సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలపై పడింది. జేఈఈ తొలి దశ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగే తేదీల్లోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇంటర్మీడియెట్ బోర్డు పునరాలోచనలో పడింది. షెడ్యూల్ మార్చడంపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్షించారు. పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించారు.
ఆ 3 రోజుల పరీక్షలు వాయిదా వేస్తే...
జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది.
వాయిదా వేస్తే..!
జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21తో ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనపైనా చర్చించారు. పరీక్షలు వాయిదా వేస్తే మే 2 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షలపైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఇంటర్‌తోపాటు టెన్త్ పరీక్షలను కూడా వాయిదా వేసి ఏప్రిల్ 23 తరువాత వేర్వేరు తేదీల్లో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు.
ప్రీపోన్ చేయడంపైనా పరిశీలన
జేఈఈ పరీక్షలు ప్రారంభమయ్యే లోపే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసేలా ప్రీపోన్ చేయాలన్న ప్రతిపాదనపైనా చర్చిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు మొత్తం 16 రోజులు పడుతుంది. ఇందులో ప్రధానమైన పరీక్షలకు 12 రోజులు అవసరం. ఈనెల 7వ తేదీ నుంచి 31వరకు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. వాటిని ముందుకు జరిపి, ఇంటర్ పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తూ ఇప్పటికే బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికిప్పుడు జంబ్లింగ్ విధానాన్ని మార్చడం సాధ్యమవుతుందా అన్న సంశయం ఏర్పడుతోంది. మరోవైపు మార్చి 18, ఏప్రిల్‌లో 2, 5, 10, 14, 15 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు. ఆ రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించగలిగితేనే ప్రీపోన్‌కు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతించాలి. వీటిపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న అనంతరం కొత్త షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment