గుంటూరు ఈస్ట్: అన్ని శాఖల సమన్వయంతో జేఈఈ పరీక్షలకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో నాగబాబు చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో బుధవారం జేఈఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డీఆర్వో నాగబాబు పరీక్షల కన్వీనర్ కోటేశ్వరరావు,అడిషనల్ ఎస్పీలు తిరుపాల్,శ్రీనివాసులు,ఇతర అధికారులు సమీక్షించారు. సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు.
అనంతరం డీఆర్వో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పరీక్ష రాసే విద్యార్థుల,తల్లిదండ్రులకు నగరంలోని పలు కల్యాణ మండపాలు,షాదీఖానాలలో వసతి ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.పరీక్ష జరిగే 4వ తేదీన రైల్వేస్టేషన్, బస్టాండ్ అన్ని కళాశాలల వద్ద పరీక్షా సెంటర్ల చిరునామా తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పరీక్షలు నిర్వహించే అన్ని కళాశాలల యజమానులు రైల్వేస్టేషన్, బస్టాండుల నుంచి బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పరీక్షా కేంద్రాల్లో మంచినీరు,టెంట్లు ,విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష జరిగే సమయంలో హాలు వెలుపల తల్లిదండ్రులకు వసతిని ఏర్పాటు చేసేలా కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
43 కేంద్రాల్లో 33 వేల మంది విద్యార్థులు
ఉదయం పేపర్ -1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుందని మొత్తం 33 వేల మంది విద్యార్థులు హాజరవుతారని,మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 12 వేల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.మొత్తం 43 సెంటర్లలో పరీక్ష జరుగుతుందన్నారు.
ఆర్టీసీ బస్టాండు,పల్నాడు బస్టాండు,లాడ్జి సెంటర్,రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం,గుజ్జనగుండ్ల సెంటర్‌లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో మొత్తం 82 ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కలుగచేస్తాయన్నారు. పరీక్ష కన్వీనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు కేఎల్‌పీ పబ్లిక్ పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, పరీక్షా అబ్జర్వర్‌లకు సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.