జేఈఈ టాపర్‌ కార్తికేయ | JEE Advanced Result 2019 declared | Sakshi
Sakshi News home page

జేఈఈ టాపర్‌ కార్తికేయ

Published Sat, Jun 15 2019 1:33 AM | Last Updated on Sat, Jun 15 2019 1:33 AM

JEE Advanced Result 2019 declared - Sakshi

కార్తికేయ, షబ్నమ్‌ సహాయ్‌

న్యూఢిల్లీ: జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) 2019 ఫలితాల్లో గుజరాత్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్‌ 372కు గాను 346 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఐఐటీల్లో ప్రవేశ అర్హతను కల్పించే జేఈఈ ఫలితాలను ఐఐటీ– రూర్కీ శుక్రవారం విడుదల చేసింది. అలహాబాద్‌కు చెందిన గౌరవ్‌సింగ్‌ 340 మార్కులతో, ఢిల్లీకి చెందిన అర్చిత్‌ బుబ్నా 335 మార్కులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ మిత్రులు కావడం గమనార్హం. ఒకరి నోట్స్‌ ఒకరు పంచుకొని చదువుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ జోన్‌కు చెందిన ఆకాశ్‌ రెడ్డి, కార్తికేయ బత్తెపాటి నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. మొత్తం 1,61,319 విద్యార్థులు పరీక్ష రాయగా 38,705 మంది అర్హత సాధించారు. అందులో 5,356 మంది మాత్రమే విద్యార్థినులు ఉన్నారు. జనరల్‌ కేటగిరీ నుంచి 15,556, ఆర్థికంగా వెనుకబడిన వర్గం నుంచి 3,636, బీసీ నుంచి 7,651, ఎస్సీ నుంచి 8,758, ఎస్టీ నుంచి 9,034 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్‌ 16 నుంచి సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

విద్యార్థినుల విభాగంలో సహాయ్‌ టాప్‌
కామన్‌ ర్యాంక్‌ లిస్టు (సీఆర్‌ఎల్‌)లో గుప్త కార్తికేయ మొదటిస్థానం సాధించగా, 308 మార్కులతో పదో ర్యాంక్‌ సాధించిన షబ్నమ్‌ సహాయ్‌ విద్యార్థిని విభాగంలో టాప్‌గా నిలిచారు. ఈమెకు నృత్యంతోపాటు పియానో వాయించడంలో కూడా నైపుణ్యం ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు చదివానని ఆమె అన్నారు. ఉపాధ్యాయులతో, మిత్రులతో మాట్లాడటానికి మాత్రమే వాట్సప్‌ వినియోగించానని తెలిపారు. సహాయ్‌ తండ్రి ఐఐఎం–అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాదాపూర్‌కు చెందిన సూరపనేని సాయి వంగ, ముంబైకి చెందిన తులిప్‌ పాండే విద్యార్ధినుల విభాగంలో రెండు, మూడు ర్యాంకులు సాధించారు.

సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా: గుప్తా
సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి, కష్టపడి చదవడం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగానని గుప్తా కార్తికేయ అన్నారు. తన తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ తానే తిరస్కరించానని అన్నారు. చదువులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి బాడ్మింటన్‌ ఆడటంతోపాటు మిత్రులతో కలసి ఆహారం తినేవాడినని అన్నారు. గుప్తా తండ్రి ఓ పేపర్‌ తయారీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గుప్తా రెండు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నాడని అతడి తల్లి పూనమ్‌ తెలిపారు. క్లాసులు ముగిశాక కూడా ఆరేడు గంటలు చదువుకునేవాడని ఆమె అన్నారు. టాప్‌–10లో తమ కుమారుడు నిలుస్తాడన్న నమ్మకం ముందు నుంచీ ఉందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement