JEE Main exam
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ–మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా రెండు లక్షల మంది హాజరుకానున్నారు. తెలంగాణలో 10 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. అన్నిచోట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22, 23, 24 తేదీలతోపాటు 28, 29 తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్ తీసుకొని రావడానికి వీల్లేదని ఎన్టీఏ చెప్పింది. -
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
-
నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్టీఏ సూచించింది. -
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్‌కు 9.4లక్షల మంది
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. www.nta.ac.in లేదా https://jeemain.nta.nic.in/వెబ్సైట్ల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని పేర్కొంది. దేశంలో 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 పట్టణాల్లో ఈ పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 6వ తేదీనుంచి 15వ తేదీవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ పరీక్షల షెడ్యూల్లో 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహిస్తామని పేర్కొన్నా.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు అడ్మిట్‌కార్డుల్లో పొందుపరిచింది. ప్రస్తుతం తొలిరోజు పరీక్ష రాసేవారి అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షరాసే వారి అడ్మిట్‌కార్డులను వరుసగా ముందు రోజుల్లో ఇవే వెబ్సైట్లలో ఉంచనుంది. పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబరు నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డు కాపీలతో పాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలని సూచించింది. తొలి సెషన్ కన్నా ఎక్కువమంది అభ్యర్థులు జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్టీఏ అడ్మిట్‌కార్డుల నోట్లో తెలిపింది. తొలి సెషన్లో 8.6 లక్షల మంది హాజరుకాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొంది. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో ఈ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసినవారు కూడా రెండో సెషన్లో పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు జేఈఈ పరీక్షకు వెసులుబాటు కలిగింది. తొలిసెషన్ పరీక్షకు 8,60,064 మంది పేపర్–1కు, 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది, పేపర్–2కి 95 శాతానికిపైగా హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు సంబందించిన తుది ర్యాంకులతో ఫలితాలు ఈనెలాఖరునాటికి విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నందున అంతకు ముందే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశమిస్తారు. కటాఫ్ 87 నుంచి 90 మార్కుల వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీలో 87 నుంచి 90 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది జనరల్ కటాఫ్ మార్కులు 88. గత అయిదేళ్ల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కటాఫ్ ఇంచుమించు 90 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో 25 సెంటర్లు ఇవే.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, అమరావతి, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
జేఈఈ మెయిన్ తొలివిడత సాధ్యమేనా?
సాక్షి,అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు బాంబే హైకోర్టులో పరీక్ష వాయిదాను కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీపీసీఆర్ పరీక్షల షెడ్యూల్ మార్పు అంశాన్ని పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జేఈఈ మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే.. జేఈఈ మెయిన్–2023ని రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డిసెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి సెషన్ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే జనవరిలో సీబీఎస్ఈ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ బోర్డుల ప్రీ ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. దీనివల్ల జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని తాము కోల్పోవలసి వస్తుందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2021, 2022లో జేఈఈ మెయిన్‌లో విజయం సాధించినా అవకాశం అందుకోలేక డ్రాపర్లుగా మిగిలిపోయిన అభ్యర్థులు కూడా పరీక్ష సన్నద్ధతకు తమకు సమయం లేకుండా పోతోందని అంటున్నారు. దీనివల్ల తాము మళ్లీ నష్టపోతామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా జేఈఈ మెయిన్‌కు ఎన్టీఏ పేర్కొన్న అర్హతల్లోనూ కొన్ని సడలింపులు ఇవ్వాలని కొందరు తొలి నుంచి కోరుతున్నారు. ఈ అర్హతలపైన కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్లో 75 శాతం ఉత్తీర్ణత నిబంధనపైనా.. ఇంకోవైపు జేఈఈ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్టీఏ గత మూడేళ్లుగా రద్దు చేసింది. కోవిడ్ కారణంగా తరగతులు, పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్‌గా నడుస్తుండటంతో ఈసారి మళ్లీ 75 శాతం మార్కుల నిబంధనను పునరుద్ధరించింది. జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు ఎన్ఐటీలు, ఐఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించినా.. ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఎన్టీఏ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. -
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్–2023 పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. వీటిని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30, మే 10వ తేదీలలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఆదివారాలతో కలుపుకొని ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ ఇదే షెడ్యూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం: ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనిలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఏప్రిల్‌లో ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సాధారణంగా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేసేవారు. ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ప్రాక్టికల్స్‌ను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా కేటాయించింది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించడంతోపాటు 13, 15 తేదీలను రిజర్వులో ఉంచింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఇంటర్మీడియెట్‌బోర్డు ఈసారి ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది. -
JEE Main Exam: జేఈఈ మెయిన్.. ఇక రెండుసార్లే
సాక్షి, అమరావతి: ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించనుంది. గతంలో కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహించిన ఎన్టీఏను ఏటా అలాగే అవకాశం కల్పించాలని విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూళ్లను వచ్చే వారం విడుదల చేయనుంది. బోర్డుల పరీక్షలతో సమస్య రాకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలతో కూడా ఎన్టీఏ సంప్రదిస్తోంది. బోర్డు పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో కాకుండా వేర్వేరుగా కొంత వ్యవధిలో నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వేళలో నాలుగుసార్లు నిర్వహణ గతంలో జేఈఈ మెయిన్‌ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా 2019 నుంచి రెండుసార్లకు పెంచారు. ఒకే దఫా కారణంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని భావించి ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో 2021లో మెయిన్‌ను నాలుగు దఫాలుగా నిర్వహించారు. విద్యార్థులు ఈ నాలుగు దఫాల్లో దేనిలోనైనా పాల్గొని జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశమిచ్చారు. 2022లో కూడా రెండుసార్లే నిర్వహించినా అవి చాలా ఆలస్యం కావడం, బోర్డు పరీక్షల సమయంలో వాటిని నిర్వహించేలా ముందు షెడ్యూళ్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. పైగా.. కరోనా అనంతరం రెగ్యులర్ తరగతులు ఆ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమైనందున తాము మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. అయితే, జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలు జూన్, జూలైకు వాయిదా పడడం, ఫలితాల విడుదల కూడా చాలా జాప్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో.. విద్యాసంవత్సరం నష్టపోకుండా కొనసాగాలంటే ఇకపై జనవరి, ఏప్రిల్ మాసాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్లేలా ప్రవేశ పరీక్షలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎన్టీఏ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంటర్మీడియెట్ బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూళ్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోందని వివిధ కోచింగ్ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు. ఏటా 10 లక్షలకు పైగా అభ్యర్థులు.. మరోవైపు.. జేఈఈ పరీక్షలకు ఏటా పది లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ అవుతున్నారు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించి మెరిట్లో ఉన్న టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2019లో అత్యధికంగా 12.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు రిజిస్టరయ్యారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
మెయిన్స్ షెడ్యూల్‌పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో నిర్వహించేవారు. జనవరి సెషన్‌కు సంబంధించి నవంబర్‌కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్‌ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్‌ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్‌ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ల నేపథ్యంలో.. ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
JEE Mains 2022 Answer Key: జేఈఈ ప్రాథమిక కీ తారుమారు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2022 తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. సెషన్ల వారీగా ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాధానాల కీలను తన వెబ్సైట్లో పొందుపరచింది. వీటితో తమ సమాధానాలను పరిశీలించుకున్న విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెషన్లకు సంబంధించిన ప్రాథమిక కీలు తారుమారు కావడమే ఇందుకు కారణం. జేఈఈ మెయిన్స్ తొలిసెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి దేశవ్యాప్తంగా 9లక్షల మంది వరకు హాజరయ్యారు. ఇక ఈ ప్రాథమిక కీలలో జూన్ 29న జరిగిన రెండు సెషన్లకు సంబంధించిన ప్రశ్నల సమాధానాలు తారుమారయ్యాయి. మేథమెటిక్స్, ఫిజిక్స్ ప్రశ్నల కీ సరిగ్గా ఉండగా కెమిస్ట్రీ సమాధానాలు తారుమారయ్యాయి. ఉదయం పరీక్షకు సంబంధించిన కీని మధ్యాహ్నం సెషన్ ప్రశ్నలకు, మధ్యాహ్నం ప్రశ్నల కీని ఉదయం సెషన్ ప్రశ్నలకు ఎన్టీఏ ప్రకటించడంవల్లే వారు గందరగోళానికి గురయ్యారు. ఈ రెండు సెషన్లలో పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థుల మార్కులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో అనుకున్న విధంగా మార్కులు వచ్చినా కెమిస్ట్రీలో పూర్తిగా మైనస్ మార్కులుండటంతో వారు కంగుతిన్నారు. తాము రాసిన అనేక ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నట్లు కనిపించడంతో నిరాశలో మునిగిపోయారు. పైగా ప్రతి తప్పుడు సమాధానానికి మూడోవంతు మార్కులు మైనస్ అయ్యే నిబంధన ఉండడంతో వారికి వచ్చిన మార్కులు మైనస్‌లో పడ్డాయి. తాము సరైన సమాధానాలు రాసినా ఇలాఎలా అయ్యిందో అర్థంకాక విద్యార్థులు తమ అధ్యాపకులకు పరిస్థితిని చెప్పుకున్నారు. పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా తమ విద్యార్థుల పరిస్థితి చూసి అవాక్కయ్యారు. దీంతో ఆయా సంస్థలు విద్యార్థుల వారీగా వారి లాగిన్ నుంచి ఎన్టీయేకు అభ్యంతరాలు తెలియచేశాయి. చివరకు ఆదివారం సాయంత్రానికి కీలను సరిచేస్తూ ఎన్టీఏ కొత్త కీలను వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. తొలిసెషన్ తుది కీని ఈనెల 5న విడుదలచేసే అవకాశముంది. గత ఏడాది మాదిరిగానే కటాఫ్ మరోవైపు.. జేఈఈ మెయిన్స్‌తొలిసెషన్ పరీక్షల్లోని ప్రశ్నల తీరును పరిశీలించిన నిపుణులు ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులు 2021లో మాదిరిగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెలలో రెండో సెషన్ పరీక్షలు పూర్తయిన అనంతరం కటాఫ్ మార్కులు, ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించనుంది. ఇక తొలిసెషన్ తీరును పరిశీలించిన ఆయా కోచింగ్ సెంటర్ల నిపుణులు.. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అనుసరించి తర్ఫీదు పొందిన వారికి అధిక మార్కులు వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఈసారి ప్రశ్నలు, వాటి సమాధానాల తీరు విద్యార్థులను తీవ్ర గందరగోళపరిచే విధంగా ఉన్నాయని వివరించారు. చాలా ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు సమాధానాలు ఇంచుమించు ఒకేమాదిరిగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్‌ను బాగా అవగాహన చేసుకుని ఎక్కువ ప్రాక్టీసు చేసిన వారు సులభంగా సమాధానాలను గుర్తించగలిగారని వారు తెలిపారు. కానీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను, ఎంసెట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తర్ఫీదు పొందిన వారికి మాత్రం మెయిన్స్ పరీక్షలు చాలా కష్టమనిపించాయని ప్రముఖ విద్యాసంస్థ అకడమిక్ హెడ్ మురళీరావు పేర్కొన్నారు. -
జేఈఈ మెయిన్ కటాఫ్‌పై కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా కరోనా కారణంగా తలెత్తిన దుష్ప్రభావాలు ఈ ఏడాది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ ఫలితాలపై పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి విద్యాసంస్థలు ఆలస్యంగా తెరుచుకోవడం, రెండేళ్ల నుంచి సరిగా తరగతులు లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. ఇదే పరిస్థితి జేఈఈ మెయిన్ వంటి ఇతర పోటీ పరీక్షలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్ల జేఈఈ మెయిన్ కటాఫ్‌లతో పోల్చుకుంటే ఈసారి కటాఫ్ తగ్గడం లేదా వాటితో సమానంగా ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. పైగా ఇంటర్మీడియెట్‌లో సిలబస్‌ను కుదించి విద్యార్థులకు బోధించారు. జేఈఈకి మాత్రం గతంలోని సిలబస్‌నే యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌లో కుదించిన చాప్టర్ల నుంచి జేఈఈ మెయిన్‌లో ప్రశ్నలు అడిగితే చాలా మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. ముఖ్యంగా కోచింగ్ సదుపాయాలు లేని గ్రామీణ విద్యార్థులు ఈసారి నష్టపోయే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. 2021లో జనరల్ కటాఫ్ పర్సంటైల్ 87.89 జేఈఈ మెయిన్–2021లో 11,44,248 మంది దరఖాస్తు చేయగా 9,39,008 మంది పరీక్షకు హాజరయ్యారు. అప్పట్లో నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. కటాఫ్ స్కోరులు జనరల్ 87.89, ఈడబ్ల్యూఎస్ 66.22, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 68.023, ఎస్సీ 46.88, ఎస్టీ 34.67, దివ్యాంగుల కోటాలో 0.00963గా నమోదయ్యాయి. 2019, 2020 జేఈఈ మెయిన్ కటాఫ్‌లతో పోల్చుకుంటే 2021 కటాఫ్ స్కోరులో తగ్గుదల కనిపించింది. 2019లో జనరల్ కటాఫ్ 89.75 ఉండగా 2020లో 90.37గా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా అనంతరం జరుగుతున్న ఈ పరీక్షల్లో కటాఫ్ 2021 కంటే తగ్గడం, లేదా సమానంగా ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2016కి ముందు కటాఫ్ స్కోర్లు 100పైనే.. జేఈఈ మెయిన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2016 కంటే ముందు మెయిన్‌లో జనరల్ కటాఫ్ స్కోర్ 100కు మించి ఉండడం గమనార్హం. ఆ తర్వాత సంవత్సరాల్లో ఇది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో అత్యల్పంగా జనరల్ కటాఫ్ పర్సంటైల్ 74గా ఉంది. జేఈఈకి ఎంతమంది హాజరైనా వారు బాగా రాయడంపైనే కటాఫ్ స్కోర్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్‌లో నిర్దేశిత కటాఫ్ స్కోర్లు సాధించిన టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ రెండున్నర లక్షల మందిని ఆయా రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 27 శాతం ఉంటారు. తక్కినవారంతా జనరల్ కేటగిరీలోకి వస్తారు. ఈ కేటగిరీల్లో దివ్యాంగులు (పీడబ్ల్యూడీ) 5 శాతం మంది ఉంటారు. అలాగే సూపర్ న్యూమరరీ కోటా కింద జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. ఇలా మొత్తంగా 2.50 లక్షల మందిని ఆయా కేటగిరీల్లో ఎంపిక చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. త్వరలో అడ్మిట్ కార్డులు జేఈఈ మెయిన్‌ను ఈసారి రెండు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 29 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. మలి విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వర కు జరుగుతాయి. తొలి విడత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఒకటి, రెండురోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్లో పొందు పరిచింది. అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలు పొందొచ్చని స్పష్టం చేసింది. -
విద్యార్థులకు ‘మెయిన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్షల వాయిదాతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తిచేసి తరగతులు చేపడతామని ఆయనన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో విడుదల చేసిన షెడ్యూళ్ల ప్రకారం జేఈఈ మెయిన్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలోని సెట్లన్నీ పూర్తయి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనావేశారు. కానీ, జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ ఎన్టీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. మెయిన్ తొలిసెషన్ జూన్ 20 నుంచి 29 వరకు.. రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్సు కూడా వాయిదాపడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం ఆరు విడతల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లోకి జరిగే అడ్మిషన్లను పూర్తిచేయడానికి నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలంటే అక్టోబర్ వరకు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్టీఏ తీరుతో ఈసారీ నష్టమే జేఈఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తీరు కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు నష్టపోవలసి వస్తోందని అధ్యాపకులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఒకపక్క జాతీయస్థాయి అడ్మిషన్లు లేటు కావడంతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం కావడంవల్ల దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరిపోతున్నారని వివిధ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా అడ్మిషన్లు చేపడితే వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే చేరుతారని వారు తొలినుంచి కోరుతున్నారు. కానీ, జేఈఈ అడ్మిషన్ల ఆలస్యంతో గత ఏడాది రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశాలనూ ఆలస్యంగా చేపట్టారు. ఇక జేఈఈలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. జేఈఈ అడ్మిషన్ల కన్నా ముందే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందే ఆ విద్యార్థులు ఆ తరువాత జేఈఈ అడ్మిషన్లలో అవకాశం వస్తే ఇక్కడి సీట్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా 15వేల మంది వరకు జేఈఈ సీట్లలో చేరుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెరిట్లో ఉన్న ఇతర విద్యార్థులకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేఈఈ అడ్మిషన్ల తరువాత రాష్ట్ర ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతూ వస్తున్నారు. జేఈఈ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నందున అప్పటివరకు రాష్ట్రంలోని కాలేజీల్లో చేరుదామని చూసే విద్యార్థులు కౌన్సెలింగ్ జాప్యం అయితే ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లోకి వెళ్లిపోతున్నారు. -
జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్‌లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ పైనా ప్రభావం జేఈఈ మెయిన్ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్డ్ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్‌లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్‌కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్‌కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్‌తో ఆఫ్‌లైన్ మోడ్‌లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్‌లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్‌లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్‌తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి జేఈఈ 4వ విడత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్టీఏ ప్రకటించనుంది. -
కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష మొదటి సెషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. జూలై 25 ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి సెషన్ 12 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక మొదటి, రెండో సెషన్ అభ్యర్థులు గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ మూడో విడత (జూలై సెషన్) పరీక్షలు ఈ నెల(జూలై) 27 వరకు కొనసాగనున్నాయి. -
జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి విడత, మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండో విడత పరీ క్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు ఫిబ్రవరిలో 6,20,978 మంది, మార్చిలో 5,56,248 మంది హాజరయ్యారు. ఇక ఈనెల 27, 28, 30 తేదీల్లో మూడో విడత, మే నెలలో నాలుగో విడత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈనెల పరీక్షలను వాయిదా వేస్తు న్నట్లు వెల్లడించింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనేది తరువాత నిర్ణయిస్తామని, పరీక్షకు 15 రోజుల ముందుగా తెలియజేస్తా మని వెల్లడించింది. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2021 మార్చి సెషన్ ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీటీ) నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం, ప్రాథమిక ‘కీ’, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వివరించింది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్ రుసుము. అభ్యర్థులు తమ రుసుమును డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, పేటీఎంల ద్వారా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
జేఈఈ: తెలంగాణ విద్యార్థులే టాప్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్‌ను 24 మంది విద్యార్థులు సాధించగా, అందులో 8 మంది రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులే ఉండటం విశేషం. అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మందికి పైగా..: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు జేఈఈ మెయిన్‌లో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మందినే పరిగణనలోకి తీసుకునేలా జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. మరోవైపు శనివారం (12వ తేదీ) మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఈనెల 21న ఉదయం 10 గంటల నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనుంది. 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాటి ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటించనున్నారు. కేటగిరీల వారీగా అడ్వాన్స్‌డ్‌కు అర్హులు వీరే: ఓపెన్ కేటగిరీలో 1,01,250, జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో 25 వేలు, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 67,500, ఎస్సీ 37,500, ఎస్టీ 18,750. 100 పర్సంటైల్ సాధించిన రాష్ట్ర విద్యార్థులు హాల్‌టికెట్ నంబర్ విద్యార్థి పేరు 200310386279 చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి 200310437355 చుక్కా తనూజ 200310566235 దీటి యశష్‌చంద్ర 200310574091 మొర్రడ్డిగారి లిఖిత్‌రెడ్డి 200310585775 రాచపల్లె శశాంక్ అనిరుధ్ 200310594754 రోంగల అరుణ్ సిద్ధార్థ 200310504229 శివకృష్ణ సాగి 200310226303 వాడపల్లి అర్వింద్ నరసింహ ఏపీ విద్యార్థులు.. 200310065452 లాండ జితేంద్ర 200310404791 తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ 200310145653 వైఎస్ఎస్ నర్సింహ నాయుడు కటాఫ్ మార్కులివే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే టాప్ 2.5 లక్షల మంది విద్యార్థుల ఎంపికకు జనరల్ కేటగిరీలో 90.37 ఎన్టీఏ స్కోర్‌ను కటాఫ్ మార్కులుగా నిర్ణయించింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 70.24 స్కోర్‌ను, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 72.88 స్కోర్‌ను, ఎస్సీలలో 50.17 స్కోర్‌ను, ఎస్టీలలో 39.06 స్కోర్‌ను, వికలాంగులలో 0.06 స్కోర్‌ను కటాఫ్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంది. ఆ స్కోర్, అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినవారే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. -
జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
-
జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్‌లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్‌లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్‌ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్‌ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
సాక్షి మాక్ టెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రముఖ ఇంజనీరింగ్/మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించాలని కోరుకుంటారు. అందుకు కోచింగ్ ఫీజుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. విద్యార్థులు సైతం తమ లక్ష్యం, తల్లిదండ్రుల ఆశయం నెరవేరేలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలైన ఐఐటీలు, నిట్‌లలో ప్రవేశానికి మార్గం వేసే జేఈఈ మెయిన్, తెలుగు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించే నీట్ పరీక్షలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేలా చేయూత అందించేందుకు సాక్షి ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఏ పరీక్ష ఎప్పుడంటే.. - సాక్షి జేఈఈ మెయిన్ పరీక్ష 25–3–2020న ఆన్లైన్లో ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేది: 15–3–2020. - సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 12–4–2020, 13–4–2020న ఆన్లైన్లో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 5–4–2020 - సాక్షి మాక్ నీట్ పరీక్ష 22–4–2020∙ఆఫ్‌లైన్‌లో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 15–4–2020. - ఒక్కోపరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150. http://www.arenoane.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈ మెయిల్‌కు హాల్‌టికెట్ పంపుతారు. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు - తెలంగాణ జిల్లాలు: 9505514424, 9666013544 - గ్రేటర్ హైదరాబాద్: 9912035299, 9912671222. - చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు: 9666697219 - విజయవాడ, గుంటూరు, ప్రకాశం,పశ్చిమగోదావరి: 9912671555 - తూర్పుగోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534