
సాక్షి, అమరావతి: జేఈఈ పరీక్షలపై సోషల్ మీడియాలో వచ్చే ‘ఇన్ సైడర్’ (ఎన్టీఏ వర్గాల నుంచి అందిన సమాచారం) పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులకు సూచించింది. పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ తదితర అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయని పేర్కొంది.
‘జేఈఈ (మెయిన్) 2023 సెషన్ 2కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు ప్రసారం అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అవి ఫేక్. విద్యార్థులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను నమ్మొద్దు.
ఈ వీడియోలను హోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల బారిన పడొద్దు’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ (మెయిన్) పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.
సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో, పబ్లిక్ నోటీసు ద్వారా మాత్రమే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం 011–40759000 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది. లేదా jeemain@nta.ac.in కు మెయిల్ చేయవచ్చని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment