జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వెనుకంజ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన వారిలోనూ ఏటా 30 శాతం మంది ఈ పరీక్షలు రాయడం లేదు. ఏటా జేఈఈ మెయిన్ రాసే దాదాపు 12 లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు టాప్ 1.50 లక్షల మందిని ఎంపిక చేస్తే అందులోనూ 30 శాతం మంది పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైనా పడుతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఎంపిక చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండగా, అర్హత సాధిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది.
మరోవైపు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు ఎంపిక చేసిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం మంది పరీక్షకు హాజరు కాకపోవడం ఐఐటీల్లో సీట్లు మిగిలిపోవడానికి ఓ కారణం అవుతోంది. 2015 జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఎంపిక చేయగా పరీక్షకు 1,17,238 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 32,742 మంది విద్యార్థులు పరీక్షకే హాజరు కాలేదు. ఇందులో 25,259 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకోకుండా పరీక్ష రాయకపోగా, మరో 7,503 మంది రిజిస్టర్ చేసుకున్నా పరీక్ష రాయలేదు. ఇదీ గత ఏడాదే కాదు గడిచిన మూడునాలుగేళ్లుగా ఇదే తంతు.
ఇలా 2013లో 24 వేల మంది, 2014 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. ఇటీవల ఐఐటీలు గత మూడు నాలుగేళ్లలో పరీక్షలు, వాటికి హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, చేరుతున్న వారి సంఖ్యను బయటకు తీశాయి. ఇలా పరీక్షకు గైర్హాజరవుతున్న తీరు కూడా ఐఐటీల్లో ప్రవేశాలపై ప్రభావం చూపుతోందన్న ఓ అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే వారి సంఖ్యను 2016లో 2 లక్షలకు పెంచాలని నిర్ణయించాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఎంపిక చేయనున్నాయి. ఏప్రిల్ 3న జరిగే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనున్నాయి.