కీని, ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అదే రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను సెప్టెంబర్ 14న నిర్వహించి ఫలితాలను 17న విడుదల చేస్తారు. కాగా సెప్టెంబర్ 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ సిలబస్‌ను జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) సరళీకరించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలు, ఇంజనీరింగ్ కోర్సుల్లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల బోర్డులు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ అంశాల్లో పలు అంశాలను చేర్చారు. సవరించిన సిలబస్ 2023 జేఈఈ అడ్వాన్స్డ్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత ఇంటర్ విద్యార్థులకు ఊరట ఈ మార్పుల వల్ల ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులకు ఒకింత ఊరట కలగనుంది. వారు చదువుతున్న సబ్జెక్టులకు సంబంధించిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌లోనూ ఉండటంతో వారు ప్రత్యేకంగా వేరే అంశాలపై సన్నద్ధం కావాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియెట్ సబ్జెక్టులతో పాటే అడ్వాన్స్డ్ అంశాలను కూడా ఒకే సమయంలో వారు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఇంటర్మీడియెట్‌కు, జేఈఈకి వేర్వేరుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. ఇపుడు రెండింటికీ కలిపి ఒకే సిలబస్‌ను అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు జేఈఈ మెయిన్‌లో బోర్డు పరీక్షలలో ఉన్న అంశాలను కవర్ చేసినా, అడ్వాన్స్‌డ్‌లో మాత్రం వాటిని కలపలేదు. వేర్వేరు ఇతర అంశాలను ఉంచగా.. ఇప్పుడు వాటి స్థానంలో బోర్డు అంశాలను, ఇంజనీరింగ్ విద్యలో వచ్చే సంబంధిత అంశాలను సిలబస్‌లో చేర్చారు. దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళానికి తావుండదని, వారి అధ్యయనం సాఫీగా సాగుతుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. పోటీ ఇక తీవ్రం జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించి బోర్డుల సిలబస్‌లోని అంశాలతో సమానమైన మాదిరిగా మార్పులు చేసినందున ఆ పరీక్షకు పోటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో బోర్డుల అంశాలకన్నా భిన్నంగా ఒకింత కఠినమైన రీతిలో జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ ఉన్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే పరీక్షలను బాగా ఎదుర్కొనగలిగే వారు. కానీ.. ఇప్పుడు బోర్డులతో సమానం చేసినందున ఆ సిలబస్‌ను ప్రిపేర్ అయిన వారిలో ఎక్కువమంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధం కాగలుగుతారని, తద్వారా అత్యధిక మార్కులు సాధించగలవారు మాత్రమే ఎంపికవుతారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేందుకు పోటీ అత్యధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఐఐటీలు సహా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి సిలబస్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరిస్తుంటారు. అలాగే పాఠ్యప్రణాళికను పదేళ్లకోసారి పునర్వ్యవస్థీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సవరించారు. 11, 12 తరగతులకు (ఇంటర్మీడియెట్) సంబంధించి ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సవరించింది. ఆ సంవత్సరంలోనే జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌ను సమీక్షించి మార్పులను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ఈ సిలబస్ రివిజన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో ఏడు ప్రధాన ఐఐటీలు ముంబై, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, గౌహతి, రూర్కీలకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ ఫ్యాకల్టీ సభ్యులను నియమించారు. వీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సిలబస్ మార్పులపై సిఫార్సులు చేశారు. వారి విభాగాల వారితో పాటు ఇతర ఫ్యాకల్టీల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఈ సిఫార్సులు అందించారు. సబ్జెక్టుల వారీగా మార్పులు ఇలా.. భౌతిక శాస్త్రంలో ఇప్పుడున్న ఏ అంశాన్నీ తొలగించలేదు. కొన్ని అధిక స్కోరింగ్ అంశాలు జోడించారు. ఇవి మునుపటి కంటే సులభంగా ఉండేలా రూపొందించారు. ఎలక్ట్రానిక్ వేవ్స్, సర్ఫేస్ టెన్షన్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీని తొలగించారు. బయో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాలలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పెరియోడిక్టీ ఇన్ ప్రాపర్టీస్, హైడ్రోజన్, ఎఫ్–బ్లాక్ ఎలిమెంట్స్, క్రిస్టిల్ ఫీల్డ్ థియరీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే, బయో మాలిక్యూల్స్ వంటి అంశాలను జోడించారు. మేథమేటిక్స్‌లో హార్మోనిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్ సొల్యూషన్ అంశాలను తొలగించారు. ఆల్జీబ్రాలో ప్రాథమిక అంశాలు, చతుర్భుజ సమీకరణాలు, సెట్ సిద్ధాంతం, స్టాటిస్టిక్స్, ఎలిమెంటరీ రోఆపరేషన్స్ వంటివి చేర్చారు. మేథ్స్, ఫిజిక్స్‌లో క్లిష్టత స్థాయి తగ్గినట్టే.. సిలబస్ సవరణ వల్ల మేథ్స్, ఫిజిక్స్‌లలో క్లిష్టత స్థాయి గతంలో కన్నా కొంత తగ్గినట్టేనని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులంటున్నారు. ఇంటతో సంబంధమున్న అంశాలను, సైద్ధాంతిక అధ్యాయాలను జోడించడం వల్ల రసాయన శాస్త్రం విభాగం కూడా సులభంగా మారొచ్చంటున్నారు. జేఈఈ మెయిన్ కన్నా భిన్నమైన రీతిలో అడ్వాన్స్డ్ ప్రశ్నల స్థాయి ఉంటున్నందున ఆయా అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్కోరు పెంచుకోవచ్చు జేఈఈ మెయిన్‌ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ స్కోరును పెంచుకోవడానికి ఈ విధానం వారికి ఆస్కారమిచ్చింది. ఇప్పుడు సిలబస్‌ను కూడా సవరించినందున మంచి స్కోరు సాధించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలబస్‌ను మార్పు చేసినా ప్యాట్రన్ మాత్రం గతంలో మాదిరిగానే ఉండనుంది. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ నుంచి టాప్ స్కోరులో నిలిచిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మెరిట్లో నిలిచిన వారికి రిజర్వేషన్ల ప్రకారం ఆయా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 11,326 సీట్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 13,376కు పెరిగింది. -
అడ్వాన్స్‌డ్‌కు మరోసారి చాన్స్
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత రెండేళ్లలో (2020, 2021) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ రెండేళ్లలో దరఖాస్తు చేసి, కరోనా వల్ల పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది. గత రెండు సంవత్సరాల్లో అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించి ఉంటే వారు జేఈఈ మెయిన్–2022తో సంబంధం లేకుండా నేరుగా అడ్వాన్స్‌డ్‌పరీక్షకు హాజరవ్వొచ్చు. వీరిని నేరుగా అనుమతించడంవల్ల జేఈఈ–2022 మెయిన్ అభ్యర్థులకు నష్టం కలగకుండా ఎన్టీఏ చర్యలు చేపడుతోంది. వీరిని జేఈఈ మెయిన్–22లో అర్హత సాధించే అభ్యర్థులకు అదనంగానే పరిగణించనుంది. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ వరుసగా మూడేళ్లు, అడ్వాన్స్డ్ వరుసగా రెండేళ్లు రాసుకోవచ్చు. కోవిడ్ వల్ల పరీక్షలు రాయలేకపోయిన వారికి ఎన్టీఏ మరో అవకాశమిస్తోంది. ఈసారీ జేఈఈ షెడ్యూల్ విడుదల ఆలస్యమైంది. జనవరి మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశముంది. నాలుగు విడతల పరీక్షల్లో అక్రమాలు జేఈఈ మెయిన్ షెడ్యూల్ ఏటా ఆరు నెలల ముందు ప్రకటిస్తున్నారు. కరోనా వల్ల రెండేళ్లుగా షెడ్యూల్ ప్రకటన, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. 2021 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను 2020 డిసెంబర్లో ప్రకటించారు. పరీక్షలను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు విడతల్లో నిర్వహించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్ని సార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ఏ దశ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయో వాటిని పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది. అయితే చివరి రెండు విడతల పరీక్షలు చాలా ఆలస్యమయ్యాయి. జేఈఈ మెయిన్ 2021 సెప్టెంబర్ నాటికి కానీ పూర్తి కాలేదు. అయితే 2021 జేఈఈ మెయిన్ నాలుగు విడతల పరీక్షల నిర్వహణలో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయి. తొలి దఫా పరీక్షలో కనీస మార్కులు కూడా సాధించలేని కొందరు అభ్యర్థులు మలి విడతలో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తగా చివరకు సీబీఐ విచారణ చేపట్టింది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు అక్రమాలకు పాల్పడి పరీక్ష కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కై కాపీయింగ్ చేయించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కోచింగ్ సెంటర్ల యజమానులు, సిబ్బందిని సీబీఐ అరెస్టు కూడా చేసింది. అక్రమ పద్ధతుల్లో ర్యాంకులు పొందిన 20 మంది ఫలితాలను ఎన్టీఏ రద్దు చేసింది.షెడ్యూల్ ఆలస్యం, గత పరీక్షల్లో అక్రమాలతో ఈసారి నాలుగు విడతల పరీక్షల విధానాన్ని అమలు చేస్తారా? మార్పులుంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిలబస్ యథాతథం కోవిడ్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో హయ్యర్ సెకండరీ (ఇంటర్మీడియెట్) పరీక్షలు గందరగోళంగా మారాయి. విద్యా సంస్థలు నడవక విద్యార్ధులకు బోధన కరవైంది. ఆన్లైన్ తరగతుల ప్రభావమూ అంతంతమాత్రమే. పలు రాష్ట్రాలు ఇంటర్మీడియెట్ సిలబస్‌ను కుదించాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలోనూ సమస్యలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఏ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇంటర్ పరీక్షలలో 75 శాతం మార్కులుండాలన్న నిబంధనను కూడా రద్దు చేసింది. ఈసారి జేఈఈకి ఇదివరకటి సిలబస్సే యథాతథంగా కొనసాగనుంది. 2023 నుంచి కొత్త సిలబస్‌ను ఎన్టీఏ ప్రకటించింది. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
ఖరగ్‌పూర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసి.. ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 వేల సీట్లు, రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25న రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు జరగనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని వివిధ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సీట్ల కేటాయింపు ఈ విద్యాసంవత్సరం నుంచి మారనుంది. ఇప్పటివరకు అన్ని ఐఐటీల్లోని సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ వచ్చారు. ఈ ఏడాది మాత్రం ఈ విధానాన్ని తొలగించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన మహిళల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే 20 శాతం కోటా సీట్లను నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల ఈ మార్పులను ప్రకటించింది. అర్హులైన మహిళా అభ్యర్థుల అందుబాటును అనుసరించి సూపర్ న్యూమరరీ సీట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆయా ఐఐటీలకు కల్పించింది. ఐఐటీల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు 2018 నుంచి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐఐటీల్లోని మొత్తం సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో కేవలం మహిళలకు కేటాయించేలా అదనపు సీట్లను ఏర్పాటు చేయించింది. 2018–19లో 14 శాతం సీట్లను ఇలా కేటాయించగా, 2019–20లో ఈ సంఖ్యను 17 శాతానికి పెంచింది. 2020–21లో దీనిని 20 శాతం చేసింది. ఇక 2021–22 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆయా ఐఐటీలే ఈ 20 శాతం కోటాపై నిర్ణయం తీసుకునేలా చేసింది. గత ఏడాది కరోనా వల్ల జేఈఈ మెయిన్‌లో అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రాయలేకపోయారు. వారికి ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నేరుగా రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. వీరు గత ఏడాది జేఈఈ మెయిన్ అర్హతతోనే ఈ అడ్వాన్స్‌డ్‌ను రాసే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.50 లక్షల మందికి వీరు అదనం. ఈ కారణంగానే మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపును ఆయా ఐఐటీలకు అర్హత సాధించే మహిళల సంఖ్యను అనుసరించి నిర్ణయం తీసుకునేలా కొత్త మార్పు చేశారు. గత ఏడాదిలో అర్హులైన మహిళలు లేకపోవడం వల్ల పలు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా సీట్లు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. కొన్ని ఐఐటీల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నా సూపర్ న్యూమరరీ కోటాను అనుసరించి సీట్లకేటాయింపు చేశారు. ఈనేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా ఈసారి మార్పులు చేశారు. టాప్ 100 అభ్యర్థులకు పూర్తి రాయితీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన వారిలో మొదటి 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్లు తమ ఐఐటీలో చదువులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కాలర్షిప్ కింద అందించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఫుల్ స్కాలర్‌షిప్‌నకు అర్హులని వివరించింది. ‘పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫుల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈఈ ర్యాంకర్స్’ పేరిట అందించనుంది. దీనికింద ఇనిస్టిట్యూషన్ ఫీజు, వసతి భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు ఇతర వ్యయాలను కూడా ఐఐటీయే భరిస్తుంది. వీటితోపాటు ప్రతినెలా పాకెట్ మనీ కూడా అందిస్తుంది. -
జేఈఈ అడ్వాన్స్డ్: విజయానికి యాభై రోజులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్డ్–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్ గైడెన్స్... విద్యార్థులు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. రివిజన్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్డ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్ అభ్యర్థులంతా సిలబస్ అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. ప్రతి సబ్జెక్ట్–ప్రతి రోజూ ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి. ► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్కు సమయం కేటాయించాలి. కచ్చితత్వం ఆయా సిలబస్ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నల సరళి, మార్కింగ్ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ వారీగా.. ఇలా ► మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫిజిక్స్: ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్‌కు హాజరవుతుంటే జేఈఈ–మెయిన్ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. ► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్డ్ రివిజన్‌కు కేటాయించాలి. వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్టులు, మోడల్టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు. పరీక్ష రోజు కీలకం ► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది. ► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి. ► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. ► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. ► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి. అడ్వాన్స్డ్.. ముఖ్యాంశాలు ► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ కొశ్చన్స్ సాధన చేయాలి. ► ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ► వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లకు సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. ► మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి. విజయ సాధనాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్ సమయంలోనే సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. – ఆర్.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు -
JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ సంక్రమణ కారణంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2021 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూలై 3న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. పరీక్ష కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారిలో అత్యధిక మార్కులు కలిగిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కరోనా మహమ్మారి కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే జేఈఈ– మెయిన్ 2021 ఏప్రిల్, మే సెషన్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అర్హత పరీక్ష అయిన మెయిన్ వాయిదా పడినందువల్ల అడ్వాన్స్‌డ్‌ను ఇప్పుడు నిర్వహించే అవకాశం లేదు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయం షిఫ్టులో ఉంటుంది. రెండవది మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా విద్యార్థులు దేశంలోని 23 ఐఐటీల్లో బాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్, డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో ప్రవేశాలకూ ఇదే అర్హత పరీక్ష. ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్షను 7 జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు నిర్వహిస్తాయి. చదవండి: జేఈఈ ప్రిపేర్ విద్యార్థుల కోసం అమెజాన్ ఫ్రీ కోచింగ్ JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..! -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1000 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాట చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్, శానిటైర్ ఉన్నవిద్యార్థులనే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిందే. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. వచ్చే నెల 5న ఫలితాలు విడుదల కానున్నాయి. -
‘అడ్వాన్స్డ్’కు ప్రత్యేక పోర్టల్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక పోర్టల్‌ను ఢిల్లీ ఐఐటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అడ్వాన్స్డ్ నోటిఫికేషన్, అర్హత వివరాలను పొందుపరిచిన వెబ్సైట్ (htt pr://jeeadv.ac.in) కాకుండా జేఈఈ మెయిన్ అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరో వెబ్‌సైట్‌ను (jeeadv.inc.in) దుబాటులోకి తెచ్చింది. అర్హతలకు సంబంధించిన వివరాలన్నింటిని పాత వెబ్సైట్లోనే(అఫీషియల్) ఉంచింది. ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో దరఖాస్తుల మొదటిరోజు విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.దీంతో వెంటనే మరో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ఈ వెబ్సైట్ (jeeadv.nic.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్‌కు, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 27న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మంది బెస్ట్ స్కోర్ విద్యార్థులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. విద్యార్థులకు జనవరి జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్, ప్రస్తుత జేఈఈ మెయిన్‌లో వచ్చిన స్కోర్ రెండింటిలో ఏది బెస్ట్ అయితే దాన్నే అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఆ మేరకు కేటగిరీల కటాఫ్ స్కోర్‌ను శుక్రవారంరాత్రే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. ఆయా స్కోర్ పరిధిలో ఉన్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. జనవరి, సెప్టెంబర్ జేఈఈ మెయిన్లకు 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 10.23 లక్షల మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. వీరిలో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈసారి జేఈఈ మెయిన్‌కు హాజరైన బాలికల సంఖ్య పెరిగింది. దాదాపు 30 శాతం(3.08 లక్షల) మంది జేఈఈ మెయిన్ కు హాజరయ్యారు. అలాగే ఐఐటీల్లో బాలికల సంఖ్యను పెంచేందుకు 2021 సంవత్సరం వరకు సీట్లను పెంచుతూ వస్తున్న కేంద్రం.. ఈసారి కూడా 20 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లను కేటాయించనుంది. కాగా, విద్యార్థులకు వచ్చిన ఫైనల్ స్కోర్ ఆధారంగా ఎన్టీఏ జేఈఈ మెయిన్ ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకుల ఆధారంగానే ఎన్ఐటీ, ఐఐఐటీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)ల్లో ప్రవేశాలు జరపనుంది. -
జేఈఈ, నీట్ తేదీలు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షా తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా వివిధ పరీక్షా తేదీలు వాయిదాపడ్డాయి. అయితే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. -
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ: జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఖరారు చేసింది. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం 2020 మే 17వ తేదీన జరిగే పరీక్షను ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ–డీ) నిర్వహించనుందని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్ చెప్పారు. భారత్‌లోని ఐఐటీల్లో చదువుకున్న చాలా మంది అమెరికాలో ఉన్నందునే అక్కడ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశం కల్పించనున్నారు. జేఈఈ మెయిన్స్ నుంచి గతంలో కంటే వచ్చే ఏడాది 10 వేల మందిని ఎక్కువగా తీసుకుంటామని రాంగోపాల్ వెల్లడించారు. జేఈఈ– అడ్వాన్స్‌డ్‌కు అన్ని కేటగిరీలతో కలిపి 2 లక్షల 50 వేల మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష: మే 17, 2020 మొదటి పేపర్: ఉ.9 నుంచి మ. 12 వరకు రెండో పేపర్: మ.2.30 నుంచి సా.5.30 వరకు -
‘తెలుగు’ వెలుగు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెం దిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాం కును సాధించగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఆలిండియా 5వ ర్యాంకును, ఏపీకే చెందిన ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకును సాధించాడు. అలాగే టాప్– 100లో 30 ర్యాంకులను, టాప్–500లో 132 ర్యాంకులను హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని విద్యార్థులు సాధించారు. టాప్–1000 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే దాదాపు 300 మంది వరకు ఉంటారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఆలిండియా టాపర్‌గా మహరాష్ట్రలోని బళ్లార్‌పూర్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372 మార్కులకుగాను 346 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. 2వ ర్యాంకును అలహాబాద్‌కు చెందిన హిమాన్షు గౌరవ్‌సింగ్ సాధించగా 3వ ర్యాంకును ఢిల్లీకి చెందిన అర్చిత్ బబ్నా సాధించారు. 308 మార్కులతో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే జోన్ పరిధి ప్రాంతానికి చెందిన షబ్నం సాహే బాలికల కేటగిరీలో టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో టాపర్లు వీరే.. టాప్ ర్యాంకుల సాధించిన విద్యార్థుల్లో ఐఐటీ జోన్లవారీగా ఐదేసి మంది వివరాలను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. అందులో హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో గిల్లెల ఆకాశ్‌రెడ్డి 4వ ర్యాంకు సాధించగా 5వ ర్యాంకును బట్టేపాటి కార్తికేయ సాధించారు. కౌస్థుబ్ డీఘే 7వ ర్యాంకు సాధించగా, ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, గుంపర్తి వెంకటకృష్ణ సూర్య లిఖిత్ 13వ ర్యాంకు సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో బాలుర కేటగిరీలో టాపర్‌గా నిలవగా జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించిన సూరపనేని సాయి విగ్న 44 బాలికల కేటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్లో టాపర్‌గా నిలిచారు. 38,705 మంది అర్హులు... ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 27వ తేదీ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.45 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా పరీక్ష రాసేందుకు 1,74,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,61,319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 38,705 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33,349 మంది బాలురు ఉండగా 5,336 మంది బాలికలు ఉన్నారు. ఇబ్బందులు పెట్టిన సాంకేతిక సమస్యలు... ఫలితాల వెబ్‌సైట్‌కు సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యలతో విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు వేచిచూసినా వెబ్సైట్లో ఫలితాల లింకు అందుబాటులోకి వచ్చాక సమస్యలు తలెత్తడంతో ఫలితాలు మధ్యాహ్నం చూసుకోవాలని ఐఐటీ రూర్కీ తమ వెబ్సైట్లో మెసేజ్ పెట్టింది. ఆ తరువాత మళ్లీ సమస్యలు రావడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిందండ్రులు ఊపరి పీల్చుకున్నారు. అర్హుల్లో రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్... జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఢిల్లీ ఐఐటీ జోన్ పరిధికి చెందినవారే ఉండగా రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన 38,705 మంది విద్యార్థుల్లో ఢిల్లీ జోన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన 9,477 మంది అర్హత సాధించగా ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలకు చెందిన 8,287 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో స్థానంలో ఐఐటీ బాంబే పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 6,140 మంది అర్హత సాధించారు. ఏఏటీకి దరఖాస్తులు... ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) రిజిస్ట్రేషన్లను ఐఐటీ రూర్కీ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. టాపర్ల అభిప్రాయాలు.. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా... అమ్మానాన్నల ప్రోత్సాహంతో ప్రతిరోజూ కనీసం 12 గంటలు చదివా. నా కష్టానికి ప్రతిఫలంగా మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ చేసి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. – ఆకాశ్‌రెడ్డి, జేఈఈ అడ్వాన్స్డ్ 4వ ర్యాంకర్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తా. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా. లేదంటే ఉద్యోగం చేస్తా. – బట్టేపాటి కార్తికేయ, 5వ ర్యాంకర్ సివిల్ సర్వెంట్ కావాలని ఉంది సివిల్ సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తా. టాప్–10 లో ర్యాంకు వస్తుందనుకున్నా. అయినా మంచి ర్యాంకే వచ్చింది. ఐఐటీ బాంబేలో బీటెక్ చేస్తా. – సూర్య లిఖిత్, 13వ ర్యాంకర్ -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసేందుకు ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఆ వెంటనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 16 నుంచి విద్యార్థులకు చాయిస్ ఫిల్లింగ్‌కు అవకాశం కల్పించనుంది. మే27న జరిగిన ఈ పరీక్షకు 1.74 లక్షల మంది హాజరయ్యారు. -
జూన్ 19 నుంచి ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఉమ్మడి కౌన్సెలింగ్ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని (జోసా) కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. అందుకు అనుగుణంగా జోసా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను వచ్చే నెల 14న ఐఐటీ రూర్కీ ప్రకటించనుంది. దీంతో వచ్చే నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాలను చేపట్టేందుకు జోసా చర్యలు చేపట్టింది. మొత్తానికి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మొత్తం 42 వేల సీట్ల భర్తీని జూలై 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 39,425 సీట్ల భర్తీకి ఏడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించిన జోసా ఈసారి అవసరమైతే 8 దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి 2 వేలకు పైగా ఈడబ్ల్యూఎస్ కోటా, బాలికల కోటా కింద సూపర్‌న్యూమరరీ సీట్లు రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 42 వేలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 39 వేల సీట్ల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మొదట్లో 2.24 లక్షల మంది విద్యార్థులనే ఎంపిక చేసింది. అయితే అర్హుల సంఖ్య తక్కువగా ఉండటంతో చివరకు 2,31,024 మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతి ఇచ్చింది. కానీ అందులోనూ అడ్వాన్స్‌డ్‌కు 1,65,656 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పలు కాలే జీల్లో సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి జేఈఈ మెయిన్‌లో టాప్ 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పించింది. అయితే ఈసారి ఎంత మంది దరఖాస్తు చేస్తారో వేచిచూడాల్సిందే. నేటి నుంచి దరఖాస్తులు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించేందుకు ఐఐటీ రూర్కీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.45 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అర్హత సాధించిన దాదాపు 35 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోనున్నారు. అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసిన వారిలో ఓపెన్ కేటగిరీలో 1,13,925 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 9,800 మంది, ఓబీసీలో 66,150 మంది, ఎస్సీలో 36,750 మంది, ఎస్టీల్లో 18,375 మంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రధాన తేదీలు ఈనెల 3 ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 9 సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఫీజు చెల్లింపునకు అవకాశం. ఈనెల 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ ఈనెల 27న: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు పేపరు–2 పరీక్ష. జూన్ 4న జవాబు పత్రాల కీలు విడుదల. జూన్ 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు 14, 15 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 17న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు 21న ఫలితాలు జూన్ 19 నుంచి జూలై 15 వరకు సీట్ల కేటాయింపు -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ తెలుగు విద్యార్థుల సత్తా
-
మనోళ్లే ‘అడ్వాన్స్డ్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్–10లో ఇద్దరు, టాప్–20లో మరో ముగ్గురు తెలుగు విద్యార్థులు చోటు సంపాదించారు. జాతీయ స్థాయిలో 360 మార్కులకు నిర్వహించిన అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో.. మావూరి శివకృష్ణ మనోహర్ 319 మార్కులతో 5వ ర్యాంకు, చోడిపల్లి హేమంత్ కుమార్ 316 మార్కులతో 7, గోసుల వినాయక శ్రీవర్ధన్ 11, అయ్యపు ఫణి వెంకట వంశీనాథ్ 14, బసవరాజు జిష్ణు 15వ ర్యాంకు సాధించారు. గత నెల 20న తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ కాన్పూర్ ఆదివారం ప్రకటించింది. హరియాణాలోని పంచకులకు చెందిన విద్యార్థి ప్రణవ్ గోయల్ తొలి ర్యాంకు (337 మార్కులు) సాధించగా.. రాజస్తాన్‌లోని కోటాకు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు (326 మార్కులు), ఢిల్లీకి చెందిన కైలాశ్ గుప్తా మూడో ర్యాంకు సాధించారు. అర్హులు 18,138 మందే.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లోని 11,279 సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో ఈసారి బాలికలకు ప్రత్యేకంగా 800 సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి భర్తీ చేయనున్నారు. మొత్తంగా అడ్వాన్స్డ్ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరుకాగా... 18,138 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. ఇందులో బాలురు 16,062 మంది, బాలికలు 2,076 మంది ఉన్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోవడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 50 వేల మంది అర్హత సాధించగా.. ఈసారి 18,138 మందికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఉండే కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు ఐఐటీల పరిధిలో గతేడాది 18 వేల మంది అర్హత సాధించగా.. అందులో తెలుగు విద్యార్థులు 12 వేల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈసారి ఈ ఐఐటీల పరిధిలో మొత్తంగా 8 వేల మందిలోపే అర్హత సాధించగా.. ఇందులో తెలుగు విద్యార్థులు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 126 మార్కులను, ఓబీసీలో 114, ఎస్సీ, ఎస్టీలకు 63 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. టాప్–1, 2, 9 ర్యాంకర్లూ ఇక్కడ చదివినవారే.. అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్ ప్రణవ్, రెండో ర్యాంకర్ సాహిల్ జైన్, 9వ ర్యాంకు సాధించిన రాజస్థాన్ విద్యార్థి లే జైన్ ముగ్గురూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యా సంస్థల్లో చదువుకున్నవారేనని ఆయా విద్యా సంస్థలు ప్రకటించాయి. మొత్తంగా ఓపెన్ కేటగిరీ టాప్–10లో 1, 2, 5, 7, 9 ర్యాంకర్లు తెలుగు రాష్ట్రాల్లో చదివినవారేనని పేర్కొన్నాయి. కేటగిరీ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించగా.. ఆయన ఐఐటీ మద్రాసు పరిధిలో ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకర్‌గా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన హేమంత్‌కుమార్ కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచారు. ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ విద్యార్థి జాటోత్ శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కే చెందిన శశాంక్ అచ్యుత్‌కు 62వ ర్యాంకు దక్కింది. ‘సూపర్–30’నుంచి 26 మంది ఉత్తీర్ణత గణితశాస్త్ర నిపుణుడు ఆనంద్‌కుమార్‌కు చెందిన ‘సూపర్–30’అకాడమీ విద్యార్థులు ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిశారు. అకాడమీ నుంచి 30 మంది పరీక్షకు హాజరుకాగా.. 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 2002లో సూపర్–30 అకాడమీని ప్రారంభించిన ఆనంద్‌కుమార్.. ఏటా 30 మంది పేద విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నారు. అకాడమీ నుంచి ఇప్పటివరకు 500 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడం గమనార్హం. ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జేఈఈ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 27న మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. వచ్చే నెల 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18వ తేదీన చివరి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. సొంత స్టార్టప్ పెడతా.. ‘‘సొంతంగా స్టార్టప్ స్థాపించాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే మాకు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. నేను బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తా..’’ – ప్రణవ్ అగర్వాల్, 1వ ర్యాంకర్ సివిల్స్ సాధించాలన్నదే లక్ష్యం ‘‘సివిల్స్ సాధించాలన్నదే నా లక్ష్యం. ముందుగా ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. మా నాన్న నాగరాజు బాంబేలో సీపీడబ్ల్యూడీలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఎంసెట్లలోనూ మంచి ర్యాంకులు వచ్చాయి..’’ – హేమంత్‌కుమార్ చోడిపిల్లి, 7వ ర్యాంకర్ కొత్త ఆవిష్కరణలు చేస్తా.. ‘‘పరిశోధనలవైపు వెళ్లాలన్నదే నా లక్ష్యం. కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారిస్తా. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తాను..’’ – బి.జిష్ణు, 15వ ర్యాంకర్ ఐఏఎస్ అవుతా.. ‘‘ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. అందుకోసం సివిల్స్ రాస్తాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి.. సివిల్స్‌వైపు వెళతాను.’’ – జి.సాయి అభిషేక్, 31వ ర్యాంకర్ గౌలిదొడ్డి గురుకులంలో పది మందికి ఐఐటీ సీట్లు రాయదుర్గం: హైదరాబాద్ శివార్లలోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించారు. కాలేజీకి చెందిన విద్యార్థులు బి.భాస్కర్ ఎస్టీ కేటగిరిలో 449 ర్యాంకు, రమేశ్చంద్ర ఎస్సీ కేటగిరీలో 567 ర్యాంకు సాధించారు. మొత్తంగా ఈ గురుకుల కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాగా.. అందులో 10 మంది ఐఐటీ సీట్లు సాధించనుండటం, వీరంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. వీరితోపాటు మరికొందరు విద్యార్థులకు ఎన్ఐటీలలో సీట్లు వచ్చే అవకాశముందని ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. -
టాప్–10లో ఒక్కటీ రాలేదు
- జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరవని తెలుగు రాష్ట్రాలు - టాప్–100లో 23 ర్యాంకులతో సరి - టాపర్‌గా చండీగఢ్‌కు చెందిన సర్వేశ్ సాక్షి, హైదరాబాద్/చెన్నై: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు రాష్ట్రాలకు టాప్ ర్యాంకులు కరువయ్యాయి. టాప్–10లో ఒక్క ర్యాంకు లభించ లేదు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్–10లో కనీసం నాలుగైదు ర్యాంకులు సాధించామని చెప్పుకునే ప్రముఖ విద్యా సంస్థలు కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరవలేదు. ఆదివారం మద్రాస్ ఐఐటీ వెల్లడించిన ఈ ఫలితాల్లో చండీగఢ్‌కు చెందిన సర్వేశ్ మెహతానీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తం 366 మార్కులకుగానూ సర్వేశ్ 339 మార్కులతో సత్తా చాటాడు. పుణేకు చెందిన అక్షత చుఘ్(335 మార్కులు) రెండో ర్యాంకు, ఢిల్లీకి చెందిన అనన్య అగర్వాల్(331 మార్కులు) మూడో ర్యాంకు దక్కించుకున్నారు. ఐఐటీ–జేఈఈ మెయిన్ పరీక్షలో 2.2లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. వారిలో 1,59,540 మంది మే 21న జరిగిన పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించా రు. టాప్–10లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా.. టాప్–100లో 23 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించా రని, మొత్తంగా తెలంగాణ, ఏపీ నుంచి 28 వేల మంది వరకు పరీక్ష రాయగా 5 వేల మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు విద్యాసం స్థలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తం గా 23 ఐఐటీల్లో ఉన్న సుమారు 11 వేల సీట్లు న్నాయి. ఈ ఏడాది ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో 11 బోనస్ మార్కులు కలిపారు. తెలుగు విద్యార్థికి 17వ ర్యాంకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని గార్లపేటకు చెందిన వడ్డెల ఆశ్రుత్ 17వ ర్యాంకుతో తెలంగాణ, ఏపీ నుంచి ప్రథమ స్థానంలో నిలిచాడు. జేఈఈ మెయిన్‌లో ఆరో ర్యాంకు సాధించిన మోహన్ అభ్యాస్కు అడ్వాన్స్‌డ్‌లో 64వ ర్యాంకు లభించింది. ఖమ్మంకు చెందిన బి.రాహుల్ ఎస్టీ విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో టాప్–10 ర్యాంకులను సాధించిన విద్యార్థు లు, జేఈఈ మెయిన్‌లోనూ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రం టాప్–10లో నిలువలేకపోయారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాసేందుకు రిజిస్ట్రేషన్‌కు ఐఐటీ మద్రాస్ అవకాశం కల్పించింది. ఏఏటీని ఈ నెల 14న నిర్వహించి 18న ఫలితాలు విడుదల చేయనున్నారు. సత్తా చాటిన మద్రాస్ జోన్ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐటీ మద్రాస్ జోన్ సత్తా చాటింది. ఈ జోన్ నుంచి 10,240 మంది అర్హత సాధిస్తే.. ఐఐటీ బాంబే జోన్ నుంచి 9,893 మంది, ఐఐటీ ఢిల్లీ జోన్ నుంచి 9,207 మంది అర్హత సాధించారు. మూడేళ్లుగా ఐఐటీ బాంబే జోన్ నుంచే ఎక్కువ మంది విద్యార్థులు ర్యాంకులు సాధిస్తుండగా.. ఈసారి ఐఐటీ మద్రాస్ జోన్ దానిని వెనక్కి నెట్టింది. కఠోర శ్రమే విజయ రహస్యం: సర్వేశ్ కఠోర శ్రమ.. లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించి చదవడమే తన విజయ రహస్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన సర్వేశ్ మెహతానీ పేర్కొన్నాడు. టీవీలో కార్టూన్లు చూడటం.. సంగీతం వినడం.. బ్యాడ్మింటన్ ఆడటం.. ఇవే తనను ఒత్తిడికి దూరంగా ఉంచేవని చెప్పాడు. రెండేళ్లుగా తాను సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని, తాను 8వ తరగతిలో ఉండగా వచ్చిన 3 ఇడియట్స్ సినిమా తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పాడు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన రోల్ మోడల్ అని చెప్పారు. సర్వేశ్ జేఈఈ మెయిన్‌లో 55వ ర్యాంకు సాధించడం గమనార్హం. ఏడు దశల్లో కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడి కావడంతో ప్రవేశాలు చేపట్టేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఏర్పాట్లు చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుతోపాటు ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించిన వారు ఐఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులుగా ప్రకటించింది. గతేడాది 6 దశల కౌన్సెలింగ్ నిర్వహించగా ఈసారి ఏడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. 31 ఎన్ఐటీలు, 23 ఐఐటీలు, 23 ట్రిపుల్‌ఐటీలు, 20 జీఎఫ్టీఐలలో దాదాపు 38 వేల సీట్లను భర్తీ చేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్‌ను ప్రారంభిం చేందుకు షెడ్యూలు జారీ చేసింది. కాలేజీల వారీగా సీట్ల వివరాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 21న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ మద్రాస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. 15వ తేదీ నుంచి ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్లు మొదలు కానున్నాయి. -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు
మే 21న పరీక్ష.. టాప్ 2.2 లక్షల మందికి అనుమతి - జూన్ 11న ఫలితాలు.. 19 నుంచి ప్రవేశాలు - షెడ్యూల్ విడుదల చేసిన మద్రాస్ ఐఐటీ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యాసంస్థల్లో 2017–18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గురువారం జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలైన నేప థ్యంలో అడ్వాన్స్డ్ పరీక్ష ప్రక్రియను మద్రాస్ ఐఐటీ చేపట్టింది. మే 21న ఈ పరీక్ష జరు గనుంది. జేఈఈ మెయిన్‌కు 11 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన వారిలో టాప్ 2.2లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమ తిస్తారు. మే 2 వరకు దరఖాస్తులు.. 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మద్రాస్ ఐఐటీ వెల్లడించింది. రిజిస్ట్రేషన్, సీట్లు, ఫీజు తదితర వివరాలను సంబంధిత ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పొందవచ్చని పేర్కొంది. 2015 జేఈఈ మెయిన్‌లో టాప్ 1.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతించగా.. 2016లో టాప్ 2 లక్షల మందికి అవకాశమిచ్చామని తెలిపింది. సీట్లు మిగిలిపోకుండా ఉండేందుకు ఈసారి టాప్ 2.2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తామని వివరించింది. రిజర్వేషన్ కేటగిరీల వారీగా చూస్తే... అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్ కేటగిరీలో 1,11,100 మంది (50.5 శాతం), ఓబీసీలో 59,400 మంది (27 శాతం), ఎస్సీల్లో 33 వేల మంది (15 శాతం), ఎస్టీల్లో 16,500 మందిని (7.5 శాతం) అనుమతిస్తామని వివరించింది. మరిన్ని అర్హత వివరాలు ► 1992 అక్టోబర్ 1న, ఆ తర్వాత జన్మించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ► జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఒక అభ్యర్థి మొత్తంగా మూడుసార్లు, వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరుకావచ్చు. ► ఇంటర్ వార్షిక పరీక్షలు 2016 రాసిన వారు, 2017లో రాయబోయే వారు కూడా హాజరుకావచ్చు. 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించి 2015 జూన్ తరువాత ఫలితాలు వచ్చిన విద్యార్థులు అడ్వాన్స్డ్ రాయవచ్చు. ► ఇప్పటికే ఐఐటీల్లో చేరిన వారు, గతంలో ఐఐటీల్లో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టింగ్ చేశాక సీటును రద్దు చేసుకున్న వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనర్హులు. ► అయితే 2016 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు లభించాక సీటు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి, సీటును యాక్సెప్ట్ చేయని వారు (జాయింట్ సీట్ అలొకేషన్‌లో భాగంగా రిపోర్టింగ్ కేంద్రాల్లో ఎక్కడా రిపోర్టు చేయనివారు) మాత్రం పరీక్ష రాసేందుకు అర్హులే. ► ఏదైనా ఐఐటీలో 2016లో మొదటిసారిగా ప్రిపరేటరీ కోర్సులో చేరినవారు 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ ఇదీ.. ఏప్రిల్ 28 నుంచి మే 2: అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ (ప్రారంభ తేదీన ఉదయం 10 నుంచి, చివరి తేదీన సాయంత్రం 5 వరకు) మే 2 నుంచి 4: ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ మే10 నుంచి 21: హాల్‌టికెట్ల డౌన్లోడ్ మే 21న: అడ్వాన్స్డ్ పరీక్ష (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–2) మే 31 నుంచి జూన్ 3: ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన.. విజ్ఞప్తుల స్వీకరణ జూన్ 4న: ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో జవాబుల కీలు జూన్ 4 నుంచి 6: ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ జూన్ 11: అడ్వాన్స్డ్ ఫలితాల వెల్లడి జూన్ 11, 12 తేదీల్లో: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 14: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష జూన్ 18న: ఏఏటీ ఫలితాల విడుదల జూన్ 19 నుంచి జూలై 18 వరకు: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలు. నాలుగేళ్లుగా తగ్గుతున్న కటాఫ్! జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులు ఏటా తగ్గిపోతున్నాయి. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు 2014–15లో జనరల్ కేటగిరీలో 115 మార్కులుగా కటాఫ్ ఈసారి 81కి తగ్గింది. గతేడాది ఫిజిక్స్‌లో ప్రశ్నలు కఠినంగారాగా.. ఈసారి గణితంలో కఠినంగా వచ్చాయి. -
2017, మే 21న జేఈఈ అడ్వాన్స్డ్
పరీక్షకు 2.20 లక్షల మందికి అర్హత జేఏబీ సమావేశంలో నిర్ణయం ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్ష తేదీ ఖరారైంది. జాతీయ స్థాయిలో మే 21న రెండు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించాలని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్డ్-2017ను ఐఐటీ- మద్రాస్ నిర్వహించనుంది. అంతేకాకుండా జేఈఈ-2017కు మొత్తం 2,20,000 మందికి అవకాశంకల్పించనున్నారు. గతేడాది వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసే వారి సంఖ్య రెండు లక్షలుగా మాత్రమే ఉండేది. అయితే రానున్న సంవత్సరంలో కొత్తగా వచ్చే ఐఐటీలు, పెరగనున్న సీట్లను దృష్టిలో పెట్టుకొని అదనంగా20వేల మందికి జేఈఈ-మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటర్ పర్సంటేజీ తగ్గింపు జేఈఈ అడ్వాన్స్డ్ విషయంలో జేఎబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌లో పొందాల్సిన మార్కుల పర్సంటేజీని 70 శాతం నుంచి 65 శాతానికి తగ్గించింది. అలాగే ఓసీ, ఓబీసీ కేటగిరీల విద్యార్థులు 75 శాతం మార్కులు పొందాలనే నిబంధన యథాతథంగా అమలు కానుంది. తాజా నిర్ణయం ప్రకారం- జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఇంటర్మీడియెట్ బోర్డ్ మార్కుల్లో టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేదా ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో జనరల్, ఓబీసీ కేటగిరీ విద్యార్థులు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 65 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ సర్టిఫికెట్, ఏప్రిల్ 1, 2017 తర్వాతదే ఓబీసీ (నాన్-క్రిమీలేయర్) విద్యార్థులు సమర్పించాల్సిన కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా 2017, ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిందై ఉండాలని జేఏబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ట్యుటోరియల్స్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా పోటీపడుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రాంతీయ భాష నేపథ్యం ఉన్న విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. దరఖాస్తు దశ నుంచే వారికి సదరు ప్రక్రియ సులువుగా ఉండేలా వివిధ సదుపాయాలు కల్పించనున్నారు. యూజర్ రిజిస్ట్రేషన్, ర్యాంకుల తర్వాత దశలోని సీట్ల భర్తీ క్రమంలో ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియలకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో వీడియో ట్యుటోరియల్స్, లైవ్ డెమోలను అందుబాటులో ఉంచనున్నారు. సార్క్ దేశాల్లో సెంటర్ల పెంపు! విదేశీ విద్యార్థులను ఆకర్షించే చర్యల్లో భాగంగా సార్క్ దేశాల్లో అడ్వాన్స్డ్ సెంటర్ల సంఖ్యను సైతం పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. మెయిన్ ర్యాంకులు.. ఇంటర్ వెయిటేజీ తొలగింపు ఇప్పటికే ఎంహెచ్ఆర్డీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్ ఎగ్జామినేషన్ ర్యాంకుల రూపకల్పనలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. గతేడాది వరకు జేఈఈ మెయిన్ ర్యాంకుల రూపకల్పనలో ఇంటర్మీడియెట్ బోర్డ్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండేది. ఇక నుంచి ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. నెలాఖరు నాటికి అధికారిక వెబ్సైట్ జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ లోపు జేఈఈ మెయిన్ - 2017 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ సమాచారం పరీక్ష తేది: మే 21, 2017 పరీక్ష విధానం: రెండు పేపర్లు నిర్వాహక ఇన్స్టిట్యూట్: ఐఐటీ-మద్రాస్ మొత్తం ఐఐటీలు: 22 -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల వెల్లడి
- 20వ తేదీ నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులు ఆదివారం (ఈ నెల 12న) విడుదల కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను గౌహతి ఐఐటీ పూర్తి చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1.98 లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా.. 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 28,951 మందిలో (ఏపీ 14,703, తెలంగాణ 14,248) దాదాపు 21 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 19 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు, ఆలిండియా ర్యాంకులను 12న విడుదల చేయనుంది. అలాగే ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 15న ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఆర్కిటెక్చర్ పరీక్ష, ఐఐటీ ప్రవేశాల షెడ్యూల్ - ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ - 15న ఉదయం 9 నుంచి మధాహ్నం 12 వరకు ఏఏటీ పరీక్ష - 19న ఏఏటీ ఫలితాలు ప్రకటన - 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ -
రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం (ఈనెల 22న) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించేందుకు గువాహటి ఐఐటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో 1.98 లక్షల మందిని ఈ పరీక్షకు ఎంపిక చేయగా.. వారిలో 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి అడ్వాన్స్డ్ పరీక్షకు 28,951 మంది (ఆంధ్రప్రదేశ్ 14,703, తెలంగాణ 14,248 మంది) అర్హత సాధించగా... దాదాపు 21 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి: పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఈ రెండు పేపర్లు రాసిన వారికే ర్యాంకులను ఇస్తామని గువాహటి ఐఐటీ ప్రకటించింది. పేపర్-1కు ఉదయం 7:30కల్లా, పేపర్-2కు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పరీక్షా హాల్లోకి చేరుకోవాలని పేర్కొంది. అభ్యర్థుల డిజిటల్ ఫొటోలు, వేలిముద్రలు తీసుకోవాల్సి ఉన్నందున.. ముందుగానే పరీక్ష హాల్లోకి రావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి మించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది. పారదర్శకంగా ఉండే బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లను మాత్రమే హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. ఫుల్ షర్ట్, కోట్లు, బూట్లు, హైహీల్ చెప్పులు వేసుకోవద్దని సూచించింది. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను, ఆభరణాలను అనుమతించరని స్పష్టం చేసింది. జూన్ 12న ఆలిండియా ర్యాంకులను ప్రకటిస్తామని వివరించింది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అన్యాయం!
♦ తెలంగాణ ఓబీసీ సర్టిఫికెట్లకు వర్తించని నాన్ క్రీమీలేయర్ కోటా ♦ రాష్ట్ర సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వని గౌహతి ఐఐటీ ♦ ఐఐటీల్లో ఓబీసీ కోటాలోమన విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం ♦ రాష్ట్ర బీసీ కులాలకు కేంద్ర జాబితాలో దక్కని చోటు ♦ నేషనల్ బీసీ కమిషన్‌తో సంప్రదించని రాష్ట్ర సర్కారు ♦ తెలంగాణ ఓబీసీ సర్టిఫికెట్లతో అడ్వాన్స్డ్ రాసే వారంతా జనరల్ కోటాలోకే! ♦ ఈనెల 22న అడ్వాన్స్డ్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులు అన్యాయానికి గురయ్యారు! అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్-నాన్ క్రీమీలేయర్ (ఓబీసీ-ఎన్సీఎల్) కోటాలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే అర్హతను వేల మంది బీసీ విద్యార్థులు కోల్పోయారు. రాష్ట్రంలోని బీసీ కులాలపై గతేడాది మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కేంద్ర జాబితాలో చేర్చేలా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ద్వారా చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దీంతో జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లతో ఓబీసీ-ఎన్సీఎల్ కోటాను ఎంచుకునేందుకు గౌహతి ఐఐటీ విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలోని బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఓబీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చితేనే రాష్ట్రాలు జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు వర్తింపజేస్తున్నామని పేర్కొంది. అలాంటి వారికే ఓబీసీ-ఎన్సీఎల్ కోటా కింద జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు, అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఓబీసీ-ఎన్సీఎల్ కోటాలో సీట్లు కేటాయించేందుకు చర్యలు చేపడతామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన దాదాపు 8 వేల మంది ఓబీసీల్లో 5 వేల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ కోటా లో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు. అనేక మంది ఓబీసీ-ఎన్సీఎల్ కోటాలో ఐఐటీల్లో వచ్చే సీట్లను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. జనరల్ కేటగిరీ విద్యార్థులుగా అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 22న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులంతా ఓబీసీ-ఎన్సీఎల్ రిజర్వేషన్‌ను కోల్పోయి జనరల్ కేటగిరీలోనే పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు అప్లోడ్ (ఏపీ ఆప్షన్‌ను ఎంచుకున్నవారికే) చేసేందుకు గౌహతి ఐఐటీ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 3న ఆఫ్‌లైన్‌లో.. 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షకు 11,94,938 మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 59,622 మంది, ఏపీ నుంచి 73,026 మంది (మొత్తంగా 1,32,648) పరీక్ష రాశారు. వారి ఫలితాలను (స్కోర్) సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ నెల 27న ప్రకటించింది. ఇందులో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 28,951 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ విద్యార్థులు దాదాపు 12 వేల మంది ఉన్నట్లు అంచనా. వారిలో బీసీ విద్యార్థులే 8 వేల మంది ఉండగా, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కోటాలో ఐఐటీ సీటు కోసం దరఖాస్తు చేసేవారు 8 వేల మంది వరకు ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎన్సీబీసీకి పంపించాం..: బీసీ కులాల జాబితాను ఎన్సీబీసీకి పంపించామని, వారు వచ్చి రాష్ట్రంలో విచారణ చేసి వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్సీబీసీ ఇంతవరకు రాష్ట్రంలోని బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చలేదు. ఎన్సీబీసీ వెబ్సైట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్సీబీసీ వెబ్సైట్లో కేంద్ర జాబితాలో చేర్చిన రాష్ట్రాల వారీగా బీసీ కులాల వివరాలను పొందుపరిచింది. ఏపీలోని కులాలు కూడా అందులో ఉన్నాయి. కానీ అదే వెబ్‌ైసైట్‌లో 31వ రాష్ట్రంగా తెలంగాణను పొందుపరిచినా... దాన్ని ఓపెన్ చేస్తే రాష్ట్రంలోని కులాల జాబితా లేదు. దీంతో ఐఐటీల్లో ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై తల్లిదండ్రులు గౌహతి ఐఐటీ అధికారులను సంప్రదించగా.. తామేం చేయలేమని, కేంద్ర ఓబీసీ కులాల జాబితాలో (సెంట్రల్ లిస్టు ఆఫ్ ఓబీసీస్) చేర్చిన రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను మాత్రమే ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. దీనిపై పలువురు తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌కు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎన్సీబీసీతో మాట్లాడి రాష్ట్రంలోని ఓబీసీల జాబితాను కేంద్ర జాబితాలో చేర్చేలా చర్యలు చేపట్టాలని, అలాగే గౌహతి ఐఐటీ అధికారులతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులు ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కోటా కింద జేఈఈ అడాన్స్డ్కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వెనుకంజ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన వారిలోనూ ఏటా 30 శాతం మంది ఈ పరీక్షలు రాయడం లేదు. ఏటా జేఈఈ మెయిన్ రాసే దాదాపు 12 లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు టాప్ 1.50 లక్షల మందిని ఎంపిక చేస్తే అందులోనూ 30 శాతం మంది పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైనా పడుతోంది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండగా, అర్హత సాధిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఎంపిక చేసిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం మంది పరీక్షకు హాజరు కాకపోవడం ఐఐటీల్లో సీట్లు మిగిలిపోవడానికి ఓ కారణం అవుతోంది. 2015 జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయగా పరీక్షకు 1,17,238 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 32,742 మంది విద్యార్థులు పరీక్షకే హాజరు కాలేదు. ఇందులో 25,259 మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకోకుండా పరీక్ష రాయకపోగా, మరో 7,503 మంది రిజిస్టర్ చేసుకున్నా పరీక్ష రాయలేదు. ఇదీ గత ఏడాదే కాదు గడిచిన మూడునాలుగేళ్లుగా ఇదే తంతు. ఇలా 2013లో 24 వేల మంది, 2014 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. ఇటీవల ఐఐటీలు గత మూడు నాలుగేళ్లలో పరీక్షలు, వాటికి హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, చేరుతున్న వారి సంఖ్యను బయటకు తీశాయి. ఇలా పరీక్షకు గైర్హాజరవుతున్న తీరు కూడా ఐఐటీల్లో ప్రవేశాలపై ప్రభావం చూపుతోందన్న ఓ అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసే వారి సంఖ్యను 2016లో 2 లక్షలకు పెంచాలని నిర్ణయించాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయనున్నాయి. ఏప్రిల్ 3న జరిగే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనున్నాయి. -
తగ్గిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఈ మేరకు సవరించిన కటాఫ్ మార్కుల జాబితాను ఐఐటీ బాంబే శనివారం తమ వెబ్సైట్లో పొందుపరించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థి అర్హతను నిర్ధారించేందుకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను గతంలోనే ఐఐటీ బాంబే ప్రకటించినా జవాబుల కీలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించింది. గతంలో జనరల్‌లో విద్యార్థి 35 శాతం (177) పైగా మార్కులు సాధిస్తేనే అర్హుడని పేర్కొనగా తాజాగా వాటిని 24.5 శాతానికి (124 మార్కులు) తగ్గించింది. అలాగే ఇతర రిజర్వేషన్ కేటగిరీలవారీగా అర్హతకు పరిగణనలోకి తీసుకునే తగ్గించిన కటాఫ్ మార్కుల వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం మార్కులు 504 (పేపర్-1లో 264, పేపర్-2లో 240) కాగా ప్రతిసబ్జెక్టులో 168 మార్కులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోని(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పేపర్-1లో 88 మార్కులు ఉం డగా, పేపర్-2లో 80 మార్కుల చొప్పున ఉన్నాయి. మరోవైపు విద్యార్థుల అభ్యంతరాల మేరకు సవరిం చిన తాజా కీలను కూడా తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక ఈ నెల 18న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించనుంది. వీటి ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఐఐటీలవారీగా సీట్లు, రిజర్వేషన్ల వివరాలను తాజా సమాచారాన్ని వెబ్సైట్లో విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది. -
18 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ నెల 11 నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించింది. అయితే చాలా మంది విద్యార్థులు తమ ఫొటోలు, సంతకాలు, ఇతర సర్టిఫికెట్లు అప్లోడ్ చేయని కారణంగా దానిని ఈనెల 15కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది విద్యార్థులు వివరాలు అప్లోడ్ చేయని కారణంగా ఈనెల 18కి వాయిదా వేసినట్లు పేర్కొంది. 18 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. -
15 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారం (11వ తేదీ) నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉండగా, దానిని 15వ తేదీకి వాయిదా వేసినట్లు తమ వెబ్సైట్లో పేర్కొంది. విద్యార్థులు 20వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మార్పు చేసుకోవచ్చని వెల్లడించింది. -
రేపు జేఈఈ మెయిన్ రాతపరీక్ష
హాజరుకానున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మే 24న జేఈఈ అడ్వాన్స్డ్ ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు ఈసారి ఒకే కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ/ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ రాత పరీక్ష శనివారం (ఈనెల 4న) జరగనుంది. దీనితోపాటు ఈ నెల 10, 11వ తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు పూర్తిచేసింది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష పేపర్-1 ఉదయం 9:30 నుంచి 12.30 వరకు.. బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ రెండు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఇక 10, 11 తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. మొత్తంగా ఈ పరీక్షలకు తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరుకానుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 27న జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా టాప్ లక్షన్నర మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తారు. ఇవీ పరీక్ష కేంద్రాలు.. 4న జరిగే ఆఫ్‌లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 150 కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 10, 11వ తేదీల్లో జరిగే ఆన్లైన్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 283 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో... ఏ పీలోని బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏ లూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నరసారావుపేట, నెల్లూ రు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తా డేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజ యనగరంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 24న అడ్వాన్స్డ్.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 24న నిర్వహించేందుకు బాంబే ఐఐటీ చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో టాప్ లక్షన్నర మంది విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. వారు మే 2 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 24న పరీక్ష నిర్వహించి జూన్ 18న ఫలితాలు ప్రకటిస్తారు. రెండింటికి ఒకే కౌన్సెలింగ్! ఏటా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్‌లో ప్రకటించి, ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలను జూలైలో ప్రకటిస్తున్నారు. ఇలా వేర్వేరు తేదీల్లో ఫలితాలు ప్రకటించి, ప్రవేశాలు చేపట్టడం వల్ల ఎన్ఐటీల్లో సీట్లు మిగిలి పోతున్నాయి. ఐఐటీలో సీటు వస్తుందో రాదో తెలియక ఎన్ఐటీలో చేరి పోవడం, తీరా ఐఐటీలో వస్తే ఎన్ఐటీలో సీటువదులుకోవడంతో మరో విద్యార్థి నష్టపోవాల్సి వస్తోంది. దీంతో ఈసారి రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టింది. -
మనోళ్లు మెరిశారు
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థుల హవా సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయస్థాయిలో టాప్-10లో ఐదు ర్యాంకులు మనోళ్లే చేజిక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 2వ ర్యాంకును తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముత్పూర్‌కు చెందిన చింతకింది సాయి చేతన్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రావూరు లోహిత్ 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. టాప్-25 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఉండగా, మరో ఐదు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సాధించారు. టాప్-100 లోపు ర్యాంకుల్లోనూ దాదాపు 50 వరకు ర్యాంకులను తెలుగు తేజాలే చేజిక్కించుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని శ్రీ గాయత్రి విద్యా సంస్థల్లో చదివిన పాటియాలా(పంజాబ్) విద్యార్థి జి.శుభం గోయల్‌కు 6వ ర్యాంకు లభించింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,26,997 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు 21,861 మంది ఉన్నారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 27,151 మందిలో ఉభయ రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 2వేల మంది ఉన్నారని సమాచారం. నేటినుంచి చాయిస్.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో చేరేందుకు అవసరమైన చాయిస్ ఇచ్చుకునేందుకు జేఈఈ అడ్వాన్స్డ్ అవకాశం కల్పించింది. ఈనెల 20 నుంచి 24 వరకు విద్యార్థులు చాయిస్ ఇచ్చుకోవచ్చని పేర్కొంది. జులై 1న మొదటి దశ సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటిస్తారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో సీటు కావాలనుకునేవారు కూడా ఈనెల 20 నుంచి 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి ఉండాలి. 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి 29న ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ అల్‌ఇండియా ర్యాంకులను జులై 7న ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ గతంలో షెడ్యూల్ జారీచేసినా, జూలై ఒకటో తేదీనే ఆ ర్యాంకులు వెల్లడించే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ చాయిస్, సీట్ల కేటాయింపు షెడ్యూల్ ఈనెల 20 నుంచి 24 వరకు: ఆన్లైన్లో చాయిస్‌కు అవకాశం, 26న: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష, 29న: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలు, జులై 1న: మొదటి దశ సీట్ల కేటాయింపు, జులై 4లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం, జులై 7న: రెండో దశ సీట్ల కేటాయింపు, జులై 10లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం, జులై 9 నుంచి 11 వరకు: సీట్ల ఉపసంహరణ, జులై 12న: మూడో దశ సీట్ల కేటాయింపు, జులై 14లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం. వివరాలు అందాల్సిన ర్యాంకర్లు 6043024 వి.ప్రమోద్ 16 5004256 వి.ఆదిత్యవర్థన్ 17 6008298 ఎం.సాయి అరవింద్ 20 2021022 స్రజన్ గార్గ్ 21 6020177 వై.వినయ్ 23 -
జేఈఈలో అమ్మాయిల వెనుకంజ
టాప్-100లో ఐదుగురే అర్హత సాధించిన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 11శాతమే రాజస్థాన్ విద్యార్థి చిత్రాంగ్ ముర్దియాకు టాప్ ర్యాంకు బాలికల్లో అదితికి తొలి స్థానం ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల దేశవ్యాప్తంగా 27,151 మందికి అర్హత కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్) ఫలితాలు గురువారం విడుదల య్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన తొలి వంద మంది విద్యార్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే బాలికలు ఉన్నారు. మొత్తం ఉత్తీర్ణుల్లో అమ్మాయిలు 11 శాతం మాత్రమేనని జేఈఈ ఇన్చార్జి, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎం.కె.పాణిగ్రాహి వెల్లడించారు. జేఈఈ(అడ్వాన్స్డ్)లో రాజస్థాన్‌కు చెందిన చిత్రాంగ్ ముర్దియా 360 మార్కులకు గాను 334 మార్కులు సాధించి టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు. బాలికల్లో టాపర్‌గా నిలిచిన ఐఐటీ రూర్కీ జోన్‌కు చెందిన అదితి.. కామన్ మెరిట్ లిస్ట్ (సీఎంఎల్)లో ఏడో ర్యాంకు సాధించింది. ఈ పరీక్ష కు దేశవ్యాప్తంగా మొత్తం 1,26,997 మంది నమోదు చేసుకోగా.. 27,151 మంది అర్హత సాధించినట్టు పాణిగ్రాహి తెలిపారు.మొత్తమ్మీద కామన్ మెరిట్ లిస్ట్‌లో 19,416 మంది ఉండగా.. 6వేల మంది ఓబీసీ, 4,400 మంది ఎస్సీ, 1,250 మంది ఎస్టీ మెరిట్ జాబితాల్లో ఉన్నారు. 243 మంది వికలాంగులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీఎంఎల్లో దాదాపు 3,500 మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అంతేకాకుండా అన్ని కేటగిరీ ల్లోనూ అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. జేఈఈ (అడ్వాన్స్డ్)లో విజయం సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 16 ఐఐటీలతోపాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ప్రవేశాలు పొందడానికి అర్హులవుతారు. సత్తా చాటిన ‘సూపర్ 30’ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 27మందికి అర్హత పాట్నా: ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్)లో ‘సూపర్-30’ సంస్థ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రతి ఏటా 30 మంది అత్యంత పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఈ సంస్థ నుంచి ఈసారి 27 మంది అర్హత సాధించడం విశేషం. వీరిలో రోజు కూలీ, చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు పక్కన తినుబండారాలు విక్రయించుకునే వారి పిల్లలు ఉన్నారు. పేదరికం కారణంగా ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లలేకపోయిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి.. పేద విద్యార్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపిం చారు. 2001లో ప్రారంభమైన సూపర్-30 నుంచి ఇప్పటివరకు 360 మంది విద్యార్థులు ఐఐటీ-జేఈఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో 308మంది అర్హత సాధించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పరిశోధకుడిని కావాలనుకుంటున్నా ‘‘ఇది ఎంతో ఆనందకరమైన రోజు. ఈ విజయానికి కారణం.. నా తల్లిదండ్రులు, కోటాస్ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ అధ్యాపకులే. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాకు కార్పొరేట్ ఉద్యోగం కంటే పరిశోధనలంటేనే ఇష్టం. ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధకుడు కావాలనుకుంటున్నా. మనదేశం పరిశోధనల్లో బాగా వెనకబడి ఉంది. పారిశ్రామిక రంగం పురోభివృద్ధికి పరిశోధనలు ఎంతో కీలకం. అణగారినవర్గాలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవ డం ద్వారా సమాజానికి సేవ చేయాలని ఉంది. ముంబై ఐఐటీలోనే చేరాలనుకుంటున్నా’’ - చిత్రాంగ్ ముర్దియా, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్) టాపర్ అమ్మాయిలకు ప్రోత్సాహం లేదు ‘‘ఇంజనీరింగ్ వైపు వెళ్లేలా బాలికలను వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడంలేదు. ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్డ్)లో అమ్మాయిలు వెనుకబడటానికి అదే కారణం. నేను ఇంజనీరింగ్ చదివేందుకు నా కుటుంబం పూర్తిగా ప్రోత్సహించింది. కానీ నా స్నేహితుల్లో చాలామంది మెడికల్ లేదా కామర్స్‌ను ఎంచుకున్నారు. ఇంజనీరింగ్‌లో తక్కువ మంది బాలికలు ఉండటానికి అదే కారణం. అంతమాత్రాన అమ్మాయిలు మంచి ఇంజనీర్లు కాలేరని కాదు’’ - అదితి, ఐఐటీ-జేఈఈ (అడ్వాన్స్డ్) బాలికల టాపర్ -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆదివారం పలునగరాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. జూన్ 1న కీ, 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి 29న ఫలితాలు విడుదల చేయనున్నారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
* ఒకరోజు ముందుగానే విడుదల చేసిన సీబీఎస్ఈ * అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు! సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈనెల 3వ తేదీన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్న సీబీఎస్ఈ.. ఒక రోజు ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో కొందరు 360 గరిష్ట మార్కులకు గాను అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించినట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. రాష్ట్రంలోని హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,22,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,07,046 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్లో రాష్ట్రంలోని అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించారు. జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 60 శాతంగా పరిగణనలోకి తీసుకొని వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు నిర్వహించే ఇంటర్మీడియట్ మార్కుల్లో 40 పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులను సీబీఎస్ఈ విడుదల చేయనుంది. ఈ జాతీయ స్థాయి ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది. వాటి ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేయనుంది. -
జేఈఈ అడ్వాన్స్డ్.. ప్రతిభావంతుల పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్.. చక్కటి ఇంజనీరింగ్ కెరీర్ దిశగా కీలక ఘట్టం.. ఎంసెట్, జేఈఈ-మెయిన్ తదితర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తర్వాత నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధిస్తేనే ఐఐటీ కల సాకారమవుతుంది.. దేశంలోని లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే ఈ పరీక్షలో నెగ్గాలంటే.. ప్రతి ఎత్తును ఎంతో చాకచక్యంగా వేయాలి.. అప్పుడే ప్రతిభావంతుల సమరంలో విజేతగా నిలవడంతోపాటు ఐఐటీ లక్ష్యాన్ని ఛేదించడం సులభమవుతుంది.. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్‌కు అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల సలహాలు, సూచనలు.. 1,50,000 జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. 20,000 అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 1,50,000 మందిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు 20 అడ్వాన్స్డ్ ర్యాంక్‌తోపాటు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీలు, ఐఎస్‌ఎంలో సీటు కేటాయిస్తారు. జేఈఈ-అడ్వాన్స్డ్ 2014 కూడా గతేడాది మాదిరిగానే ఉండొచ్చు. కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కాబట్టి విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఆఫ్‌లైన్ (పేపర్-పెన్సిల్) విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. వీటిల్లో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్‌కు సమయం మూడు గంటలు. ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. మ్యాథమెటిక్స్! గత నాలుగు-ఐదేళ్ల ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు అల్జీబ్రా, కాలిక్యులస్ నుంచి వచ్చాయని చెప్పొచ్చు. వీటిల్లో అధిక శాతం ప్రశ్నలు మిక్స్డ్ కాన్సెప్ట్ ఆధారితం. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో పేపర్-1, పేపర్-2లలో అల్జీబ్రా నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల క్లిష్టత విషయానికొస్తే.. పేపర్-1లో 25 శాతం ప్రశ్నలు సులభంగా, 50 శాతం ప్రశ్నలు మధ్యస్తంగా, 25 కష్టమైనవిగా ఉన్నాయి. పేపర్-2లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు సులభంగా ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ-మెయిన్‌లో అర్హత సాధించాలి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు నెలల సమయాన్ని ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు జేఈఈ-మెయిన్ ప్రిపరేషన్‌కు వెచ్చించాలి. ఆ తర్వాత ఉండే 40 నుంచి 50 రోజుల సమయాన్ని అడ్వాన్స్డ్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. పేపర్-1,పేపర్-2లలో కలిపి ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, లిమిట్స్ అండ్ డిఫరెన్షియన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ అల్జీబ్రా, 3డీ జ్యామెట్రీ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని చెప్పొచ్చు. డిఫరెన్షియల్ ఇంటిగ్రల్, సర్కిల్స్, 3డి స్ట్రైట్ లైన్స్, మాక్సిమ-మినిమ, ఏరియాస్ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. ప్లేన్, వెక్టర్ అల్జీబ్రా, పారాబొలా, సర్కిల్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నలు సులభంగా ఉంటున్నాయి. డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రొబబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అడిగే ప్రశ్నలను క్లిష్టంగా రూపొందిస్తున్నారు. 11,12వ తరగతుల నుంచి సమాన వెయిటేజీలో ప్రశ్నలు ఇస్తున్నారు. ఇటువంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కాన్సెప్ట్స్ (మూల భావనలు)పై పట్టు ఏర్పర్చుకోవాలి. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి పునశ్చరణ (రివిజన్) పూర్తి చేసి ఉంటారు. కాబట్టి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్ సెకండియర్ టాపిక్స్‌పై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి వివిధ ఫార్ములాలు-ఉపయోగాలపై అవగాహన పెంచుకోవాలి. జేఈఈ-మెయిన్ గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. మరో కీలక విషయం అన్ని చాప్టర్లను ప్రిపేర్ కావడం కంటే 80 శాతం చాప్టర్లను 100 శాతం (సంపూర్ణంగా) ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. చాలా మంది విద్యార్థులు చాప్టర్, యూనిట్ల వారీగా వివిధ రకాల పుస్తకాలను చదువుతుంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ప్రయోజనం. -ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు. ఫిజిక్స్ జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధనలో ఫిజిక్స్ సబ్జెక్ట్ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్‌లో చురుగ్గా ఉన్న విద్యార్థులు ఫిజిక్స్‌లో రాణించడానికి మంచి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫిజిక్స్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా, మెమొరీ బేస్డ్ కాకుండా వివిధ కాన్సెప్ట్‌ల ఆధారంగా ఉంటాయి. అదే సమయంలో కొంచెం తికమక(ట్విస్ట్) పెట్టేలా అడుగుతా రు. కాబట్టి సిలబస్‌లో ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలివేయకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ప్రిపరేషన్ సాగించినప్పుడే ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుంది. సాధారణంగా విద్యార్థులు ఫిజిక్స్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అంశాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ గతేడాది అడ్వాన్స్‌డ్‌లో మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్ అంశాలకు అధిక ప్రాధాన్యత లభించింది. జేఈఈ సిలబస్‌ను పూర్తి చేయడానికి చక్కని మార్గం.. ఉమ్మడి భావనలు (కామన్ కాన్సెప్ట్) ఉన్న అంశాలను ఒకే సమయంలో ప్రిపేర్ కావడం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజీషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; మెకానిక్స్; మోడ్రన్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్; థర్మోడైనమిక్స్; ఎలాస్టిసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్; ఎలక్ట్రోమాగ్నటిజం. ఫిజిక్స్‌లో క్లిష్టంగా భావించే అంశాలను సులభంగా ప్రిపేర్ కావడానికి: థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కామన్‌గా ఉంటాయి. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను దృష్టిలోని ఉంచుకుని ఈ అంశాలను ప్రిపేర్ కావడం ఉత్తమం. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ముందుగా వేవ్ టాపిక్స్‌ను పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే దీని పరిధి స్వల్పంగా ఉండడంతోపాటు త్వరగా పూర్తి చేయవచ్చు. తర్వాత జీయోమెట్రికల్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి. వేవ్స్‌లో ట్రాన్స్వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్‌కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఎల్సీ ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్‌గా ఉంటాయి. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్‌లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రా విటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు. ఫిజిక్స్‌లో సాధారణంగా ఒక అంశానికి మరొక అంశానికి సంబంధం ఉండే మిక్స్డ్ కాన్సెప్ట్ ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఒక అంశంతో సంబంధం ఉండే అన్ని అంశాలను ప్రిపేర్ కావాలి. ఇందుకు అన్ని అంశాలకు ఆధారంగా ఉండే ఒక మూలాధార సూత్రాన్ని రూపొందించుకోవాలి. దీన్ని అవసరమైన చోట్ల అన్వయం చేసుకుంటూపోవడం ప్రిపరేషన్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు మెకానిక్స్‌లో అధిక శాతం సమస్యలు లీనియర్ మూవ్‌మెంటమ్, ఎనర్జీ, యాంగ్యులర్ మూవ్‌మెంటమ్, న్యూటన్ సెకండ్ లాకు సంబంధించినవై ఉంటాయి. -డా॥సి.హెచ్. రామకృష్ణ, డాక్టర్ ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్. కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. గత పోటీ పరీక్షలను పరిశీలిస్తే.. ఈ మూడు విభాగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం సహేతుకం కాదు. కీలక చాప్టర్లు: పీరియాడిక్ టేబుల్; కెమికల్ బాండింగ్; మోల్ కాన్సెప్ట్ (కాన్సన్ట్రేషన్స్ కలిపి); రిడాక్స్ రియాక్షన్స్; క్వాలిటేటివ్ అనాలిసిస్; జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ చాపర్ట్లపై పట్టు.. మిగతా చాప్టర్లను కూలంకశంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. కీలకమైన చాప్టర్.. పీరియాడిక్ టేబుల్. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఈ అధ్యాయం లేనప్పటికీ.. దీన్ని అవగాహన చేసుకోకుండా కెమిస్ట్రీలోని మిగతా అంశాలను అర్థం చేసుకోవడం కష్టం. ఫిజికల్ కెమిస్ట్రీ: ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిని విభిన్న పద్ధతుల్లో ఏవిధంగా అన్వయం చేసుకోవచ్చో పరిశీలించాలి. ఒక టాపిక్ పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లో ఉన్న విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగానికి సంబంధించి సులువుగా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టుతోపాటు విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా కీలకమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే.. మిగతా అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కీలక అంశం.. చదవడమేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరుగైన స్కోర్‌కు: చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంపై తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ నేరుగా (స్ట్రయిట్ ఫార్వర్డ్ కొశ్చన్స్)నే ఉండడం గమనించాల్సిన అంశం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెటలర్జీ, ట్రాన్సిస్టన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించాలి. మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది. ప్రిపరేషన్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు ఒక గంటైనా కేటాయించాలి. -పి. విజయ కిశోర్, డాక్టర్ ఆర్కేస్ ఐఐటీ అకాడెమీ, హైదరాబాద్.