మూతపడే స్థితిలో శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాల
జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు
సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ నియామకం
గతంలోనూ రెండు దఫాలు కమిటీలు చేసి సిఫారసుల బుట్టదాఖలు
ఈసారైనా ఆచరణలోకి తెచ్చి కాలేజీని కాపాడాలంటున్న విద్యావేత్తలు
అనంతపురం: వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి.. మంచిపేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కాలగర్భంలోకి కలిసి పోకుండా కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా 1997–98 విద్యా సంవత్సరంలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించారు.
మొదట ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్సెస్ కోర్సులకు అనుమతించారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత కొంతకాలానికి సివిల్ ఇంజినీరింగ్ కోర్సుకు కూడా అనుమతిచ్చారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కళాశాల నిర్వహించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.750 కోట్ల ఆస్తులు
రాష్ట్రంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏకైక ఇంజినీరింగ్ కళాశాల కావడం..బోధన బాగా ఉండటం.. మంచి ఫలితాలు వస్తుండడంతో అనతి కాలంలోనే స్కిట్‌కు మంచి ఖ్యాతి వచ్చింది. ప్రధాన బ్రాంచ్‌ల్లో అదనపు సీట్లు పెంపుదల చేశారు. దీనికి తోడు డిప్లొమో కోర్సులూ నిర్వహించారు.
ఆదాయ పెంపుదల ప్రధానం కాకుండా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ప్రధాన ఆశయంతో ఈ కళాశాల అప్పట్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాల ఆస్తుల విలువ రూ.750 కోట్లు ఉంటాయని అంచనా. విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులతోనే కళాశాల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా నియమ నిబంధనలు రూపొందించారు.
ముక్కంటి ఆలయం వారు తొలి కామన్ డిపాజిట్ కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కళాశాల నుంచి వచ్చే ఆదాయమే జీతాలకు, అభివృద్ధి పనులకు సరిపోయేది. 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కళాశాల నిర్వహించారు.
ఇప్పటికే రెండు దఫాలు కమిటీ ఏర్పాటు
స్కిట్‌ను జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దఫాలు కమిటీలను నియామకం చేసి, సిఫారసులను బుట్టదాఖలు చేశారు. మరో దఫా కమిటీని నియమించారు. ఈసారైనా ఆచరణ సాధ్యమయ్యేనా? లేక మొక్కుబడిగా కమిటీ వేసి కాలయాపన చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
పూర్తిగా జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోకి తెచ్చి.. గతంలో మాదిరి విద్యార్థుల ఫీజులతోనే కళాశాలను నిర్వహించాలని, స్కిట్‌లో పనిచేసే ఫ్యాకల్టీని అక్కడికే పరిమితం చేసి జీతాలు చెల్లించాలని, ఉద్యోగులను వర్సిటీ పరిధిలోకి తెస్తే సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు అంటున్నారు.
2013 నుంచి తగ్గుముఖం
విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం, కళాశాలలో వర్గ రాజకీయాలు అధికం కావడం, రాజకీయ జోక్యం మితిమీరడం వంటి కారణాలతో కళాశాల పతన దిశగా పయనించడం ప్రారంభం అయింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2016 నవంబర్ నాటికి అక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రతి నెలా రూ.25 లక్షల వంతున ముక్కంటి దేవాలయం వారు చెల్లిస్తున్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాలకు ఇప్పటి దాకా దేవాలయం వారు రూ.14 కోట్లు చెల్లించారు. ఈ భారం అధికం కావడంతో రాష్ట్ర దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థితిగతులను అధ్యయనం చేశారు.
2019–20 సంవత్సరంలో పూర్తిగా అడ్మిషన్లు లేవు. అంతకు ముందు సంవత్సరాల్లో చేరిన విద్యార్థులు బీటెక్‌లో 15 మంది, డిప్లొమోలో 12 మంది ఉన్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు కోర్సులు ముగిసి బయటకు వెళ్లిపోతారని, కళాశాలను మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 29 మంది బోధన, 36 మంది బోధనేతర ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment