‘నీట్’ పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన నీట్–యూజీ 2024 పరీక్ష విధానం, నిర్వహణలో 0.001 శాతం లోపం తలెత్తినా సరే సకాలంలో పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది. మే ఐదో తేదీన నిర్వహించిన నీట్‌యూజీలో కొందరు విద్యార్థులకు సమయాభావం, ఇతరత్రా కారణాలతో గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల సెలవుకాల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేపట్టిన విషయం విదితమే. ‘‘ అత్యంత కఠినమైన ఇలాంటి ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతగా శ్రమిస్తారో మనందరికీ తెలుసు. వైద్యుడే సమాజంలో అవినీతికి పాల్పడితే సమాజానికి ఎంతటి నష్టం చేకూరుతుందో ఊహించండి. ప్రవేశపరీక్షలు నిర్వహించే ఒక బాధ్యతాయుత సంస్థగా ఒకే మాట మీద నిలబడాలి. మీ వైపు ఏదైనా తప్పు జరిగితే నిజాయతీగా ఒప్పుకోవాలి. సరిదిద్దేందుకు చేపట్టిన చర్యలనూ వివరించాలి. కనీసం ఆ దిశగా చర్యలకు సమాయత్తం అయ్యామని అయినా నిరూపించుకోవాలి. అప్పుడే మీ పనితీరుపై విశ్వాసం పెరుగుతుంది’’ అని ఎన్‌టీఏ తరఫున వాదించిన లాయర్లకు కోర్టు చీవాట్లు పెట్టింది.
రెండు వారాల్లో స్పందన తెలపండి
కేసుల తదుపరి విచారణ జరిగే జూలై 8వ తేదీలోపు ఏమేం చర్యలు చేపట్టారో నివేదించాలని కోర్టు సూచించింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోపు మీ స్పందన తెలపాలంటూ ఎన్‌టీఏ, కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా ‘‘దానికి ఎన్‌టీఏ, కేంద్రం సమాధానం చెప్తాయి. మీరెందుకు పిటిషన్లు వేశారో మమ్మల్ని అర్థంచేసుకోనివ్వండి.
మీ వాదనలను సావధానంగా వినేందుకు సాయంత్రందాకా కూర్చుంటాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌నూ కోర్టు విచారించింది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆ మార్కులను తీసేశామని కేంద్రం, ఎన్‌టీఏ జూన్ 13వ తేదీన కోర్టుకు నివేదించిన విషయం విదితమే. ఆ మార్కులు పోను మిగి లిన మార్కులతో ఆ విద్యార్థు లు కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చు లేదంటే మరో సారి పరీక్ష రాసు కోవ చ్చు అని ఎన్‌టీఏ తెలిపింది.
4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులు
మే ఐదున 4,750 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్‌యూజీ–2024 రాశారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంలో రాసిన వారిలో ఆరుగురికి సహా దేశవ్యాప్తంగా 67 మందికి 720కిగాను 720 మార్కులు పొంది టాప్‌ర్యాంక్ సాధించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడమే ఈ అనూహ్య టాప్‌ర్యాంకుల పర్వానికి అసలు కారణమని వెల్లడైంది. వ్యవహారం కోర్టుకు చేరడంతో వారందరికీ గ్రేస్ మార్కులు తొలగిస్తున్నామని ఎన్‌టీఏ ప్రకటించినప్పటికీ అసలు ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని, గోప్యత ఎందుకు పాటించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
సమయం వృథా అయితే ఆ మేరకు అదనపు సమయం పరీక్ష రాయించాలిగానీ విద్యార్థికి ఏ ప్రామాణిక ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇస్తారని విద్యావేత్తలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నీట్‌యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment