Top Ranks
-
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
దలాల్ స్ట్రీట్ దంగల్: అదానీ, అంబానీ టాప్ ర్యాంకులు పాయే!
సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో సోమవారం నాటి అమ్మకాలసెగ భారత కుబేరులను భారీ షాక్ ఇచ్చింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా టాప్-10 నుండి నిష్క్రమించారు గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. దలాల్ స్ట్రీట్ లో సోమవారం నాటి భారీ నష్టాలతో బిలియనీర్ అదానీ ఇప్పుడు టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంటే వెనుక బడి ఉన్నారు. గౌతమ్ అదానీ కంపెనీల షేర్ల క్షీణత కారణంగా అదానీ నికర విలువ 6.91 బిలియన్ డాలర్లు తగ్గి 135 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఆర్ఐఎల్ చీఫ్ నికర విలువ 82.4 బిలియన్ డాలర్లకు తగ్గడంతో 11వ స్థానానికి పడిపోయారు. ఈ నెల ప్రారంభంలో, బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు, తొలి భారతీయుడు, తొలి ఆసియన్‌గా నిలిచారుఅదానీ. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం గౌతమ్ అదానీ దేశంలో టాప్ ట్రిలియనీర్‌గా నిలిచారు. ప్రకారం లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడు గౌతమ్ అదానీ. పదేళ్లపాటు అత్యంత సంపన్న భారతీయ ట్యాగ్‌ను పట్టుకున్న అంబానీ ఈ ఏడాది రూ.7.94 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. -
పాలిసెట్‌లో సత్తా చాటారు
కడప ఎడ్యుకేషన్: పాలిసెట్ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జిల్లా వ్యాప్తంగా మే నెల 29వ తేదీన కడప, ప్రొద్దుటూరులలో కలుపుకుని 23 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 7843 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 7119 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 90.97 ఉత్తీర్ణత శాతం సాధించారు. వీరిలో 4811 మంది బాలురకు 4312 మంది ఉత్తీర్ణులై 86.63 శాతం, 3032 మంది బాలికలకు 2807 మంది ఉత్తీర్ణులై 92.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఫస్ట్ నాగమానస పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మైదుకూరుకు చెందిన రాచమల్లు నాగమానసరెడ్డి 120 మార్కులకు 115 మార్కులు సాధించి రాష్ట్రంలో 54వ ర్యాంకు సాధించడంతోపాటు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే దువ్వూరు మండలం మీర్జన్‌పల్లెకు చెందిన ఇట్టా వెంకటలక్ష్మి 110 మార్కులను సాధించి రాష్ట్రంలో 206వ ర్యాంకును పొంది జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. తొండూరు మండలం ఊడవగాండ్లపల్లెకు చెందిన దాసరి నందిని 106 మార్కులతో రాష్ట్రంలో 390 ర్యాంకును సాధించి జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచింది. ఐఐటీ చదివి సివిల్స్ సాధించడమే లక్ష్యం బాగా చదివి ఐఐటీలో సీటు సాధించి ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత సివిల్స్‌లో ర్యాంకు పొంది కలెక్టర్ కావడమే లక్ష్యమని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన రాచమల్లు నాగమానసరెడ్డి తెలిపింది. నాగమానస తండ్రి నాగ వెంకటప్రసాద్‌రెడ్డి చాపాడు మండలం అన్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి లక్ష్మిదేవి గృహిణి. వీరిది మైదుకూరు పట్టణం. నాగమానస మైదుకూరులోని ఓ ప్రైవేటు హైస్కూల్లో పదవ తరగతి చదివి 563 మార్కులను సాధించింది. -
సివిల్స్‌లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్‌కు.. సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్‌లోని మలక్‌పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్‌కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్‌కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్‌లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్‌లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్‌లోని ఆర్కేపురం. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్‌రెడ్డి సివిల్స్‌లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్‌రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్‌లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్‌లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్‌గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
నెంబర్ వన్‌గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు. టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి. వర్సిటీ కేటగిరీల్లో హెచ్సీయూకు 9వ ర్యాంకు యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి. కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే.. కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి. ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి. ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్: మేనేజ్మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి. వైద్య విద్య విభాగం వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి. దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి. -
అదరగొట్టారు..!
సాక్షి, హైదరాబాద్: వారంతా అభాగ్యులు.. ఆర్థికంగా, సా మాజికంగా ఏ ఆసరా లేని వా రే. కొందరు అనాథలైతే మరికొందరు ఏ చేయూత లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఇం కొందరైతే ఇళ్లు గడవక, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదు వు మానేసి ఆ తర్వాత మళ్లీ స్కూళ్లలో చేరిన వారు. పైగా అంతా బాలికలే.. ప్రభుత్వం, టీచర్లు, విద్యాశాఖ అధికారుల తోడ్పాటుతో రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయా (కేజీబీవీ)ల్లో చదువుకుంటున్న వా రు ఇంటరీ్మడియట్‌లో తమ సత్తాచాటారు. ఇ బ్బందులు, అసమానతలు తమ ప్రతిభకు అడ్డుకాదని నిరూపించారు. టీచర్ల పోత్సాహంతో మంచి మార్కులతో భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలుగా.. ఇంటరీ్మడియట్ వొకేషనల్‌లో 1,000 మార్కులకు 977 మార్కులను (98 శాతం) సాధించి మంచిర్యాల జిల్లా తాండూరు కేజీబీవీ విద్యారి్థని సీహెచ్ చంద్రకళ కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల విద్యార్థులతోనూ పోటీ పడి అత్యధిక మార్కులు సాధించింది. కరీంనగర్ జిల్లా గాంధార కేజీబీవీ విద్యార్థిని ఎం.శిరీష, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కేజీబీవీ విద్యార్థి ఇఖ్రా షహవర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేజీబీవీ విద్యారి్థని యు.అనూష 967 మార్కులు సాధించారు. వారే కాదు ఎంపీసీ, బైపీసీల్లోనూ 963 మార్కులతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేజీబీవీ విద్యారి్థని భూక్యా రజిత, 961 మార్కులతో గద్వాల కేజీబీవీ విద్యార్థి అంజలి, 957 మార్కులతో నల్లగొండ జిల్లా మునుగోడు కేజీబీవీ విద్యార్థి పి.అంకిత, సంగారెడ్డి జిల్లా ఆందోల్ కేజీబీవీ విద్యారి్థని ఎం.గంగ, 940 మార్కులతో నాగర్‌కర్నూల్ జిల్లా బాల్మూర్ కేజీబీవీ విద్యారి్థని చాపల శ్రీవాణి భేష్ అనిపించుకున్నారు. మట్టిలో మాణిక్యాలై వెలిగారు. ఇక ఈసారి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 88 కేజీబీవీ స్కూళ్ల నుంచి 4,483 మంది విద్యార్థినిలు హాజరుకాగా 3,531 మంది (78.76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 170 స్కూళ్ల నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలకు 8,580 మంది విద్యార్థులు హాజరు కాగా 6,103 మంది (71.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మంత్రి సబిత, చిత్రారామ్‌చంద్రన్అ భినందనలు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ ఉత్తీర్ణత 68.86 శాతం కంటే కేజీబీవీలు ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ అభినందనలు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలోనూ రాష్ట్ర యావరేజ్ 60.01 శాతం కాగా కేజీబీవీల్లో ఉత్తీర్ణత 71.13 శాతముందని, అందుకు కృషి చేసిన టీచర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఏడింటిలో 100% ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం, జనగామ జిల్లా పాలకుర్తి కేజీబీవీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ప్రథమ సంవత్సరంలో జనగామ జిల్లా పాలకుర్తి, భద్రాద్రి జిల్లా గుండాల, చర్ల, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో 61 కేజీబీవీలు, ప్రథమ సంవత్సరంలో 79 కేజీబీవీలు 90 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. పీవీ శ్రీహరి, కేజీబీవీల అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ -
ఉద్యోగ విప్లవం
కలా.. నిజమా! వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చీరాగానే సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేయడం.. ఉద్యోగ ప్రకటన చేయడం.. పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించడం.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగిన ఎంపికలో సామాన్యులెందరికో అర్హత లభించడం.. నిజంగా ఇది నిజమేనా! ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అభ్యర్థుల మనోభావమిది.. ఉన్న ఉద్యోగాలనే తొలగించిన పాత సర్కారుకు.. చెప్పిన దానికన్నా ఎక్కువ మేలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికీ తేడా వారికి స్పష్టంగా తెలుస్తోంది. సాక్షి, అరసవల్లి: గ్రామ/వార్డు సచివాలయాల పోస్టులకు గాను నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 7884 పోస్టులు ఉన్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించారు. మొత్తం 1,14,734 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,04326 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇదివరకెన్నడూ ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 94 వార్డు సచివాలయాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 19 విభాగాల్లో పారదర్శకంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో స్థానిక జిల్లావాసుల్లో అధిక శాతం మంది క్వాలీఫై మార్కులను పొందారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తమ స్థానాలను సొంతం చేసుకున్నారు. ‘టాప్’ లేపారు.. గ్రామ/వార్డు సచివాలయాల్లో నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది, ఇందులో భాగంగా పరీక్షల్లో ఓపెన్ కేటగిరిలో కనీస ఉత్తీర్ణత మార్కులుగా 40 శాతం మార్కులు, బీసీ సామాజిక వర్గాల అభ్యర్థులకు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు సాధించిన వారిని క్వాలీఫై అయినట్లుగా ఆన్లైన్లో జాబితాలను పెట్టారు. ఈమేరకు గురువారం విడుదలైన పరీక్షల ఫలితాల్లో చిక్కోలుకు చెందిన పలువురు యువతీయువకులు ఉత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు. రేపటి నుంచి వెరిఫికేషన్.. గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల పరీక్షల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈనెల 21 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈమేరకు తమ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ నిమిత్తం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాల్ లెటర్లను ఈనెల 21 నుంచి 22లోగా పంపిణీ చేయనున్నారు. అనంతరం ఎంక్వైరీ ప్రక్రియ ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 27న నియామక పత్రాలను ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందించనున్నారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో విధులపై అవగాహన అనంతరం అక్టోబర్ 2 నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి. -
‘తెలుగు’ వెలుగు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెం దిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాం కును సాధించగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఆలిండియా 5వ ర్యాంకును, ఏపీకే చెందిన ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకును సాధించాడు. అలాగే టాప్– 100లో 30 ర్యాంకులను, టాప్–500లో 132 ర్యాంకులను హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని విద్యార్థులు సాధించారు. టాప్–1000 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే దాదాపు 300 మంది వరకు ఉంటారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఆలిండియా టాపర్‌గా మహరాష్ట్రలోని బళ్లార్‌పూర్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372 మార్కులకుగాను 346 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. 2వ ర్యాంకును అలహాబాద్‌కు చెందిన హిమాన్షు గౌరవ్‌సింగ్ సాధించగా 3వ ర్యాంకును ఢిల్లీకి చెందిన అర్చిత్ బబ్నా సాధించారు. 308 మార్కులతో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే జోన్ పరిధి ప్రాంతానికి చెందిన షబ్నం సాహే బాలికల కేటగిరీలో టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో టాపర్లు వీరే.. టాప్ ర్యాంకుల సాధించిన విద్యార్థుల్లో ఐఐటీ జోన్లవారీగా ఐదేసి మంది వివరాలను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. అందులో హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో గిల్లెల ఆకాశ్‌రెడ్డి 4వ ర్యాంకు సాధించగా 5వ ర్యాంకును బట్టేపాటి కార్తికేయ సాధించారు. కౌస్థుబ్ డీఘే 7వ ర్యాంకు సాధించగా, ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, గుంపర్తి వెంకటకృష్ణ సూర్య లిఖిత్ 13వ ర్యాంకు సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో బాలుర కేటగిరీలో టాపర్‌గా నిలవగా జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించిన సూరపనేని సాయి విగ్న 44 బాలికల కేటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్లో టాపర్‌గా నిలిచారు. 38,705 మంది అర్హులు... ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 27వ తేదీ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసేందుకు 2.45 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా పరీక్ష రాసేందుకు 1,74,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,61,319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 38,705 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33,349 మంది బాలురు ఉండగా 5,336 మంది బాలికలు ఉన్నారు. ఇబ్బందులు పెట్టిన సాంకేతిక సమస్యలు... ఫలితాల వెబ్‌సైట్‌కు సంబంధించి తలెత్తిన సాంకేతిక సమస్యలతో విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయని విద్యార్థులు వేచిచూసినా వెబ్సైట్లో ఫలితాల లింకు అందుబాటులోకి వచ్చాక సమస్యలు తలెత్తడంతో ఫలితాలు మధ్యాహ్నం చూసుకోవాలని ఐఐటీ రూర్కీ తమ వెబ్సైట్లో మెసేజ్ పెట్టింది. ఆ తరువాత మళ్లీ సమస్యలు రావడంతో సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలు చూసుకోవాలని పేర్కొంది. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, తల్లిందండ్రులు ఊపరి పీల్చుకున్నారు. అర్హుల్లో రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్... జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఢిల్లీ ఐఐటీ జోన్ పరిధికి చెందినవారే ఉండగా రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన 38,705 మంది విద్యార్థుల్లో ఢిల్లీ జోన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన 9,477 మంది అర్హత సాధించగా ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలకు చెందిన 8,287 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో స్థానంలో ఐఐటీ బాంబే పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 6,140 మంది అర్హత సాధించారు. ఏఏటీకి దరఖాస్తులు... ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) రిజిస్ట్రేషన్లను ఐఐటీ రూర్కీ ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. టాపర్ల అభిప్రాయాలు.. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా... అమ్మానాన్నల ప్రోత్సాహంతో ప్రతిరోజూ కనీసం 12 గంటలు చదివా. నా కష్టానికి ప్రతిఫలంగా మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ చేసి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. – ఆకాశ్‌రెడ్డి, జేఈఈ అడ్వాన్స్డ్ 4వ ర్యాంకర్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తా. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా. లేదంటే ఉద్యోగం చేస్తా. – బట్టేపాటి కార్తికేయ, 5వ ర్యాంకర్ సివిల్ సర్వెంట్ కావాలని ఉంది సివిల్ సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తా. టాప్–10 లో ర్యాంకు వస్తుందనుకున్నా. అయినా మంచి ర్యాంకే వచ్చింది. ఐఐటీ బాంబేలో బీటెక్ చేస్తా. – సూర్య లిఖిత్, 13వ ర్యాంకర్ -
ప్చ్.. ఇక్కడ చేరలేం!!
♦ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై టాపర్ల అనాసక్తి ♦ పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు ♦ టాప్ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే ♦ మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం.. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం. 1000 మంది టాపర్లలో 253 మందే.. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట. మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా? ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆశతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు. -
ఐసిడబ్ల్యూఏలో సూపర్ విజ్‌కు ర్యాంకుల పంట