జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు | JEE Advanced results: Four out of top 10 are Telugu students | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు

Published Mon, Jun 10 2024 3:55 AM | Last Updated on Mon, Jun 10 2024 3:57 AM

JEE Advanced results: Four out of top 10 are Telugu students

టాప్‌–10లో నాలుగు ర్యాంకులు తెలుగు విద్యార్థులకే.. 

వందలోపు ర్యాంకుల్లో 20 మంది మనవారే.. 

భోగలపల్లి సందేశ్‌కు జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు  

జాతీయ టాపర్‌గాఢిల్లీ విద్యార్థి వేద్‌ లహోటి.. 

రెండు రాష్ట్రాల్లో కలిపి 12 వేల మందికి అర్హత.. పెరిగిన కటాఫ్‌ పర్సంటైల్‌..

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌ మొదలు

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్‌ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్‌ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.

అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్‌ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. 

పెరిగిన కటాఫ్‌ 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్‌ పర్సంటైల్‌ ఈసారి పెరిగింది. జనరల్‌ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్‌ కటాఫ్‌ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్‌ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 109గా, రిజర్వేషన్‌ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. 

జోసా కౌన్సెలింగ్‌ షురూ 
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.

మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement