Telugu States Students Tops In JEE Advanced, Bag 6 Out Of Top 10 Ranks - Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు

Published Mon, Jun 19 2023 1:01 AM | Last Updated on Mon, Jun 19 2023 10:21 AM

Telugu States Students Tops In JEE Advanced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్‌–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్‌ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరా­మ్‌ (5వ), బిక్కిని అభినవ్‌ చౌద­రి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవా­రు. ఇక మహిళల్లో జాతీయ టాప్‌ ర్యాంకర్‌ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్‌ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. 

టాప్‌లో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌.. 
దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ టాప్‌లో నిలిచింది.

ఈ జోన్‌ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్‌–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్‌ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్‌ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. 

నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు 
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జా­యింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు.

ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. 

– జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్‌ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. 

పేదల విద్య కోసం సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తా.. 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్‌ కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం గోదల్‌ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడమే లక్ష్యం. 
– ఫస్ట్‌ ర్యాంకర్‌ చిద్విలాసరెడ్డి 

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. 
1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 
2. రమేశ్‌ సూర్యతేజ (ఏపీ) 
3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 
4. రాఘవ్‌ గోయల్‌ (రూర్కీ ఐఐటీ పరిధి) 
5. అడ్డగడ వెంకట శివరామ్‌ (ఏపీ) 
6. ప్రభవ్‌ ఖండేల్‌వాల్‌ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 
7. బిక్కిని అభినవ్‌ చౌదరి (ఏపీ) 
8. మలయ్‌ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 
9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 
10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement