సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్–2023 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1.9 లక్షల మంది దరఖాస్తు చేయగా, అందులో 85 శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 44వేల మంది బాలికలు ఉన్నారు.
ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. ఈసారి ఈ పరీక్షలో ప్రశ్నల సరళి గతంలో మాదిరిగానే మధ్యస్థంగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలు ఒకింత సులభంగా ఉన్నా, గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని వారు చెబుతున్నారు.
ఈసారి సిలబస్‌ను బోర్డు సిలబస్‌తో సమానంగా ఉండేలా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే పేర్కొన్నప్పటికీ ప్రశ్నలను రూపొందించిన తీరు వినూత్నమైన రీతిలో ఉందని వివరించారు. ముఖ్యంగా గణితానికి సంబంధించిన ప్రశ్నల చిక్కులు విప్పడం విద్యార్థులకు కష్టంగా మారిందని హైదరాబాద్ కేంద్రంగా పరీక్షకు కోచింగ్ నిర్వహించిన కార్పొరేట్ విద్యా సంస్థ అకడమిక్ డీన్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ప్రశ్నలు అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం..
ఇక, ఐఐటీ గౌహతి ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పేపర్–1లో మొత్తం 180 మార్కులకు 51 ప్రశ్నలు అడిగారు. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌లో 17 చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో విభాగంలో 60 మార్కులు చొప్పున ప్రశ్నలిచ్చారు. పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం మేథమెటిక్స్‌లో ప్రశ్నల సరళి అంతుచిక్కని రీతిలో కఠినంగా ఉంది.
‘ప్రశ్నలను అర్థంచేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువ సమయం మేథమెటిక్స్ విభాగపు ప్రశ్నలకే వెచ్చించాల్సి వచ్చింది’.. అని హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థి శ్రీకాంత్ వివరించాడు. ఫంక్షన్స్, మేట్రిక్స్, ఎల్లిప్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలు వచ్చాయని తెలిపాడు. ప్రాబబులీటీ, కాంప్లెక్సు నెంబర్స్, త్రీడీ, జామెట్రీల నుంచి కొంచెం మంచి ప్రశ్నలు వచ్చాయని మరికొందరు చెప్పారు.
ఇక ఫిజిక్స్ విభాగంలో కైనమేటిక్స్, థర్మో డైనమిక్స్, మోడరన్ ఫిజిక్సు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, గ్రావిటేషన్, ఆప్టిక్స్, ఎలక్ట్రో స్టాటిస్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. మేథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోల్చిచూస్తే ఈసారి ఫిజిక్స్ సులభంగా ఉందనే చెప్పుకోవచ్చని పలు కోచింగ్ సంస్థల అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.
కెమిస్ట్రీలో వచ్చిన ప్రశ్నలు ఒకింత అసమతుల్యంగా ఉన్నా మేథమేటిక్స్ అంత గజిబిజిగా లేదన్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలను రాయడంలో విద్యార్థులు ఇబ్బందిపడినట్లు చెప్పారు. కొన్ని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్టీ పుస్తకాల నుంచి నేరుగా ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ కైనటిక్స్, లోనిక్, కెమికల్ ఈక్విలిబ్రియమ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆమినీస్, పాలిమర్స్, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ వంటి అంశాల్లో ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా మిక్స్‌డ్ కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెప్పారు. ఫిజికల్ కెమిస్ట్రీలో కన్నా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు.
జూన్ 11న ప్రిలిమనరీ కీ..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 11న ఐఐటీ గౌహతి విడుదల చేయనుంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు జూన్ 9 నుంచి వారికి అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. జూన్ 18న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తామని ఐఐటీ గౌహతి ప్రకటించింది.
సీఆర్‌ఎల్ కటాఫ్ 86–91 మధ్య ఉండొచ్చు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన అభ్యర్థులకు వారు సాధించిన మార్కుల ఆధారంగా రెండు రకాల ర్యాంకులను ప్రకటించనున్నారు. ఒకటి కామన్ ర్యాంకు లిస్టుకు సంబంధించినది కాగా.. మరొకటి అడ్మిషన్ల ర్యాంకుకు సంబంధించినది. అడ్మిషన్ల ర్యాంకులు మొత్తం సీట్లు, పరీక్ష రాసిన అభ్యర్థులు, సంస్థల వారీగా ఆయా సంస్థల్లో సీట్ల కేటాయింపులో చివరి ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ ర్యాంకు కటాఫ్ నిర్ణయిస్తారు.
అలాగే, ర్యాంకు లిస్టుకు సంబంధించి కటాఫ్ మార్కులు ఈసారి జనరల్ కేటగిరీలో 86–91 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఓబీసీలో 71–76, ఈడబ్ల్యూఎస్‌లో 77–82, ఎస్సీలకు 51–55, ఎస్టీలకు 39–44గా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment