jee exams
-
సారీ, నేను ఓడిపోయాను..!
కోటా: పరీక్షల ఒత్తిడికి మరో నిండు ప్రాణం బలైంది. రాజస్తాన్‌లోని కోటాలో జేఈఈకి ప్రిపేర్ అవుతున్న నిహారిక సింగ్(18) అనే విద్యార్థిని ఉరేసుకుని తనువు చాలించింది. ‘‘మమ్మీ, పాపా! నేను జేఈఈ సాధించలేను. నేను ఓడిపోయాను. నేను మంచి కూతుర్ని కాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ, నాకిక వేరే దారి లేదు’’ అని పేర్కొన్న సూసైడ్ నోట్ ఆమె గదిలో పోలీసులకు లభించింది. స్థానిక శివ విహార్ కాలనీలో కుటుంబంతో ఉంటున్న నిహారిక ఈ నెల 30, 31వ తేదీల్లో జేఈఈ పరీక్ష రాయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చదువుల్లో ఒత్తిడిని తట్టుకుని, పరీక్ష రాయ లేకనే ఉరివేసుకున్నట్లు సూసైట్ నోట్‌ను బట్టి అర్థమవుతోందని వారన్నారు. ఉదయం 10 గంటలైనా నిహారిక బయటికి రాకపోవడంతో అమ్మమ్మ గది తలుపు తట్టింది. ఎంతకూ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా, వెంటిలేటర్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతూ నిహారిక విగతజీవిగా కనిపించింది. ఈ పరిణామంతో వారు హతాశులయ్యారు. చదువులో ముందుండే నిహారిక జేఈఈ పరీక్షపై ఒత్తిడికి గురవుతోందని ఆమె కుటుంబసభ్యుడొకరు చెప్పారు. జేఈఈతోపాటు ఎక్కువ స్కోరు కోసం 12వ తరగతి పరీక్షను సైతం ఆమె రాయాల్సి ఉందన్నారు. నిహారిక తండ్రి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఝలావర్ జిల్లా అకౌడాఖుర్ద్కు చెందిన ఈ కుటుంబం మూడేళ్లుగా కోటాలో ఉంటోంది. కోటాలో వారం వ్యవధిలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో ఇది రెండోదని పోలీసులు పేర్కొన్నారు. నీట్‌కు ప్రిపేరవుతున్న యూపీకి చెందిన మహ్మద్ జయిద్ జనవరి 13న హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. కోటాలో గత ఏడాది 26 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. -
89 పర్సంటైల్ సాధిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 పరీక్షలు శనివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించారు. తొలి సెషన్‌కు 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 8.23 లక్షల మంది, రెండో సెషన్ పరీక్షలకు 9.4 లక్షల మంది రిజిస్టర్ కాగా 99 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గణాంకాలు చెబుతున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరిగానే ఉన్నందున అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా అదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్ల కటాఫ్ స్కోరు మార్కులను పరిగణనలోకి తీసుకొని ఈసారి జనరల్ కేటగిరీకి 88 నుంచి 89 స్కోరు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారని చెబుతున్నారు. రెండో సెషన్ ప్రాథమిక కీ, అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటించనుంది. 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.50 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. అందువల్ల నెలాఖరులోగానే మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఎత్తేసిన అడ్వాన్స్‌డ్‌కు అర్హతకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎన్టీఏ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు సాధిస్తేనే ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందుతారు. తొలి సెషన్ మాదిరిగానే రెండో సెషన్ ప్రశ్నలు రెండో సెషన్ పరీక్షల ప్రశ్నల కాఠిన్యత మొదటి సెషన్ మాదిరిగానే ఉందని అభ్యర్థులు తెలిపారు. చివరి రోజైన శనివారం కెమిస్ట్రీ పేపర్ మోడరేట్‌గా ఉందని తెలిపారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఫిజిక్సులో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పలు విద్యా సంస్థల అధ్యాపకులు చెప్పారు. 12వ తరగతి చాప్టర్లలోని అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కైనమెటిక్స్, గ్రావిటేషన్, సింపుల్ హార్మొనిక్ మోషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఏసీ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్సు, రే, వేవ్ ఆప్టిక్స్ అంశాలతో సహా న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలను అడిగారు. మేథమెటిక్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా, అన్ని చాప్టర్ల నుంచి వచ్చాయని అధ్యాపకులు వివరించారు. అభ్యర్థులకు ఒకరికి కష్టంగా, మరొకరికి సులభంగా ప్రశ్నలు వచ్చాయనే పరిస్థితి తలెత్తకుండా అందరికీ సమన్యాయం జరిగేందుకు నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా స్కోరు మార్కులు ప్రకటించనున్నారు. అత్యధిక, అత్యల్ప స్కోరులను ఆధారం చేసుకొని నార్మలైజేషన్ చేయడం ద్వారా అభ్యర్థులకు స్కోరు లభిస్తుంది. -
సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: జేఈఈ పరీక్షలపై సోషల్ మీడియాలో వచ్చే ‘ఇన్ సైడర్’ (ఎన్టీఏ వర్గాల నుంచి అందిన సమాచారం) పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు సూచించింది. పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ తదితర అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయని పేర్కొంది. ‘జేఈఈ (మెయిన్) 2023 సెషన్ 2కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు ప్రసారం అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అవి ఫేక్. విద్యార్థులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను నమ్మొద్దు. ఈ వీడియోలను హోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల బారిన పడొద్దు’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ (మెయిన్) పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలు ఎన్టీఏ వెబ్సైట్లో, పబ్లిక్ నోటీసు ద్వారా మాత్రమే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం 011–40759000 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది. లేదా jeemain@nta.ac.in కు మెయిల్ చేయవచ్చని వివరించింది. -
జేఈఈ అర్హతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ అర్హత నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జేఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశాలు పొందేప్పుడు ఇంటర్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలని ఎన్టీఏ తొలుత పేర్కొంది. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివాదం చెలరేగింది. ఆయా రాష్ట్రాల్లో ఇంటర్, 10 ప్లస్‌టులో గరిష్టంగా 60 శాతం పర్సంటైల్ మాత్రమే వస్తోంది. దీంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్, ప్లస్ టులోని సబ్జెక్టుల్లో 75 మార్కులు లేదా టాప్ 20 పర్సంటైల్ ఉన్నవారు జాతీయ సీట్ల కేటాయింపునకు అర్హులని ఎన్టీఏ మార్పు చేసింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్‌టులో 65 మార్కులు పొంది ఉంటే సరిపోతుందని నిర్ణయించింది. -
జేఈఈ సెకండ్ సెషన్‌పై కన్ను
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్స్)–2022 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుంది. మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తొలి సెషన్ ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. తొలి సెషన్ పేపర్లలోని ప్రశ్నల స్థాయి ఒకింత క్లిష్టంగా, ఆధునికంగా (మోడరేట్) ఉండి విద్యార్థులను అయోమయానికి గురి చేశాయి. ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాలన్నీ ఇంచుమించు ఒకేలా.. సరైన సమాధానాలుగా స్ఫురించేలా ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడ్డారు. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగిటివ్ మార్కులను అమలు చేస్తున్న నేపథ్యంలో పొరపాటున తప్పుడు సమాధానామిచ్చే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండేవి కావు. ఇప్పుడు అన్ని విభాగాలకూ నెగిటివ్ మార్కులున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులకు మార్కుల స్కోరులో తగ్గుదల ఉందని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, కోచింగ్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సెకండ్ సెషన్‌పైనే అభ్యర్థుల దృష్టి ఇలాంటి పరిస్థితుల కారణంగా మొదటి సెషన్లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించింది. మొదటి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. తాజాగా బుధవారం ఎన్టీఏ మరో పబ్లిక్ నోటీస్‌ను విడుదల చేస్తూ జూలై 9వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11.50 నిముషాల వరకు ఆన్లైన్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణను కొనసాగించవచ్చని సూచించింది. ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. -
AP: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
అమరావతి: ఇంటర్ పరీక్షలకు కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు. -
ఇంటర్ పరీక్షల తేదీల మార్పు?
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే... జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది. వాయిదా వేస్తే..! జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్‌లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేస్తుంది. -
అడుగుతున్నా చెప్పండి
ఏమిటింత కాలుష్యం! ఎందుకీ అలక్ష్యం?! మిమ్మల్నే మిస్టర్ మోడీ.. చెప్పండి. ఈ కరోనా టైమ్‌లో.. నీట్లేంటి, జేఈఈలేంటి?! అడుగుతున్నది లిసిప్రియా కంగుజమ్. ఎనిమిదేళ్ల బాలిక! ఎనిమిదేళ్లంటే బడికి వెళ్లే వయసు. కొందరికైతే ఇంకా బడిలో చేరని వయసు. లిసిప్రియా కంగుజమ్ ఐదో తరగతి చదువుతోంది. బుధవారం పని మీద ఢిల్లీ వెళ్లింది! ప్రధాని, రాష్ట్రపతుల కార్యాలయాలు తిరిగి పెద్ద మనుషుల్ని కలిసి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మాత్రం.. ‘‘వాళ్లు పెద్ద మనుషులైతే నేను కలిసే అవసరం ఎందుకు వస్తుంది?’’ అంటోంది! ఈ మాటను తన ఆరవ యేట నుంచీ అంటోంది. గట్టి క్లయిమేట్ ‘లా’ ను తెమ్మంటోంది లిసిప్రియ. తెస్తే వాతావరణం కొంచెం క్లీన్, కొంచెం కూల్ అవుతుందని కదా అని ఆశ. పని కాలేదు. అందుకే పెద్ద మనుషులు కాదు అంటోంది. గత ఏడాది జూన్‌లో పార్లమెంటు భవనం ముందుకు వెళ్లి ప్లకార్డ్ ప్రదర్శించింది! చట్టాలు తెచ్చేందుకు టైమ్ పడుతుంది అని ఎవరైనా చెప్పకుండా ఉండి ఉంటారా? తెచ్చేవరకు గుర్తు చేస్తూనే ఉంటానని తను. గట్టి పట్టు మీదే ఉంది. ఇప్పుడేమంటుందీ.. కరోనా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్షలు ఏంటీ అని. వాటిని పోస్ట్‌పోన్ చెయ్యమని అడగడానికే లిసిప్రియా ఢిల్లీ వెళ్లింది. అడగడమే. అభ్యర్థించదు. విజ్ఞప్తి చెయ్యదు. మోదీజీని ‘మిస్టర్ మోడీ’ అంటుంది! వేరెవర్నైనా అంతే. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిని అయినా ‘మిస్టర్ గ్యుటెరస్’ అనే అంటుంది. ఆ పెద్దాయన్ని గత ఏడాది డిసెంబర్లో స్పెయిన్‌లో కలిసింది లిసిప్రియా. ఆ సెప్టెంబర్ 13న మన దగ్గర ‘నీట్’ ప్రవేశ పరీక్ష ఉంది. అదొకటే కాదు, జరగవలసిన పరీక్షలు చాలానే ఉన్నాయి. జె.ఇ.ఇ. మెయిన్ ఉంది. జె.ఇ.ఇ. అడ్వాన్డ్ ఉంది. థర్డ్ ఇయర్ యూనివర్సిటీ పరీక్షలు ఉన్నాయి. సీబీఎస్ఇ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్‌డిఎ ఉంది. డి.యు.ఇ.టి. ఉంది. వీటన్నిటినీ తక్షణం వాయిదా వెయ్యమని లిసిప్రియా డిమాండ్. ‘పరీక్షలు రాసేవారు లక్షల్లో ఉంటారు. కరోనా ఎటాక్ అయితే పరిస్థితి ఏంటి?’ అని లిసిప్రియ ఆందోళన. సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఈ మాట చెప్పీ చెప్పీ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఇప్పుడు లిసిప్రియ తన చేతుల్లోకి తీసుకుంది సమస్యను. వివిధ సందర్భాలలో లిసిప్రియ ప్రసంగాలు, ప్రదర్శనలు, ప్రాతినిధ్యాలు లిసిప్రియ మణిపూర్ యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. యాక్టివిస్ట్ అన్నది వయసుకు మించినమాటే కానీ.. ఇప్పటికే వాతావరణ పరిరక్షణ మీద కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చింది! ఈ అమ్మాయిని ఇన్స్పైర్ చేసినవి కూడా సామాజిక కార్యకర్తల ప్రసంగాలే. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చిల్డ్రన్ అవార్డు, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ఇండియా పీజ్ ప్రైజ్, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్వర్క్, ఎస్.డి.జీస్ అంబాసిడర్ అవార్డు, నోబెల్ సిటిజన్ అవార్డు.. ఈ రెండుమూళ్లలోనే లిసిప్రియకు వచ్చేశాయి. ‘సుకీఫూ’ అనే ఒక కిట్‌ను కూడా తయారు చేసింది లిసిప్రియ. సుకీఫూ అంటే సర్వైవల్ కిట్ ఫర్ ద ఫ్యూచర్ శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపించే సాధనం అది. లిసిప్రియ తను చేసేది చేస్తోంది. అధికారంలో ఉన్నవాళ్లను కూడా ‘ఫ్రెష్ ఎయిర్’ కోసం ఏదైనా చేయమని అంటోంది. ఆచరించి చూపడం అంటే ఆదర్శంగా ఉండటమే కదా. ‘ఆదర్శం’ అనేది కూడా వయసుకు మించిన మాటే లిసిప్రియను అభినందించడానికి. కానీ తప్పదు. కాసేపు.. ఆదర్శమే ఆమెకన్నా చిన్న అనుకుంటే సరిపోతుంది. -
నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్!
న్యూడిల్లీ: జేఈఈ, నీట్ పరీక్షలను యథాత«థంగా నిర్వహించాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేశాయి. పరీక్షలు నిర్వహించాలన్న తీర్పు విద్యార్థుల జీవించే హక్కుకు విఘాతమని, అదేవిధంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో రవాణా ఇబ్బందులను ఆ తీర్పులో పరిగణించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు మోలాయ్ ఘటక్, రామేశ్వర్ ఓరాన్, రఘుశర్మ, అమర్జీత్ భగత్, బీఎస్ సిద్ధు, ఉదయ్ రవీంద్ర సావంత్ తరఫున న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షలు యథాత«థంగా నిర్వహించాలని, కరోనా కారణంగా జీవితాలు ఆగవని ఈ నెల 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధ్దమైంది. అప్పటినుంచి ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే ముందుకు సాగడంతో విపక్ష రాష్ట్రాల మంత్రులు సుప్రీంను ఆశ్రయించారు. సెప్టెంబర్ 1–6లో జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ సమాయత్తమయింది. ఇప్పటికే అడ్మిట్‌కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను ఆరంభించింది. అభ్యర్థులకే కాదు... కుటుంబాలకు కూడా రిస్కే పరీక్షలు జరపాలన్న నిర్ణయం అసంబద్ధమని, జిల్లాలో పరీక్షా కేంద్రాల సమీక్షకు కేంద్రానికి తగిన సమయం ఉన్నా పట్టించుకోలేదనే విషయాన్ని తీర్పులో ప్రశ్నించలేదని రివ్యూపిటిషన్‌లో పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడం వారంతా పరీక్షకు ప్రస్తుతం హాజరయ్యేందుకు సమ్మతించినట్లు కాదని తెలిపారు. ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశం ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలను పట్టించుకోలేదన్నారు. ‘‘జీవితాలు ముందుకు సాగాలి, విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోకూడదు’’ అనే రెండు అంశాల ఆధారంగా తీర్పునిచ్చారని, అంతేకాని నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించలేదని పిటి షన్లో వాదించారు. ఈ తీర్పును సమీక్షించకపోతే దేశ విద్యార్థి సమూహానికి తీవ్ర హాని జరగవచ్చని, కేవలం పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపవచ్చని వివరించారు. ఇన్ని లక్షల మంది కరోనా సంక్షోభ సమయంలో అటుఇటు ప్రయాణాలు చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమవుతుందన్నారు. ఈ ఒక్క కారణంతోనైనా గత తీర్పును రద్దు చేయవచ్చని కోరారు. కరోనా సమయంలలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని పిటిషనర్లు తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదన్నారు. -
జేఈఈ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఈస్ట్: అన్ని శాఖల సమన్వయంతో జేఈఈ పరీక్షలకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో నాగబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్సీ సమావేశ మందిరంలో బుధవారం జేఈఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్వో నాగబాబు పరీక్షల కన్వీనర్ కోటేశ్వరరావు,అడిషనల్ ఎస్పీలు తిరుపాల్,శ్రీనివాసులు,ఇతర అధికారులు సమీక్షించారు. సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం డీఆర్వో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పరీక్ష రాసే విద్యార్థుల,తల్లిదండ్రులకు నగరంలోని పలు కల్యాణ మండపాలు,షాదీఖానాలలో వసతి ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.పరీక్ష జరిగే 4వ తేదీన రైల్వేస్టేషన్, బస్టాండ్ అన్ని కళాశాలల వద్ద పరీక్షా సెంటర్ల చిరునామా తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షలు నిర్వహించే అన్ని కళాశాలల యజమానులు రైల్వేస్టేషన్, బస్టాండుల నుంచి బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పరీక్షా కేంద్రాల్లో మంచినీరు,టెంట్లు ,విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష జరిగే సమయంలో హాలు వెలుపల తల్లిదండ్రులకు వసతిని ఏర్పాటు చేసేలా కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 43 కేంద్రాల్లో 33 వేల మంది విద్యార్థులు ఉదయం పేపర్ -1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుందని మొత్తం 33 వేల మంది విద్యార్థులు హాజరవుతారని,మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 12 వేల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.మొత్తం 43 సెంటర్లలో పరీక్ష జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండు,పల్నాడు బస్టాండు,లాడ్జి సెంటర్,రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం,గుజ్జనగుండ్ల సెంటర్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో మొత్తం 82 ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కలుగచేస్తాయన్నారు. పరీక్ష కన్వీనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు కేఎల్పీ పబ్లిక్ పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షా అబ్జర్వర్లకు సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. -
నిమిషం ఆలస్యమైనా...నో ఎంట్రీ
గుంటూరు ఎడ్యుకేషన్ : ఏప్రిల్ 4న జరగనున్న జేఈఈ (మెయిన్స్) పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు గుంటూరు కేంద్రం కో-ఆర్డినేటర్ నామినేని కోటేశ్వరరావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. జేకేసీ కళాశాల రోడ్డులోని డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ వివరాలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి పరీక్ష రాసేందుకు గుంటూరు వస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. నగరంతో పాటు సమీప మండలాల్లోని విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన 43 కేంద్రాల్లో పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. 4వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 ఇంజినీరింగ్ పరీక్షకు 29,083 మంది, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 కేంద్రాల్లో జరిగే పేపర్-2 బీఆర్క్, ప్లానింగ్ పరీక్షలకు 7,399 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంజినీరింగ్, బీఆర్క్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని కోటేశ్వరరావు సూచించారు. విద్యార్థులు ఒకరోజు ముందుగానే కేంద్రాలకు వెళ్లి స్వయంగా పరిశీలించాలని చెప్పారు. ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తి లేదని, దీనిపై సీబీఎస్ఈ బోర్టు కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జేఈఈ పరీక్ష నిర్వహిస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అధికారుల బృందం ఏప్రిల్ 3వ తేదీన గుంటూరు వచ్చి ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులతో సమావేశం కానున్నారని వివరించారు. రవాణా ఏర్పాట్లు గుంటూరు నగరానికి సమీప మండలాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులకు హోటళ్లలో రూమ్‌లను సాధారణ ధరకే అద్దెకు ఇచ్చే విధంగా ఆయా యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారని వివరించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను జేఈఈ మెయిన్స్.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణలో మనమే టాప్ జేఈఈ నిర్వహణలో గుంటూరు జిల్లా జాతీయస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సొంతం చేసుకుందని కోటేశ్వరరావు చెప్పారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో గతఏడాది ఈ పరీక్ష నిర్వహించిన సీబీఎస్ఈ బోర్డు గుంటూరు మినహా మరే ఇతర నగరంలోనూ పెద్దస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవని గుర్తించిందన్నారు. -
విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగిస్తే మంచి మార్కులు
మిగతా సబ్జెక్ట్లతో పోల్చితే ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో చక్కని స్కోరింగ్ సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ప్రశ్నలకు తక్కువ సమయంలో సులభంగా సవూధానమిచ్చే అవకాశం ఉండడమే దీనికి కారణం. ప్రాథమిక భావనల (బేసిక్ కాన్సెప్ట్)పై అవగాహనతోపాటు.. నిర్దేశించిన సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా ప్రిపేరైతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు.. పి. విజయ్ కిశోర్ సీనియర్ ఫ్యాకల్టీ, డా॥ఆర్కేస్ ఐఐటీ అకాడమీ,హైదరాబాద్. జేఈఈ: కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. గత పోటీ పరీక్షలను పరిశీలిస్తే..ఈ మూడు విభాగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంపై మాత్రమే దృష్టి కేంద్రీక రించడం సహేతుకం కాదు. కీలక చాప్టర్లు: పీరియాడిక్ టేబుల్ కెమికల్ బాండింగ్ మోల్ కాన్సెప్ట్ (కాన్సన్ట్రేషన్స్ కలిపి) రిడాక్స్ రియాక్షన్స్ క్వాలిటేటివ్ అనాలిసిస్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ చాపర్ట్లపై పట్టు..మిగతా చాప్టర్లను కూలంకశంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. కీలకమైన చాప్టర్.. పీరియాడిక్ టేబుల్. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఈ అధ్యాయం లేనప్పటికీ..దీన్ని అవగాహన చేసుకోకుండా కెమిస్ట్రీలోని మిగతా అంశాలను అర్థం చేసుకోవడం కష్టం. ఫిజికల్ కెమిస్ట్రీ: ఈ విభాగానికి సంబంధించి గతంలో పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే.. విద్యార్థి మ్యాథమెటికల్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉండడం లేదు. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిని విభిన్న పద్ధతుల్లో ఏవిధంగా అన్వయం చేసుకోవచ్చో పరిశీలించాలి. ఒక టాపిక్ పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లో ఉన్న విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. గతంలో ఐఐటీ-జేఈఈ పరీక్షలో అడిగిన ప్రశ్నల్లోంచి దాదాపు 15-20 శాతం ప్రశ్నలు ఏఐఈఈఈ పరీక్షల్లో రావడం గమనార్హం. ఆర్గానిక్ కెమిస్ట్రీ: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగానికి సంబంధించి సులువుగా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టుతోపాటు విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా కీలకమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే.. మిగతా అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కీలక అంశం.. చదవడమేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి. ఎంసెట్/జేఈఈ/ఏఐఈఈఈ గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంపై తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ నేరుగా (స్ట్రయిట్ ఫార్వర్డ్ కొశ్చన్స్)నే ఉండడం గమనించాల్సిన అంశం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెటలర్జీ, ట్రాన్సిస్టన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి: నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి. కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించాలి మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది. ప్రిపరేషన్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు ఒక గంటైనా కేటాయించాలి. కీలక అంశం: ప్రిపరేషన్లో పాటించాల్సిన కీలక అంశం.. నిర్దేశించిన సిలబస్ మేరకే పరిమితం కావడం. సిలబస్‌ను దాటి ఎట్టి పరిస్థితుల్లోను వేరే అంశాలను ప్రాక్టీస్ చేయవద్దు. ప్రిపేర్ అవుతున్న అంశానికి సంబంధించిన ప్రాథమిక భావన (బేసిక్ కాన్సెప్ట్)పై పట్టు సాధించాలి. తద్వారా సదరు అంశంపై పరిపూర్ణత సాధించడంతోపాటు ప్రశ్నను ఏవిధంగా అడిగినా సమాధానం ఇచ్చే సామర్థ్యం అలవడుతుంది. అంతేకాకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకే తరహా ప్రశ్నలను కాకుండా విభిన్నమైన ప్రశ్నలను ఎంచుకోవాలి. జేఈఈ-అడ్వాన్స్డ్ 2013: అంశాల వారీగా మార్కులు టాపిక్ మార్కులు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 10 గ్యాసెస్ స్టేట్ 10 క్వాలిటేటివ్ అనాలిసిస్ 10 పి-బ్లాక్ 9 ఆరోమాటిక్ కాంపౌండ్ 9 బయోకెమిస్ట్రీ 8 కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ధేర్ డేరివేటివ్స్ 7 కెమికల్ కైనటిక్స్ 6 ఎలక్ట్రో కెమిస్ట్రీ 6 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ-2 6 మెటలర్జీ 5 కాలిగేటివ్ ప్రాపర్టీస్ 4 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ-1 4 కెమికల్ ఈక్విలిబ్రియం 3 కెమికల్ బాండింగ్ 3 ఆయానిక్ ఈక్విలిబ్రియం 3 అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ 3 హైడ్రోకార్బన్ 3 కార్బనల్ కాంపౌండ్స్ 3 రియాక్షన్స్ మెకానిజమ్ 2 థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ 2 సాలిడ్ స్టేట్ 2 సర్ఫేస్ కెమిస్ట్రీ 2 ఎంసెట్ ఎంసెట్ కెమిస్ట్రీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం నుంచి 20 నుంచి 23 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్ మధ్య పెద్ద తేడా ఉండదు. ఇంజనీరింగ్‌లో ప్రాబ్లమ్ బేస్డ్ కొశ్చన్స్ మెడికల్‌తో పోల్చితే 4-5 ఎక్కువగా ఉంటాయి. కెమిస్ట్రీలోని మొత్తం మూడు విభాగాల్లో (ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ) ఆర్గానిక్ కెమిస్ట్రీ కీలకమైంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే అధిక శాతం అంతర్గత సంబంధం గల అంశాలుంటాయి. ఉదాహరణకు గ్రూప్‌లలోని మూలకాల ధర్మాలు దాదాపుగా ఒకే మాదిరిగా ఉంటా యి. ఇలాంటి అంశాల విషయంలో కాంపౌండ్ తయారీ ధర్మాలు, రసాయనిక చర్యలను (ఫ్లోరిన్, క్లోరిన్, ఓజోన్ తదితర)ను టేబుల్ విధానంలో రూపొందించుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ప్రతిచర్యల క్రమం,ఫ్లోచార్ట్స్,మూల కాలు-తయారీ పద్ధతులు-ధర్మాలను వరుస క్రమంలో రివిజన్ చేయడం లాభిస్తుంది. ఆల్కహాల్స్, ఎమైన్స్, ఫినోల్స్, నేమ్డ్ రియాక్షన్స్ చాప్టర్లలోని ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంగ్త్ అంశాలను సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి. ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఫార్ములాల ఆధారంగా ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, సాలిడ్ స్టేట్, కెమికల్ కైనమెటిక్స్, ఈక్విలిబ్రియుం వంటి అంశాల నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. మ్యాథమెటిక్స్, న్యూమరికల్స్ సంబంధితంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫార్ములాల ధర్మాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. ప్రతి ఫార్ములాకు సంబంధించి ప్రొఫైల్ తయూరు చేసుకుని వాటిని పరిశీలించాలి. కెమిస్ట్రీలో మిగతావిభాగాలతో పోల్చితే.. కొంత క్లిష్టమైన విభాగం ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో మూలకాల ధర్మాలను ఒకదానితో మరొకటి బేరీజు వేస్తూ చదవాలి. అన్ని గ్రూపుల్లోని మూలకాల ధర్మాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటారుు. దీనివల్ల క్లిష్టమైన ఫార్ములాలను కూడా సులువుగా గుర్తుంచుకోవచ్చు. వివిధ మూలకాలు, కాంపౌండ్స్ తయారీ, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్స్ తదితర విధానాలను టేబుల్ రూపంలో మలచుకుని ప్రిపరేషన్ సాగిస్తే సులువుగా జ్ఞప్తికి వస్తాయి. ఎక్కువ దృష్టి సారించాల్సిన టాపిక్స్: అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియూడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యూలర్, స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్/గ్యాసెస్, సొల్యూషన్స్, స్టైకోమెట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, పి బ్లాక్ ఎలిమెంట్స్- గ్రూపు 13-17, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రో కార్బన్స్, థర్మోడైనమిక్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరేన్స్, ఆల్కహాల్స్/ ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) ఇంటర్మీడియెట్ సెకండియర్: కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్. కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు. ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీలో ప్రధానంగా దీర్ఘ సమాధాన ప్రశ్నలు కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాల నుంచి వస్తాయి. కాబట్టి వీటిని బాగా చదవాలి. ఎక్కువ సంఖ్యలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. వీటిల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి తెలుగు అకాడెమీ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాన్ని ప్రతి రోజూ చదువుతూ, ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్న వచ్చినా రాయగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. హైడ్రోజన్ స్పెక్ట్రా, బోర్ ఫాస్టులేట్స్, బోర్న్ హేబర్ సైకిల్, పీరియాడిక్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స, ఎసిటలీన్ అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న మరొక విభాగం ఆర్గానిక్ కెమిస్ట్రీ. కాబట్టి ప్రతి రోజూ దీన్ని ఔపోసన పట్టాలి. అదేవిధంగా హైడ్రో కార్బన్ నేమ్డ్ రియాక్షన్స్ వంటి చాప్టర్లను పరీక్షకు ముందు అనేకసార్లు చదవాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యాసిడ్స్ అండ్ బేసెస్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ ఎనర్జిటిక్స్ మొదలైన టాపిక్స్ ముఖ్యమైనవి. వీటి నుంచి ఎంసెట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి సంబంధిత ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను ఒక చోట రాసుకుని ప్రతి రోజూ చదవాలి. జనరల్ కెమిస్ట్రీలో స్టాచియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవడం చేయాలి. పబ్లిక్ పరీక్షల కోసం ప్రతి రోజూ కనీసం గంటసేపైనా కెమిస్ట్రీని చదవాలి.