ప్రణవ్ గోయల్, ఎం.శివకృష్ణ మనోహర్, హేమంత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్–10లో ఇద్దరు, టాప్–20లో మరో ముగ్గురు తెలుగు విద్యార్థులు చోటు సంపాదించారు. జాతీయ స్థాయిలో 360 మార్కులకు నిర్వహించిన అడ్వాన్స్‌డ్ ఓపెన్ కేటగిరీలో.. మావూరి శివకృష్ణ మనోహర్ 319 మార్కులతో 5వ ర్యాంకు, చోడిపల్లి హేమంత్ కుమార్ 316 మార్కులతో 7, గోసుల వినాయక శ్రీవర్ధన్ 11, అయ్యపు ఫణి వెంకట వంశీనాథ్ 14, బసవరాజు జిష్ణు 15వ ర్యాంకు సాధించారు. గత నెల 20న తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ కాన్పూర్ ఆదివారం ప్రకటించింది. హరియాణాలోని పంచకులకు చెందిన విద్యార్థి ప్రణవ్ గోయల్ తొలి ర్యాంకు (337 మార్కులు) సాధించగా.. రాజస్తాన్‌లోని కోటాకు చెందిన సాహిల్ జైన్ రెండో ర్యాంకు (326 మార్కులు), ఢిల్లీకి చెందిన కైలాశ్ గుప్తా మూడో ర్యాంకు సాధించారు.
అర్హులు 18,138 మందే..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లోని 11,279 సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో ఈసారి బాలికలకు ప్రత్యేకంగా 800 సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి భర్తీ చేయనున్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1,55,158 మంది విద్యార్థులు హాజరుకాగా... 18,138 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. ఇందులో బాలురు 16,062 మంది, బాలికలు 2,076 మంది ఉన్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే భారీగా తగ్గిపోవడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 50 వేల మంది అర్హత సాధించగా.. ఈసారి 18,138 మందికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఉండే కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు ఐఐటీల పరిధిలో గతేడాది 18 వేల మంది అర్హత సాధించగా.. అందులో తెలుగు విద్యార్థులు 12 వేల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈసారి ఈ ఐఐటీల పరిధిలో మొత్తంగా 8 వేల మందిలోపే అర్హత సాధించగా.. ఇందులో తెలుగు విద్యార్థులు 4 వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి ఓపెన్ కేటగిరీలో 126 మార్కులను, ఓబీసీలో 114, ఎస్సీ, ఎస్టీలకు 63 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం.
టాప్–1, 2, 9 ర్యాంకర్లూ ఇక్కడ చదివినవారే..
అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్ ప్రణవ్, రెండో ర్యాంకర్ సాహిల్ జైన్, 9వ ర్యాంకు సాధించిన రాజస్థాన్ విద్యార్థి లే జైన్ ముగ్గురూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యా సంస్థల్లో చదువుకున్నవారేనని ఆయా విద్యా సంస్థలు ప్రకటించాయి. మొత్తంగా ఓపెన్ కేటగిరీ టాప్–10లో 1, 2, 5, 7, 9 ర్యాంకర్లు తెలుగు రాష్ట్రాల్లో చదివినవారేనని పేర్కొన్నాయి.
కేటగిరీ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావూరి శివకృష్ణ మనోహర్ జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించగా.. ఆయన ఐఐటీ మద్రాసు పరిధిలో ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకర్‌గా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన హేమంత్‌కుమార్ కాన్పూర్ ఐఐటీ పరిధిలో టాపర్‌గా నిలిచారు. ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ విద్యార్థి జాటోత్ శివతరుణ్ మొదటి ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌కే చెందిన శశాంక్ అచ్యుత్‌కు 62వ ర్యాంకు దక్కింది.
‘సూపర్–30’నుంచి 26 మంది ఉత్తీర్ణత
గణితశాస్త్ర నిపుణుడు ఆనంద్‌కుమార్‌కు చెందిన ‘సూపర్–30’అకాడమీ విద్యార్థులు ఈసారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిశారు. అకాడమీ నుంచి 30 మంది పరీక్షకు హాజరుకాగా.. 26 మంది ఉత్తీర్ణత సాధించారు. 2002లో సూపర్–30 అకాడమీని ప్రారంభించిన ఆనంద్‌కుమార్.. ఏటా 30 మంది పేద విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నారు. అకాడమీ నుంచి ఇప్పటివరకు 500 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడం గమనార్హం.
ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జేఈఈ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడు దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు ఈనెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 27న మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. వచ్చే నెల 3న రెండో దశ, 6న మూడో దశ, 9న నాలుగో దశ, 12న ఐదో దశ, 15న 6వ దశ, 18వ తేదీన చివరి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది.
సొంత స్టార్టప్ పెడతా..
‘‘సొంతంగా స్టార్టప్ స్థాపించాలన్నదే నా లక్ష్యం. ఇప్పటికే మాకు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. నేను బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తా..’’ – ప్రణవ్ అగర్వాల్, 1వ ర్యాంకర్
సివిల్స్ సాధించాలన్నదే లక్ష్యం
‘‘సివిల్స్ సాధించాలన్నదే నా లక్ష్యం. ముందుగా ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. మా నాన్న నాగరాజు బాంబేలో సీపీడబ్ల్యూడీలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఎంసెట్‌లలోనూ మంచి ర్యాంకులు వచ్చాయి..’’ – హేమంత్‌కుమార్ చోడిపిల్లి, 7వ ర్యాంకర్
కొత్త ఆవిష్కరణలు చేస్తా..
‘‘పరిశోధనలవైపు వెళ్లాలన్నదే నా లక్ష్యం. కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారిస్తా. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తాను..’’ – బి.జిష్ణు, 15వ ర్యాంకర్
ఐఏఎస్ అవుతా..
‘‘ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. అందుకోసం సివిల్స్ రాస్తాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి.. సివిల్స్‌వైపు వెళతాను.’’ – జి.సాయి అభిషేక్, 31వ ర్యాంకర్
గౌలిదొడ్డి గురుకులంలో పది మందికి ఐఐటీ సీట్లు
రాయదుర్గం: హైదరాబాద్ శివార్లలోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించారు. కాలేజీకి చెందిన విద్యార్థులు బి.భాస్కర్ ఎస్టీ కేటగిరిలో 449 ర్యాంకు, రమేశ్‌చంద్ర ఎస్సీ కేటగిరీలో 567 ర్యాంకు సాధించారు. మొత్తంగా ఈ గురుకుల కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాగా.. అందులో 10 మంది ఐఐటీ సీట్లు సాధించనుండటం, వీరంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. వీరితోపాటు మరికొందరు విద్యార్థులకు ఎన్‌ఐటీలలో సీట్లు వచ్చే అవకాశముందని ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment