రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ | Most of the applications are from AP and Telangana | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌

Published Sat, May 25 2024 5:04 AM | Last Updated on Sat, May 25 2024 5:04 AM

Most of the applications are from AP and Telangana

హాజరుకానున్న 1.91 లక్షల మంది అభ్యర్థులు

ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు 

ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు  

ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతిలేదు 

బంగారు ఆభరణాలు, బూట్లు, డిజిటల్‌ పరికరాలకు అనుమతి నిరాకరణ 

జూన్‌ 9న ఫలితాలు.. 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌

సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2024 ఈనెల 26న (ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ మద్రాస్‌ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.

మొదటి సెషన్‌ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్‌ పరీక్ష మ.2.30 గంటల నుంచి 5.30 వరకు జరగనుంది. గతంలో నిర్వహించిన అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్టర్‌ కావడం విశేషం. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్‌ కాగా ఈసారి దీనికి మించి హాజరుకానున్నారు.  

తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా.. 
ఈ పరీక్షలకు అత్యధికంగా ఏపీ, తెలంగాణల నుంచి హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే దాదాపుగా 46వేల మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచి్చనట్లు సమాచారం. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక నుంచి కూడా ఎక్కువమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌లో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో బోర్డుల పరీక్షలు, సీబీఎస్‌ఈ పరీక్షలు ముగియడం, జేఈఈ మెయిన్స్‌కు గతంలో కన్నా ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదే స్థాయిలో అడ్వాన్స్‌డ్‌కు కూడా అభ్యర్థుల సంఖ్య పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంతకుముందు.. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లలోనూ కలిపి 14.10 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో క్వాలిఫై కటాఫ్‌ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తున్నారు. ఇలా ఈసారి 2,50,284 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించగా 1.91 లక్షల మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.  


అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇలా..
అన్‌రిజర్వ్‌డ్‌ (ఆల్‌)     : 97,351 
అన్‌రిజర్వ్‌డ్‌ (పీడబ్ల్యూడీ)     : 3,973 
     ఈడబ్ల్యూఎస్‌     : 25,029 
            ఓబీసీ     : 67,570 
             ఎస్సీ     : 37,581 
              ఎస్టీ     : 18,780

జూన్‌ 9న ఫలితాలు.. 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌.. 
మే 31న వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ప్రతిస్పందనల కాపీలు అందుబాటులో ఉంచనుంది. జూన్‌ 2న తాత్కాలిక జావాబుల కీ, జూన్‌ 3 వరకు అభిప్రాయాల స్వీకరణ, జూన్‌ 9న తుది జవాబుల కీ, అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ప్రకటించనుంది. జూన్‌ 10 నుంచి జోసా తాత్కాలిక సీట్ల కేటాయింపు చేపడుతుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16వేల అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లను భర్తీచేస్తోంది.

బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి.. 
ఇక ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే  జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతో పాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన ఉంది. అలాగే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను ఐఐటీ మద్రాస్‌ సంస్థ అడ్మిట్‌ కార్డుల్లో వివరంగా 

పొందుపరిచింది. అవి.. 
⇒ అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి నిరీ్ణత సమయానికి ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశానికి నిర్దేశించిన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. 
⇒అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్‌ కార్డులను తీసుకురావాలి. దానితో పాటు అధికారిక ఫొటో ఐడీ కార్డునూ తెచ్చుకోవాలి. అడ్మిట్‌కార్డు జిరాక్స్‌ కాపీని ఇని్వజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి. 
⇒ అభ్యర్థులు అడ్మిట్‌కార్డులో, అటెండెన్స్‌ షీటులో తమ వేలిముద్రను వేసేముందు వేలిని శుభ్రం చేసుకోవాలి. 

⇒ అభ్యర్థులకు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను కూడా అమలుచేయనున్నారు. షూలు ధరించి రాకూడదు. అలాగే, పెద్ద బటన్‌లతోని వస్త్రాలను, ఫుల్‌స్లీవ్‌ వ్రస్తాలను, బంగారపు ఆభరణాలను ధరించరాదు.  
⇒బాల్‌పాయింట్‌ పెన్నును మాత్రమే వినియోగించాలి. 

⇒పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు. ఎలాంటి డిజిటల్‌ పరికరాలను అనుమతించరు. 
⇒అభ్యర్థులు ట్రాన్స్‌పరెంట్‌ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి. 
⇒అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement