రోజూ రెండు సెషన్లలో నిర్వహణ
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న ఎన్టీఏ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ–మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా రెండు లక్షల మంది హాజరుకానున్నారు. తెలంగాణలో 10 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. అన్నిచోట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు.
బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22, 23, 24 తేదీలతోపాటు 28, 29 తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్ తీసుకొని రావడానికి వీల్లేదని ఎన్టీఏ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment