
సాక్షి హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్‌టీఐ) ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8న జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచీ, మధ్యాహ్నం 2:30కి ప్రారంభమయ్యే పరీక్షలకు మధ్యాహ్నం 12:30 నుంచీ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందే. ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనుంది.