గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో వికృత చేష్టలపై సందేహాలెన్నో
యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టం
విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా ఏదీ?
యాజమాన్యం, సర్కారు దొంగాటపై మేధావుల మండిపాటు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది.
ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?
విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్‌ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్‌లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?
ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్‌ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్‌ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాప్టర్‌లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
హోం మంత్రి ఎక్కడ?
ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్‌సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment