Telugu Students Topped All India Civil Services - Sakshi
Sakshi News home page

UPSC Civils Results 2020 సివిల్స్‌లో తెలుగువారి సత్తా

Published Sat, Sep 25 2021 2:36 AM | Last Updated on Sat, Sep 25 2021 1:00 PM

Telugu Students Top Ranks In All India Civil Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: ఆలిండి యా సివిల్‌ సర్వీసెస్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్‌–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్‌ సర్వీసెస్‌–2020 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది.

డాక్టర్‌ నుంచి సివిల్స్‌కు.. 
సివిల్స్‌లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్‌. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ సమీపంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్‌ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్‌ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్‌కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది.

‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. 

రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. 
సివిల్స్‌ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్‌లోని మలక్‌పేట. ఐఏఎస్‌ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్‌ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది.       

ఐపీఎస్‌కు ఎంపికవుతా.. 
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్‌కుమార్‌. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్‌.. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు.

కిరణ్‌ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్‌లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్‌.. ఐపీఎస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఎంతో సంతోషంగా ఉంది 
సివిల్స్‌లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్‌ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్‌ ముంబై ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన అభిషేక్‌.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు సాధించాడు. 

మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. 
66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్‌లోని ఆర్కేపురం. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 
317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్‌ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. 
248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్‌ నివాసం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 

విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని 
విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్‌రెడ్డి సివిల్స్‌లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్‌రెడ్డి చెప్పాడు.

‘‘ఐఏఎస్‌ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్‌ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్‌ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. 

మొదటిసారే సాధించా.. 
హైదరాబాద్‌లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్‌లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి.

ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్‌ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్‌ఎస్‌ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. 

మూడో ప్రయత్నంలో.. 
ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్‌ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగి.

ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ప్రశాంత్‌ తన మూడో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్‌ పేర్కొన్నాడు.

ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు 
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్‌గౌడ్‌. కొత్తకోటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్‌.. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు.

తాజాగా సివిల్స్‌ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్‌ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్‌ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement