ప్చ్‌.. ఇక్కడ చేరలేం!! | Engineering College EAMCET Exam Top Ranks Certificate Verification | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఇక్కడ చేరలేం!!

Published Fri, Jun 16 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

ప్చ్‌.. ఇక్కడ చేరలేం!!

ప్చ్‌.. ఇక్కడ చేరలేం!!

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలపై టాపర్ల అనాసక్తి
పక్కరాష్ట్రాల్లోని కాలేజీలవైపే 75 శాతం మంది చూపు
టాప్‌ 1000లో వెరిఫికేషన్‌కు హాజరైంది 253 మందే
మౌలిక వసతులు, ఫ్యాకల్టీ లేమి ప్రధాన కారణం..


సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ పరీక్ష నిర్వహిస్తే దరఖాస్తు చేకునేవారు లక్షల్లో ఉంటున్నారు. పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడంలేదు. కానీ కాలేజీల్లో చేరే సమయానికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఇక టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులైతే పక్క రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన సర్టిఫికెట్‌ వెరిఫికేషనే ప్రత్యక్ష సాక్ష్యం.

1000 మంది టాపర్లలో 253 మందే..
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను ఇటీవలే మొదలుపెట్టారు. అయితే ప్రవేశ పరీక్ష టీఎస్‌ఎంసెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన 1000 మందిలో కేవలం 253 మంది మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అంటే దాదాపు 75 శాతం మంది రాష్ట్రంలోని కాలేజీల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారన్నమాట.

మిగతా 25 శాతం మంది.. అంటే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైన 253 మందిలో చాలామంది జేఈఈ అడ్వా న్స్‌డ్‌లో ర్యాంకులు సంపాదించినవారే ఉండడంతో వీరు కూడా చేరతారనే నమ్మకం లేదు. ఎందుకంటే ఐఐటీలో సీటు కంటే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ చదివేందుకు అంతగా ఆసక్తి చూపరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాప్‌ 1000 ర్యాంకులలోపు విద్యార్థులే కాదు 2 వేల ర్యాంకులోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్‌ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది.

కారణాలేంటి?: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కాలేజీ అంటూ ఓ బోర్డు తగిలించి, విద్యార్థులను చేర్చుకోవడం మినహా అందులో సాగుతున్న బోధన అంతంత మాత్రమేనని చెబుతున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని కేవలం 10 శాతం కాలేజీలు మాత్రమే అర్హత కలిగిన కాలేజీలని, మిగతా కాలేజీల్లో ఇంజనీరింగ్‌ విద్యకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక ఫ్యాకల్టీ విషయానికి వస్తే.. అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్న కాలేజీలు చాలా తక్కువ. బీటెక్‌ పూర్తిచేసిన వారితో క్లాసులు చెప్పించడం జరుగుతోంది.

ఫీజు రీయింబర్స్‌మెంటూ కారణమేనా?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మీద ఆశతో ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరుదామన్నా.. అది వస్తుందో? లేదో? కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము చెల్లించేదాకా కాలేజీలు సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ఆ ఫీజేదో మంచి కాలేజీల్లోనే చెల్లించి, మెరుగైన విద్యను నేర్చుకోవాలనే అభిప్రాయంతో ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలవైపు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement