నీట్‌లో ఏపీ విజయకేతనం | Andhra Pradesh Student Varun Tops All India First Rank In NEET | Sakshi
Sakshi News home page

నీట్‌లో ఏపీ విజయకేతనం

Published Wed, Jun 14 2023 4:18 AM | Last Updated on Wed, Jun 14 2023 4:18 AM

Andhra Pradesh Student Varun Tops All India First Rank In NEET - Sakshi

సాక్షి, అమరావతి: ప్రవేశ పరీక్ష ఏదైనా టాప్‌ ర్యాంకులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు నీట్‌లోనూ ప్రభంజనం సృష్టించారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సు­ల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ–2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు.

నీట్‌లో 720కి 720 మార్కులతో సత్తా చాటాడు. 99.99 పర్సంటైల్‌తో దుమ్ము లేపాడు. అలాగే తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ కూడా 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులో నిలిచాడు. ఈ విద్యార్థికి కూడా 99.99 పర్సంటైల్‌ వచ్చింది. మొత్తం మీద నీట్‌లో ఏపీ విద్యార్థులు అధికంగా ర్యాంకులను కొల్లగొట్టారని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.

రాష్ట్రానికి చెందిన వైఎల్‌ ప్రవర్థన్‌రెడ్డి అఖిల భారత స్థాయిలో 25వ ర్యాంక్‌ సాధించి ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచాడు. ఆల్‌ ఇండియా 40వ ర్యాంక్‌తో ఎస్సీ విభాగంలో ఏపీకి చెందిన కె.యశశ్రీ రెండో స్థానం దక్కించుకుంది. అలాగే 119వ ర్యాంక్‌ సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్‌ చావన్‌ ఎస్టీ విభాగంలో దేశంలో మొదటి ర్యాంకును కొల్లగొట్టాడు.

ఈ మేరకు 2023–24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2023 ఫలితాలు మంగళవారం రాత్రి వెలువడ్డాయి. నీట్‌ యూజీ పరీక్షను దేశవ్యాప్తంగా గత నెలలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20,87,462 మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోగా 20,38,596 మంది పరీక్షకు హాజరయ్యారు.

వీరిలో 11,45,976 మంది (56.21 శాతం) నీట్‌లో అర్హత సాధించారు. అర్హత పొందిన వారిలో 4,90,374 మంది అబ్బాయిలు, 6,55,599 మంది అమ్మాయిలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు. కాగా, తమిళనాడుకు చెందిన కౌస్తవ్‌ బౌరి 716 మార్కులతో మూడో ర్యాంక్, పంజాబ్‌కు చెందిన ప్రాంజల్‌ అగర్వాల్‌ 715 మార్కులతో నాలుగో ర్యాంక్, కర్ణాటకకు చెందిన ధ్రువ్‌ అద్వానీ ఐదో ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. ఆల్‌ ఇండియా టాప్‌ 50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు విద్యార్థులు ఉండగా.. ఇందులో ఐదుగురు ఏపీ విద్యార్థులే కావడం విశేషం. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు.  
 
ఏపీ నుంచి 42,836 మంది 
కాగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ ఏడాది 69,690 మంది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 68,578 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 62.46 శాతం అంటే 42,836 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అర్హత శాతం కొంత మేర పెరిగింది. 2022లో 65,305 మంది పరీక్ష రాయగా 61.77 శాతం 40,344 మంది అర్హత సాధించారు.

తెలంగాణలో 72,842 మంది పరీక్ష రాశారు. వీరిలో 58.55 శాతం అంటే 42,654 మంది అర్హత సాధించారు. కాగా ఆల్‌ ఇండియా కోటాలో 15 శాతం సీట్లకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీజీసీఏ) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు రాష్ట్రాల్లో భర్తీ చేపడతారు.  

 
ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేస్తా 
మాది పోలాకి మండలం తోటాడా గ్రామం. నాన్న బోర రాజేంద్ర నాయుడు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అమ్మ రాజ్యలక్ష్మి తోటాడలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుందనుకున్నా. అయితే నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటానని అనుకోలేదు. నా ప్రాథమిక విద్యాభ్యాసం నరసన్నపేటలోని పూర్తి చేశా. 8వ తరగతి నుంచి కార్పొరేట్‌ స్కూల్, కళాశాలల్లో చదివాను. ఇంటర్మీడియెట్‌లో 987 మార్కులు వచ్చాయి. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతా. 
–బోర వరుణ్‌ చక్రవర్తి, నీట్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement