ప్రణవ్‌కు స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు
సాక్షి, న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను ఐఐటీ కాన్పూర్ యూనివర్సిటీ మే 20న నిర్వహించింది. ఫలితాలు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉన్నాయి. ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లోనూ ఫలితాలు చూడవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2018 పరీక్షకు 1,55,158 మంది హాజరవగా 18,138 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. వీరిలో 16,062 మంది పురుషులు, 2076 మహిళలు ఉన్నారు.
రూర్కి ఐఐటీకి చెందిన ప్రణవ్ గోయల్ ఆలిండియా టాప్ ర్యాంకు సాధించారు. ప్రణవ్ 360 మార్కులకు గాను 337 మార్కులు పొందారు. ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు, ఢిల్లీ ఐఐటీకి చెందిన కాలాష్ గుప్తా మూడో ర్యాంకు పొందారు. మహిళల క్యాటగిరిలో మీనాల్ ప్రకాశ్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. మీనాల్ 318 మార్కులు పొంది సీఆర్‌ఎల్‌లో ఆరో ర్యాంకు సాధించారు.
ఇక తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో.. విశాఖపట్నంకు చెందిన కేవీఆర్ హేమంత్ కుమార్ చోడిపిల్లి ఆలిండియా ఏడో ర్యాంకు సాధించడంతో పాటు కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ క్యాటగిరిలో హైదరాబాద్ విద్యార్థి శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. కాన్పూర్ ఐఐటీ పరిధిలో మహిళల విభాగంలో వినీత వెన్నెల 261మార్కులు సాధించి టాప్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment