సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 పరీక్షలు శనివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించారు. తొలి సెషన్‌కు 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 8.23 లక్షల మంది, రెండో సెషన్ పరీక్షలకు 9.4 లక్షల మంది రిజిస్టర్ కాగా 99 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గణాంకాలు చెబుతున్నాయి.
జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరిగానే ఉన్నందున అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా అదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్ల కటాఫ్ స్కోరు మార్కులను పరిగణనలోకి తీసుకొని ఈసారి జనరల్ కేటగిరీకి 88 నుంచి 89 స్కోరు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారని చెబుతున్నారు. రెండో సెషన్ ప్రాథమిక కీ, అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటించనుంది.
2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు
మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.50 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. అందువల్ల నెలాఖరులోగానే మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఎత్తేసిన అడ్వాన్స్‌డ్‌కు అర్హతకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎన్టీఏ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు సాధిస్తేనే ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందుతారు.
తొలి సెషన్ మాదిరిగానే రెండో సెషన్ ప్రశ్నలు
రెండో సెషన్ పరీక్షల ప్రశ్నల కాఠిన్యత మొదటి సెషన్ మాదిరిగానే ఉందని అభ్యర్థులు తెలిపారు. చివరి రోజైన శనివారం కెమిస్ట్రీ పేపర్ మోడరేట్‌గా ఉందని తెలిపారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఫిజిక్సులో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పలు విద్యా సంస్థల అధ్యాపకులు చెప్పారు. 12వ తరగతి చాప్టర్లలోని అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
కైనమెటిక్స్, గ్రావిటేషన్, సింపుల్ హార్మొనిక్ మోషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఏసీ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్సు, రే, వేవ్ ఆప్టిక్స్ అంశాలతో సహా న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలను అడిగారు. మేథమెటిక్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా, అన్ని చాప్టర్ల నుంచి వచ్చాయని అధ్యాపకులు వివరించారు.
అభ్యర్థులకు ఒకరికి కష్టంగా, మరొకరికి సులభంగా ప్రశ్నలు వచ్చాయనే పరిస్థితి తలెత్తకుండా అందరికీ సమన్యాయం జరిగేందుకు నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా స్కోరు మార్కులు ప్రకటించనున్నారు. అత్యధిక, అత్యల్ప స్కోరులను ఆధారం చేసుకొని నార్మలైజేషన్ చేయడం ద్వారా అభ్యర్థులకు స్కోరు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment