JEE Advanced Result
-
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. పెరిగిన కటాఫ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్ ఈసారి పెరిగింది. జనరల్ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్ కటాఫ్ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 109గా, రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ షురూ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు. -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తగ్గిన ఉత్తీర్ణత శాతం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022లో గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. అలాగే ఈ ఏడాది పరీక్ష రాసినవారి సంఖ్య కూడా తక్కువ ఉంది. కరోనా సమయంలో కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోవడం గమనార్హం. గత నాలుగేళ్ల గణాంకాలను గమనిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. జేఈఈ మెయిన్‌లో మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన టాప్ 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. అయితే 2.50 లక్షల మందికి అవకాశమిస్తున్నా అందులో లక్ష పైనే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేయడం లేదు. అలా దరఖాస్తు చేసిన వారిలోనూ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మరింత తగ్గుతోంది. 2019లో 2.50 లక్షల మందికి గాను 1,74,432 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఏడాది 1,55,538 మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. -
TS: రైతు బిడ్డ సంతోష్‌రెడ్డికి 4వ ర్యాంక్
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రామస్వామి సంతోష్‌రెడ్డి. శుక్రవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంక్ దక్కించుకున్నాడు. 360 మార్కులకు గాను 331 మార్కులు సాధించాడు. రైతు చంద్రశేఖర్‌రెడ్డి, సంతోష దంపతుల కుమారుడైన సంతోష్‌రెడ్డి బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ఐఐటీలో ర్యాంక్ సాధించాలన్నది ఇతని బలమైన కోరిక. కల నెరవేరింది...: ‘మొదటి నుంచి నాకు ఐఐటీ చదవాలని కోరిక. అందుకు అనుగుణంగా పరీక్షకు సిద్ధమయ్యా. మంచి ర్యాంక్ వస్తుంది అనుకొన్నా. కానీ, ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. నా కల నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరతా. -
‘అడ్వాన్స్డ్’లో అదరగొట్టారు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ దెందులూరు/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్/చాగల్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–అడ్వాన్స్డ్–2021 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్–10లో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి (4), పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి (5), మొదుళ్ల హృషికేష్‌రెడ్డి (10), సవరం దివాకర్ సాయి (11) ర్యాంకులను సాధించారు. రామస్వామి సంతోష్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, ఓబీసీ కేటగిరీలో గొర్లె కృష్ణ చైతన్య ఆలిండియాలో మొదటి ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను శుక్రవారం పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్‌కు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. జోన్లవారీగా చూస్తే.. టాప్–100 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. జోన్లవారీగా టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్లో బాలాజీ సిద్ధార్థ్ (126వ ర్యాంక్), పట్నాన యశ్వంత్ నారాయణ (127వ ర్యాంక్) టాప్–5లో ఉన్నారు. విద్యార్థినుల వెనుకంజ ఈసారి జేఈఈ ర్యాంకుల్లో విద్యార్థినులు వెనుకబడ్డారు. ఆలిండియా స్థాయిలో టాప్–100లో ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాప్‌లో నిలిచింది. తెలుగు విద్యార్థినుల విషయానికి వస్తే ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన (107వ ర్యాంకు) అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మందికి అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1,41,699 మంది హాజరుకాగా.. వారిలో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకు గాను 348 మార్కులు వచ్చాయి. ఇక మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో సుమారు 7 వేల మంది ర్యాంకులు దక్కించుకున్నారని తెలుస్తోంది. 27న తొలి విడత సీట్లు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులు వెలువడడంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలొకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలొకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ విద్యా సంస్థలన్నింటిలో మొత్తం 50,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ర్యాంకర్ల అభిప్రాయాలు కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, ఆలిండియా ఐదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి, ఆలిండియా పదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజమండ్రిలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. నాన్న బాపూజీరావు మల్లవరంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. – ప్రగళ్లపాటి వెంకటరత్న సాయికుమార్, ఆలిండియా 21 ర్యాంకర్ ఏఐలో శాస్త్రవేత్తనవుతా.. మాది పాలకొల్లు. నాన్న త్రినాథరావు.. పారిశ్రామికవేత్త, అమ్మ మోహన కృష్ణకుమారి.. గృహిణి. అన్నయ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. నాకు తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్, ఏపీఈసెట్‌లో 9వ ర్యాంక్, జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంక్ వచ్చాయి. ఐఐటీ – బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శాస్త్రవేత్తనవుతా. – సత్తి కార్తికేయ, ఆలిండియా 33వ ర్యాంకర్ సైంటిస్టుని కావాలన్నది నా కల మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు. సైంటిస్టును కావాలన్నది నా కల. మొదటి నుంచీ అమ్మానాన్న డోమ్నిక్, విజయలక్ష్మి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. సైంటిస్టుగా మానవ చరిత్రలో బయటకు రాని విషయాలను వెలికితీయాలన్నదే నా లక్ష్యం. నాసాలో సైంటిస్టుగా పనిచేస్తా. తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తా. – బొంతు మాథ్యూస్, ఎస్టీ కేటగిరీలో 44వ ర్యాంకర్ -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
ఖరగ్‌పూర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసి.. ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. మొత్తం 50 వేల సీట్లు, రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25న రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు జరగనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకులు గత నెల 15వ తేదీన ప్రకటించారు. ఇందులో అర్హత సాధించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో 23 ఐఐటీలు, 32 జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్ఐటీలు), 26 ట్రిపుల్ ఐటీ కాలేజీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా దసరా రోజున వెలువడే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తారు. దీని కోసం ఈ నెల 16వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ ఆథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు అదే రోజు కౌన్సెలింగ్ కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు తెలుసుకునేందుకు దీనిద్వారా వీలుంటుంది. ఇది ముగిసిన తర్వాత అధికారికంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 25 వరకు వెబ్ ఆప్షన్లలో ఎన్నిసార్లయినా మార్పులు చేసుకోవచ్చు. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత దీని గడువు ముగుస్తుంది. 27న ఉదయం 10 గంటలకు తొలి రౌండ్ సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 30 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాల్గవ విడత, 10న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరవ విడత కౌన్సెలింగ్ చేపడతారు. ఆఖరి విడతలో సీట్లు దక్కిన వాళ్ళు నవంబర్ 20 నాటికి రిపోర్ట్ చేయాలి. అటో ఇటో తేలిపోతుంది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చే వీలుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకులు పొందినవారు టాప్ టెన్ కాలేజీల్లో సీట్లు దక్కించుకున్నారు. వీరు జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ లేదా ఎన్ఐటీలో నచ్చిన బ్రాంచ్‌లో సీటు పొందగలిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చిన సీటును వదులుకునే అవకాశం ఉంది. -
అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సుడ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెకండ్ ర్యాంకు, ఈడబ్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి (345 మార్కులు) సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్ జోన్లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో 321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్ జోన్ పరిధిలో టాప్ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. – ఆలిండియా జనరల్‌లో కాపెల్లి యశ్వంత్‌సాయి (ఏలూరు) 32వ ర్యాంకు, చిలుకూరి మణిప్రణీత్ (విజయవాడ) 47వ ర్యాంకు, కందుల యశ్వంత్ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్ ఈడబ్ల్యూఎస్ 11వ ర్యాంకు, నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్ 12, మోగంటి హర్షదీప్ ఈడబ్ల్యూఎస్ 13, వారాడ జశ్వంత్‌నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్‌సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్‌కృష్ణ ఈడబ్యూఎస్ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్ ఓబీసీ 54, ఎస్.వి.సాయిసిద్దార్థ్ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్ 47, ఎస్.విష్ణువర్థన్ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్‌రెడ్డి ఈడబ్యూఎస్ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్ 57 ర్యాంకులను సాధించారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే... ఆలిండియా జనరల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్‌రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం.. లాక్‌డౌన్‌కు ముందు విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తెలిపాడు. మెయిన్స్‌లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్‌రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్‌రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. టెన్త్ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. టెన్త్ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్నారు. -
జేఈఈ–అడ్వాన్స్డ్ టాపర్ చిరాగ్
న్యూఢిల్లీ/పుణే: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షలో మహారాష్ట్రలోని పుణే విద్యార్థి చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన గంగుల భువన్‌రెడ్డి రెండో ర్యాంకు, బిహార్‌కు చెందిన వైభవ్‌రాజ్ మూడో ర్యాంకు సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ–ఢిల్లీ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ–ఢిల్లీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1.5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 43 వేల మందికిపైగా అర్హత సాధించారు. వీరిలో 6,707 మంది బాలికలు ఉన్నారు. మొదటి ర్యాంకు సాధించిన చిరాగ్ ఫలోర్ మొత్తం 396 మార్కులను గాను 352 మార్కులు సాధించాడు. 17వ ర్యాంకర్ కనిష్కా మిట్టల్ బాలికల్లో అగ్రస్థానంలో నిలిచారు. అమె 315 మార్కులు సాధించారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలియజేశారు. ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆత్మ నిర్భర్ భారత్ కోసం పని చేయాలని కోరారు. పరీక్షలో కోరుకున్న ర్యాంకు పొందలేకపోయిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు. ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తా: చిరాగ్ జేఈఈ–అడ్వాన్స్డ్ టెస్టులో తనకు మొదటి ర్యాంకు దక్కినప్పటికీ అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే చదువు కొనసాగిస్తానని చిరాగ్ ఫలోర్ తెలిపాడు. ఈ ఏడాది మార్చి లో ఎంఐటీలో అడ్మిషన్ పొందానని, ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాస్‌లకు హాజరవుతున్నానని వెల్లడించాడు. జేఈఈ–మెయిన్‌లో 12వ ర్యాంకు పొందిన చిరాగ్ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా ఫస్టు ర్యాంకు సొంతం చేసుకోవడం విశేషం. ఐఐటీల్లో సీటు దక్కించుకోవడం చాలా కష్టమైన విషయమని చిరాగ్ వివరించాడు. ప్రతిభకు మెరుగుదిద్దే విద్యావిధానం ఉన్న ఎంఐటీలోనే చదువు కొనసాగిస్తానని పేర్కొన్నాడు. ఎంఐటీ ప్రవేశ పరీక్ష కంటే జేఈఈ టెస్టే కఠినంగా ఉంటుందని, ఈ పరీక్ష తనకు భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. చిరాగ్ ఫలోర్ ఢిల్లీని ప్రగతి పబ్లిక్ స్కూల్, పుణేలోని సెయింట్ ఆర్నాల్డ్ సెంట్రల్ స్కూల్లో చదివాడు. 2019లో హంగేరీలో జరిగిన 13వ అస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2019లో అమెరికన్ మ్యాథమెటిక్స్ పోటీలో ఫస్టు ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి గాను బాలశక్తి పురస్కారం స్వీకరించాడు. ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు... 1. చిరాగ్ ఫాలర్ (మహారాష్ట్ర) 2. గంగుల భువన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 3. వైభవ్‌రాజ్ (బిహార్) 4. ఆర్.మహేందర్‌రాజ్ (రాజస్తాన్) 5. కేశవ్ అగర్వాల్ (హరియాణా) 6. హర్ధిక్ రాజ్‌పాల్ (తెలంగాణ) 7. వేదాంగ్ ధీరేంద్ర అస్గోవాంకర్ (మహారాష్ట్ర) 8. స్వయం శశాంక్ చూబే (మహారాష్ట్ర) 9. హర్షవర్ధన్ అగర్వాల్ (హరియాణా) 10. ధ్వనిత్ బేనీవాల్ (హరియాణా) -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసేందుకు ఐఐటీ ఢిల్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జోసా ఏర్పాట్లు చేసింది. -
జేఈఈ టాపర్ కార్తికేయ
న్యూఢిల్లీ: జేఈఈ (అడ్వాన్స్డ్) 2019 ఫలితాల్లో గుజరాత్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372కు గాను 346 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఐఐటీల్లో ప్రవేశ అర్హతను కల్పించే జేఈఈ ఫలితాలను ఐఐటీ– రూర్కీ శుక్రవారం విడుదల చేసింది. అలహాబాద్‌కు చెందిన గౌరవ్‌సింగ్ 340 మార్కులతో, ఢిల్లీకి చెందిన అర్చిత్ బుబ్నా 335 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ మిత్రులు కావడం గమనార్హం. ఒకరి నోట్స్ ఒకరు పంచుకొని చదువుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జోన్‌కు చెందిన ఆకాశ్ రెడ్డి, కార్తికేయ బత్తెపాటి నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. మొత్తం 1,61,319 విద్యార్థులు పరీక్ష రాయగా 38,705 మంది అర్హత సాధించారు. అందులో 5,356 మంది మాత్రమే విద్యార్థినులు ఉన్నారు. జనరల్ కేటగిరీ నుంచి 15,556, ఆర్థికంగా వెనుకబడిన వర్గం నుంచి 3,636, బీసీ నుంచి 7,651, ఎస్సీ నుంచి 8,758, ఎస్టీ నుంచి 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 16 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థినుల విభాగంలో సహాయ్ టాప్ కామన్ ర్యాంక్ లిస్టు (సీఆర్ఎల్)లో గుప్త కార్తికేయ మొదటిస్థానం సాధించగా, 308 మార్కులతో పదో ర్యాంక్ సాధించిన షబ్నమ్ సహాయ్ విద్యార్థిని విభాగంలో టాప్‌గా నిలిచారు. ఈమెకు నృత్యంతోపాటు పియానో వాయించడంలో కూడా నైపుణ్యం ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు చదివానని ఆమె అన్నారు. ఉపాధ్యాయులతో, మిత్రులతో మాట్లాడటానికి మాత్రమే వాట్సప్ వినియోగించానని తెలిపారు. సహాయ్ తండ్రి ఐఐఎం–అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాదాపూర్‌కు చెందిన సూరపనేని సాయి వంగ, ముంబైకి చెందిన తులిప్ పాండే విద్యార్ధినుల విభాగంలో రెండు, మూడు ర్యాంకులు సాధించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా: గుప్తా సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కష్టపడి చదవడం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగానని గుప్తా కార్తికేయ అన్నారు. తన తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పినప్పటికీ తానే తిరస్కరించానని అన్నారు. చదువులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి బాడ్మింటన్ ఆడటంతోపాటు మిత్రులతో కలసి ఆహారం తినేవాడినని అన్నారు. గుప్తా తండ్రి ఓ పేపర్ తయారీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గుప్తా రెండు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడని అతడి తల్లి పూనమ్ తెలిపారు. క్లాసులు ముగిశాక కూడా ఆరేడు గంటలు చదువుకునేవాడని ఆమె అన్నారు. టాప్–10లో తమ కుమారుడు నిలుస్తాడన్న నమ్మకం ముందు నుంచీ ఉందని తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్డ్: సప్లిమెంటరీ మెరిట్ జాబితా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2018 అర్హుల సంఖ్య పెరిగింది. తొలుత ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫలితాలకు అదనంగా మరికొంత మంది అర్హుల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం విడుదలైన ఫలితాల్లో 18,138 మంది అర్హత సాధించారు. తాజాగా అనుబంధ(సప్లిమెంటరీ) మెరిట్ జాబితాలో 13,842 మంది అదనంగా అర్హత సాధించినట్టు పేర్కొన్నారు. అంటే మొత్తం 31,980 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందనున్నారు. గత ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాదే తక్కువ మంది అర్హత సాధించడంతో కేంద్ర మానవ వనరులు శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారీగా ఐఐటీ సీట్లు ఉండటం, ఒక్కో సీటుపై కేంద్ర ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుండటంతో.. కొత్త మెరిట్ లిస్ట్‌ను రూపొందించాల్సిందిగా ఐఐటీ కాన్పూర్‌కు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఐఐటీ సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదన్నారు.. ప్రభుత్వం ఐఐటీల కోసం భారీగా ఖర్చు చేస్తుందని గుర్తుచేశారు. దీంతో కట్ ఆఫ్ తగ్గించిన ఐఐటీ కాన్పూర్ కొత్త జాబితాను రూపొందించింది. అయిన్పటికీ గతేడాదితో పోల్చితే ఇది తక్కవే అని చెప్పాలి. 2017లో 50,455 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన ఈ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్ యూనివర్సిటీ మే 20న నిర్వహించింది. ఫలితాలు జేఈఈ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉన్నాయి. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనూ ఫలితాలు చూడవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ 2018 పరీక్షకు 1,55,158 మంది హాజరవగా 18,138 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరిలో 16,062 మంది పురుషులు, 2076 మహిళలు ఉన్నారు. రూర్కి ఐఐటీకి చెందిన ప్రణవ్ గోయల్ ఆలిండియా టాప్ ర్యాంకు సాధించారు. ప్రణవ్ 360 మార్కులకు గాను 337 మార్కులు పొందారు. ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు, ఢిల్లీ ఐఐటీకి చెందిన కాలాష్ గుప్తా మూడో ర్యాంకు పొందారు. మహిళల క్యాటగిరిలో మీనాల్ ప్రకాశ్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. మీనాల్ 318 మార్కులు పొంది సీఆర్ఎల్లో ఆరో ర్యాంకు సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో.. విశాఖపట్నంకు చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ చోడిపిల్లి ఆలిండియా ఏడో ర్యాంకు సాధించడంతో పాటు కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ క్యాటగిరిలో హైదరాబాద్ విద్యార్థి శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. కాన్పూర్ ఐఐటీ పరిధిలో మహిళల విభాగంలో వినీత వెన్నెల 261మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు. -
జేఈఈ అడ్వాన్స్డ్: మోహన్‌కు టాప్ ర్యాంక్!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను మద్రాస్ ఐఐటీ ఆదివారం వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లతోపాటు కేంద్రం ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఈ పరీక్షల్లో చండీగఢ్‌కు చెందిన సర్వేష్ మెహత్వానీ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించగా, పుణెకు చెందిన అక్షత చుఘ్ రెండో ర్యాంకు సాధించాడు. అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా పేరొందిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హైదరాబాద్‌కు చెందిన మోహన్ అభ్యాస్ ఆలిండియా 64వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి నిఖిల్ 248వ ర్యాంకు సాధించాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షల్లోనూ మోహన్ అభ్యాస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు సాధించిన మోహన్.. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. అతని విద్యా ప్రతిభకు గుర్తింపు ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డును సైతం అతను అందుకున్నాడు. అతనికి యంగ్ అఛీవర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును సాక్షి అందజేసింది.