విశ్లేషణ
ఏ పరీక్ష అయినా వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడే లీకులు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపించినప్పుడు, లీకులకు అవకాశం మరీ ఎక్కువ. పైగా ఏదోలా అడ్మిషన్ పొందితే కోర్సు దానికదే పూర్తవుతుంది అనే ధోరణి ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కడం ఇంకా పెరుగుతుంది. అందుకే ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అసలు దేశంలో పరీక్షల నిర్వహణ తీరును మార్చడమే దీనికి పరిష్కారం. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చడంతో పాటు, ప్రశ్నపత్రాల కూర్పు తీరు కూడా మారాలి.
భారతదేశంలో ఐఐటీలు లేదా ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో ప్రవేశించడం, వాటి కోర్సులు పూర్తి చేయడం కంటే కష్టం. నాతోపాటు ఐఐటీ మద్రాస్‌లో చేరిన 200 మందిలో నాలుగేళ్ల కోర్సు పూర్తిచేయనివాళ్లు దాదాపుగా లేరు. అందుకే ప్రవేశ పరీక్ష పాసయ్యేందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడరు. అర్హత లేని వారు ఒకవేళ అడ్మిషన్ పొందినప్పటికీ సకాలంలో కోర్సు పూర్తి చేయడం అసాధ్యంగా మారేలా ఉంటే... వాళ్లు ప్రవేశ పరీక్ష గట్టెక్కితే అదే పదివేలనుకునే పరిస్థితి తప్పుతుంది.
కాగితం, పెన్ను ఆధారంగా పరీక్షలు జరిగినప్పుడు కూడా పేపర్లు లీక్‌చేసే గ్యాంగ్‌లు ఉండేవి. అప్పటికి అత్యాధునిక టెక్నాలజీలతో వాళ్లు ప్రశ్న పత్రాల లీక్ చేసే వాళ్లు. అవసరమైన వాళ్లకు చేరవేసే వాళ్లు కూడా. పరీక్ష కేంద్రాల్లో లేదా ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కేంద్రాల్లో కొందరితో కుమ్మక్కైతే చాలు. ఏ పరీక్ష అయినాసరే... లీకుల్లేకుండా నిర్వహించడం అనేది వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడు, అది కూడా భారీ మొత్తాలు ఆశచూపినా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.
అందుకే కాగితం పెన్నుతోనైనా సరే... లీకుల్లేకుండా ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం అసాధ్యమే. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపిస్తుంది. మరి ఏమిటి చేయడం? దానికోసం నాలుగు సూచనలు:
1. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. జేఈఈ (మెయిన్స్), ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూల్యాంకన పరీక్షలు ఇలాగే జరుగుతున్నాయి.
హ్యాకర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకని కంప్యూటర్లలో అనధికార సాఫ్ట్‌వేర్లను నియంత్రించాలి. ఎన్ క్రిప్షన్‌తో కూడిన ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు తొలి పది నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలను సింక్ చేసేందుకు మరో పది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ ఇవ్వాలి. రోజురోజుకూ మెరుగవుతున్న కృత్రిమ మేధ సాయంతోనూ హ్యాకింగ్ సమస్యను అధిగమించే అవకాశముంది.
2. ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలను నాణ్యంగా కూర్చడమూ ఎంతో కీలకం. ఎక్కువమందికి టాప్ స్కోర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోసం చేసినా పాసవలేమన్న స్థాయిలో ప్రశ్న పత్రాలు ఉండాలి. భారత్‌లోని యూజీసీ లాంటి అత్యున్నత విద్యా వ్యవస్థల నాయకులతో సహా చాలామంది, పరీక్ష కఠినమైతే కోచింగ్ వంటివి మరింత విçస్తృత స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు.
పరీక్ష ఎంత కఠినమైనా... ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి వాటికి కోచింగ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. ప్రశ్న పత్రాలను తేలికగా కూర్చడం లేదా తక్కువ పరిమితి ఉన్న సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం వల్ల మాత్రమే కోచింగ్‌కు తక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది. కానీ అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. పరీక్ష స్థాయి ఆధారంగా ప్రశ్న పత్రం కఠినత్వం ఉండాలి. బోర్డు పరీక్షలైతే సగటు విద్యార్థులను వేరు చేయడమన్నది 50 పర్సంటైల్ వద్ద ఉండటం మంచిది.
నీట్, జేఈఈ వంటి పరీక్షలైతే ఈ పర్సంటైల్ 90 – 95 మధ్య ఉంటే మంచిది. ఇందుకు పరీక్ష కఠినంగా ఉండటం అవసరం. అదే సమయంలో ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి, ఆయా బోధనాంశాల్లో నైపుణ్యమున్నవారు ఇద్దరూ సరిగ్గా సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఫ్యాక్చువల్ తప్పులపై ఆధారపడి ప్రశ్నలు రూపొందిస్తే (ఈ ఏడాది నీట్‌లో ఇలాగే జరిగింది) అది నాణ్యమైన ప్రశ్నపత్రం కాదు.
3. అర్థవంతమైన బహుళార్థక ప్రశ్నలు ఇవ్వాలి. ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు అంచనా కట్టవచ్చుననీ, సమాధానం కచ్చితంగా తెలియకపోయినా కొన్ని మోసపు పద్ధతుల ద్వారా సరైన సమాధానం రాబట్టవచ్చుననీ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలంటే విషయంపై లోతైన అవగాహన అవసరం. విద్యార్థుల మేధకు పరీక్ష పెట్టేలా కొన్ని తప్పుడు సమాధానాలు కూడా ఉంటాయి.
కాబట్టి నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు సరిగ్గా సరిపోతాయి. వివరణాత్మకమైన సమాధానాలు రాస్తే... ప్రశ్న పత్రాలు దిద్దేవారి తీరునుబట్టి మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు విద్యార్థికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తత్వం ఉందా, లేదా అనేది తేల్చవు. కాబట్టి కొన్ని వివరణాత్మక ప్రశ్నలూ జోడించడం మేలు. వీటిని సెకెండ్ పేపర్‌లో పెట్టి తులన అనేది టాప్ 20 శాతం విద్యార్థులకే పరిమితం (టాప్ 10 శాతం విద్యార్థులను ఎంపిక చేయడం మన లక్ష్యమైనప్పుడు) చేస్తే దిద్దడంలో తేడాలు గణనీయంగా తగ్గుతాయి.
4. నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణకు అత్యంత కీలకమైన మరో అంశం పారదర్శకత. అన్ని ప్రశ్నలను బహిరంగ పరచకపోయినా నమూనా లేదా మాదిరి ప్రశ్నలు కొన్నింటినైనా జన సామాన్యానికి అందుబాటులో ఉంచాలి. ఎంత శాతం మంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు వంటి సమాచారం అందివ్వాలి. ఈ ఆప్షన్స్‌కూ, విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులకూ మధ్య సంబంధాలను వివరించాలి.
ఈ ఏర్పాట్ల వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ప్రశ్న పత్రాలు కూర్చేవారు ఏకాగ్రతతో ఆ పని చేస్తారు. రెండోది పరీక్ష, నిర్వహణ... రెండింటిపై నమ్మకం పెరుగుతుంది. ర్యాంకుల నిర్ధారణకు పర్సంటైల్స్, స్కేల్డ్ స్కోర్లను జాగ్రత్తగా వినియోగించడం అవసరం. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షల్లో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్న పత్రం వస్తుంది కాబట్టి సమాధానాల ద్వారా వచ్చిన మార్కులు అర్థం లేనివిగా మారిపోతాయి.
అందుకే వీటికి బదులుగా అందరికీ తెలిసిన సైకోమెట్రిక్ టెక్నిక్‌ల సాయంతో స్కేల్డ్ స్కోర్లను నిర్ధారించాల్సిన అవసరముంది. ఈ స్కేల్డ్ స్కోర్స్ ఆధారంగా పర్సంటైల్ మార్కులు సిద్ధమవుతాయి. మోసాలను పసిగట్టేందుకు నిరర్థక ప్రశ్నలు, సైకోమెట్రిక్ అనాలసిస్, స్టాటిస్టిక్స్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ఏదైనా నిరర్థక ప్రశ్న వస్తే వాటిని పక్కనపెట్టాలి. తప్పుడు మార్గాల్లో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిన వారిని డిస్‌క్వాలిఫై చేయాలి.
జేఈఈ మెయిన్ ్స పరీక్ష నిర్వహణకు ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రేవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతోంది. నీట్‌ను మాత్రం స్వయంగా నిర్వహిస్తోంది. నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్న పత్రం తయారీ ఎన్‌టీఏకు కష్టమేమీ కాబోదు. అయితే ఈ రకమైన ప్రశ్న పత్రం తయారీని చాలా శ్రద్ధతో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తయారు చేయాల్సి ఉంటుంది.
బోధనాంశాలపై పట్టున్నవారు, ప్రత్యేకమైన ఏజెన్సీలు, ప్రశ్నల రూపకల్పన, సమాధానాల విశ్లేషణలకు అత్యాధునిక సైకోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం అవసరమవుతుంది. ఎందుకంటే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ టీఏ విశ్వసనీయతపై, అది నిర్వహించే పరీక్షలపై పెద్ద ప్రశ్న చిహ్నం పడింది కాబట్టి! సమాజం మొత్తం ఈ రకమైన స్థితికి చేరడం భవిష్యత్తులో వృత్తినిపుణులుగా ఎదగాల్సిన విద్యార్థులకు ఏమంత మంచిది కాదు.
శ్రీధర్ రాజగోపాలన్
వ్యాసకర్త ‘ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్’
సహ–వ్యవస్థాపకుడు (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment