ఆకాశ్ రెడ్డి(4వ ర్యాంక్), బి.కార్తికేయ(5వ ర్యాంక్), తివేశ్ చంద్ర(8వ ర్యాంక్)
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెం దిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాం కును సాధించగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఆలిండియా 5వ ర్యాంకును, ఏపీకే చెందిన ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకును సాధించాడు. అలాగే టాప్– 100లో 30 ర్యాంకులను, టాప్–500లో 132 ర్యాంకులను హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని విద్యార్థులు సాధించారు. టాప్–1000 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే దాదాపు 300 మంది వరకు ఉంటారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఆలిండియా టాపర్‌గా మహరాష్ట్రలోని బళ్లార్‌పూర్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372 మార్కులకుగాను 346 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. 2వ ర్యాంకును అలహాబాద్‌కు చెందిన హిమాన్షు గౌరవ్‌సింగ్ సాధించగా 3వ ర్యాంకును ఢిల్లీకి చెందిన అర్చిత్ బబ్నా సాధించారు. 308 మార్కులతో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే జోన్ పరిధి ప్రాంతానికి చెందిన షబ్నం సాహే బాలికల కేటగిరీలో టాపర్‌గా నిలిచారు.
హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో టాపర్లు వీరే..
టాప్ ర్యాంకుల సాధించిన విద్యార్థుల్లో ఐఐటీ జోన్లవారీగా ఐదేసి మంది వివరాలను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. అందులో హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో గిల్లెల ఆకాశ్‌రెడ్డి 4వ ర్యాంకు సాధించగా 5వ ర్యాంకును బట్టేపాటి కార్తికేయ సాధించారు. కౌస్థుబ్ డీఘే 7వ ర్యాంకు సాధించగా, ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, గుంపర్తి వెంకటకృష్ణ సూర్య లిఖిత్ 13వ ర్యాంకు సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో బాలుర కేటగిరీలో టాపర్‌గా నిలవగా జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించిన సూరపనేని సాయి విగ్న 44 బాలికల కేటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్‌లో టాపర్‌గా నిలిచారు.
38,705 మంది అర్హులు...
ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 27వ తేదీ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.45 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా పరీక్ష రాసేందుకు 1,74,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,61,319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 38,705 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33,349 మంది బాలురు ఉండగా 5,336 మంది బాలికలు ఉన్నారు.
ఇబ్బందులు పెట్టిన సాంకేతిక సమస్యలు...
ఫలితాల వెబ్‌సైట్‌కు సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యలతో విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు వేచిచూసినా వెబ్‌సైట్‌లో ఫలితాల లింకు అందుబాటులోకి వచ్చాక సమస్యలు తలెత్తడంతో ఫలితాలు మధ్యాహ్నం చూసుకోవాలని ఐఐటీ రూర్కీ తమ వెబ్‌సైట్‌లో మెసేజ్ పెట్టింది. ఆ తరువాత మళ్లీ సమస్యలు రావడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిందండ్రులు ఊపరి పీల్చుకున్నారు.
అర్హుల్లో రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్...
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఢిల్లీ ఐఐటీ జోన్ పరిధికి చెందినవారే ఉండగా రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన 38,705 మంది విద్యార్థుల్లో ఢిల్లీ జోన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన 9,477 మంది అర్హత సాధించగా ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలకు చెందిన 8,287 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో స్థానంలో ఐఐటీ బాంబే పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 6,140 మంది అర్హత సాధించారు.
ఏఏటీకి దరఖాస్తులు...
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) రిజిస్ట్రేషన్లను ఐఐటీ రూర్కీ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
టాపర్ల అభిప్రాయాలు..
సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా...
అమ్మానాన్నల ప్రోత్సాహంతో ప్రతిరోజూ కనీసం 12 గంటలు చదివా. నా కష్టానికి ప్రతిఫలంగా మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ చేసి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. – ఆకాశ్‌రెడ్డి, జేఈఈ అడ్వాన్స్‌డ్ 4వ ర్యాంకర్
సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తా. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా. లేదంటే ఉద్యోగం చేస్తా. – బట్టేపాటి కార్తికేయ, 5వ ర్యాంకర్
సివిల్ సర్వెంట్ కావాలని ఉంది
సివిల్ సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తా. టాప్–10 లో ర్యాంకు వస్తుందనుకున్నా. అయినా మంచి ర్యాంకే వచ్చింది. ఐఐటీ బాంబేలో బీటెక్ చేస్తా. – సూర్య లిఖిత్, 13వ ర్యాంకర్
Comments
Please login to add a commentAdd a comment