సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్షల వాయిదాతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తిచేసి తరగతులు చేపడతామని ఆయనన్నారు.
ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గతంలో విడుదల చేసిన షెడ్యూళ్ల ప్రకారం జేఈఈ మెయిన్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలోని సెట్లన్నీ పూర్తయి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనావేశారు. కానీ, జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ ఎన్‌టీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.
మెయిన్ తొలిసెషన్ జూన్ 20 నుంచి 29 వరకు.. రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్సు కూడా వాయిదాపడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం ఆరు విడతల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లోకి జరిగే అడ్మిషన్లను పూర్తిచేయడానికి నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలంటే అక్టోబర్ వరకు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
ఎన్‌టీఏ తీరుతో ఈసారీ నష్టమే
జేఈఈ పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ తీరు కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు నష్టపోవలసి వస్తోందని అధ్యాపకులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఒకపక్క జాతీయస్థాయి అడ్మిషన్లు లేటు కావడంతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం కావడంవల్ల దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరిపోతున్నారని వివిధ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా అడ్మిషన్లు చేపడితే వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే చేరుతారని వారు తొలినుంచి కోరుతున్నారు. కానీ, జేఈఈ అడ్మిషన్ల ఆలస్యంతో గత ఏడాది రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశాలనూ ఆలస్యంగా చేపట్టారు.
ఇక జేఈఈలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. జేఈఈ అడ్మిషన్ల కన్నా ముందే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందే ఆ విద్యార్థులు ఆ తరువాత జేఈఈ అడ్మిషన్లలో అవకాశం వస్తే ఇక్కడి సీట్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా 15వేల మంది వరకు జేఈఈ సీట్లలో చేరుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెరిట్‌లో ఉన్న ఇతర విద్యార్థులకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేఈఈ అడ్మిషన్ల తరువాత రాష్ట్ర ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతూ వస్తున్నారు. జేఈఈ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నందున అప్పటివరకు రాష్ట్రంలోని కాలేజీల్లో చేరుదామని చూసే విద్యార్థులు కౌన్సెలింగ్ జాప్యం అయితే ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లోకి వెళ్లిపోతున్నారు.
విద్యార్థులకు ‘మెయిన్’ కష్టాలు
Published Fri, Apr 8 2022 5:45 AM | Last Updated on Fri, Apr 8 2022 10:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment