సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షలను ఆదివారం (8వ తేదీన) నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏరాట్లు పూర్తి చేసింది. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం పేపర్–1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి.. బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా.. తెలంగాణ నుంచి 74,580 మంది పరీక్ష రాయనున్నారు. వీరికోసం రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలలో 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 15, 16వ తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుండగా.. వాటికి రాష్ట్రం నుంచి మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాతపరీక్ష జరిగే మూడు నగరాలతోపాటు కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి.
అత్యధికంగా హైదరాబాద్ నుంచే..
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులను ఎంపిక చేసేందుకు సీబీఎస్‌ఈ జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తోంది. దీనికి ఏటా రాష్ట్రం నుంచి 70 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతుండగా.. హైదరాబాద్ నుంచే అత్యధికంగా పరీక్ష రాస్తున్నారు. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 88 పరీక్షా కేంద్రాల్లో 58,500 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఖమ్మంలోని 10 కేంద్రాల్లో 5,280 మంది, వరంగల్‌లోని 17 కేంద్రాల్లో 10,800 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
పెన్నులూ పరీక్షా హాల్లోనే ఇస్తారు..
జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నులను కూడా పరీక్ష హాల్లోనే అందజేస్తామని తెలిపింది. విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఉదయం 9:30కు జరిగే పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే.. మధ్యాహ్నం 2కు ప్రారంభమయ్యే పరీక్షకు 12:45 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
రేపే జేఈఈ మెయిన్
Published Sat, Apr 7 2018 3:55 AM | Last Updated on Sat, Apr 7 2018 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment