జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘వాట్సాప్‌ కాపీయింగ్‌’ | Mass Copying In JEE Advanced Telangana | Sakshi
Sakshi News home page

పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం.. మొన్న టీఎస్‌పీఎస్సీ, నిన్న టెన్త్‌ క్లాస్‌, నేడు జేఈఈ అడ్వాన్స్‌..

Published Wed, Jun 7 2023 5:15 AM | Last Updated on Wed, Jun 7 2023 8:52 AM

Mass Copying In JEE Advanced Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొన్న టీఎస్‌పీఎస్సీ.. నిన్న పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్‌ల కలకలం పూర్తిగా మరువక ముందే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌లో మైనర్‌ విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం జరిగిన ఈ పరీక్షలో ఒక మైనర్‌ విద్యార్థి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడగా, అతని సహకారంతో నలుగురు వాట్సాప్‌ ద్వారా మాస్‌ కాపీయింగ్‌ చేస్తూ దొరికిపోయారు.

మొత్తం ఐదు స్మార్ట్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోగా వీరిపై హైదరాబాద్, రాచకొండల్లోని నాలుగు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్‌ సంస్థ వ్యవహారాన్నీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పరీక్ష హాళ్లలోకి స్మార్ట్‌ఫోన్లు రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సోదరుడు, స్నేహితుల కోసం.. 
కడపకు చెందిన టీచర్‌ కుమారుడైన ఓ విద్యార్థికి పదో తరగతి పరీక్షల్లో 600కు 600 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 1000కి 940 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లోనూ 94 శాతం మార్కులు సాధించాడు. హైటె క్‌ సిటీ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్‌ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న ఇతడికి ఒక సోదరుడితో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ఐదుగురూ ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు.

కడప విద్యార్థికి సికింద్రాబాద్‌ ప్యాట్నీ సమీపంలో ఉన్న ఎస్‌వీఐటీ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండగా, అతని సోదరుడికి మౌలాలిలో, ఇద్దరు స్నేహితులకు (వీరిద్దరూ సోదరులు) మల్లాపూర్‌లో, మరొకరికి ఎల్బీనగర్‌లోని కళాశాలల్లో సెంటర్లు పడ్డాయి. అయితే తన సోదరుడితో పాటు స్నేహితులకు కూడా మంచి మార్కులు రప్పించాలని భావించిన కడప విద్యార్థి ఐదుగురితో ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశాడు. కళాశాలల్లో తనిఖీ చేసే సిబ్బంది కళ్లుగప్పిన ఈ ఐదుగురూ పరీక్ష కేంద్రాల్లోకి తమ స్మార్ట్‌ఫోన్లు తీసుకువెళ్లారు.  

కంప్యూటర్‌ స్క్రీన్‌ ఫొటోలు తీసి.. 
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్‌లో ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న ప్రత్యక్షమవుతూ ఉంటే.. విద్యార్థులు జవాబులు టిక్‌ చేస్తూ పోతుంటారు. కడప విద్యార్థి కంప్యూటర్‌ స్క్రీన్‌పై తాను టిక్‌ చేసిన ప్రతి జవాబును ప్రశ్నతో సహా కనిపించేలా స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు తీసి, వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేయడం ద్వారా మిగిలిన నలుగురికీ చేరేలా చేశాడు.

ఎస్‌వీఐటీ కాలేజీలో పరీక్ష హాలు పెద్దదిగా ఉండటం, ఇన్విజిలేటర్‌ విధుల్లో ఉన్న సిబ్బంది ఒకేచోట కూర్చుండిపోవడంతో దాదాపు గంటన్నర పాటు ఈ తతంగాన్ని ఎవరూ గుర్తించలేదు. 10.30 గంటల సమయంలో మల్లాపూర్‌ కేంద్రంలో ఇన్విజిలేటర్‌ అక్కడి విద్యార్థి వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉండటాన్ని గమనించారు. అందులో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో కంప్యూటర్‌ స్క్రీన్‌ ఫొటోలను చూసిన ఆయన సదరు విద్యార్థిని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.

ఎస్‌వీఐటీ కాలేజీ పరీక్ష కేంద్రంలోని కడప విద్యార్థి నుంచి ఈ ఫొటోలు వస్తున్నట్లు తెలుసుకుని ఆ సెంటర్‌ అధికారికి సమాచారం ఇచ్చారు. ఆయన పరీక్ష కేంద్రంలోకి వెళ్లి కడప విద్యార్థిని తనిఖీ చేయగా అతడి వద్ద స్మార్ట్‌ఫోన్‌ లభించింది. ఇదే క్రమంలో మౌలాలి, ఎల్బీనగర్‌ల్లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మరో ముగ్గురినీ పట్టుకున్నారు.

వాట్సాప్‌ ద్వారా హైటెక్‌ మాల్‌ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు పాల్పడిన ఈ ఐదుగురూ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ తరఫున జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఐఓఎన్‌ సంస్థకు క్షమాపణ పత్రాలు రాసి ఇచ్చారు. సంస్థ సిబ్బంది ఆదివారం రాత్రి మార్కెట్, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, నాచారం పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. 

నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం? 
విద్యార్థులపై పోలీసులు ఐపీసీలోని 188 (ప్రభుత్వం నిషేధించిన వస్తువులు పరీక్ష హాలులోకి తీసుకుపోవడం), 420 (మోసం)తో పాటు తెలంగాణ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీసెస్‌) యాక్ట్‌లోని 4 (బీ), 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదుగురి ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు.

ఈ పరీక్ష నిర్వహిస్తున్న ప్రైవేట్‌ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే సరైన తనిఖీలు లేక స్మార్ట్‌ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాయని అధికారులు చెప్తున్నారు. నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న తనిఖీ సిబ్బంది, ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లకూ నోటీసులు ఇచ్చి విచారించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement