* ఒకరోజు ముందుగానే విడుదల చేసిన సీబీఎస్‌ఈ
* అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. ఈనెల 3వ తేదీన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్న సీబీఎస్‌ఈ.. ఒక రోజు ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో కొందరు 360 గరిష్ట మార్కులకు గాను అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించినట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
రాష్ట్రంలోని హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,22,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,07,046 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అలాగే ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించారు.
జేఈఈ మెయిన్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 60 శాతంగా పరిగణనలోకి తీసుకొని వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు నిర్వహించే ఇంటర్మీడియట్ మార్కుల్లో 40 పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులను సీబీఎస్‌ఈ విడుదల చేయనుంది. ఈ జాతీయ స్థాయి ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది. వాటి ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేయనుంది.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
Published Sat, May 3 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement
Advertisement