జేఈఈ మెయిన్‌ కటాఫ్‌పై కరోనా ఎఫెక్ట్‌  | Corona effect on JEE main cutoff Marks | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ కటాఫ్‌పై కరోనా ఎఫెక్ట్‌ 

Published Wed, Jun 15 2022 2:33 AM | Last Updated on Wed, Jun 15 2022 2:33 AM

Corona effect on JEE main cutoff Marks - Sakshi

సాక్షి,  అమరావతి: గత రెండేళ్లుగా కరోనా కారణంగా తలెత్తిన దుష్ప్రభావాలు ఈ ఏడాది జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్‌ ఫలితాలపై పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి విద్యాసంస్థలు ఆలస్యంగా తెరుచుకోవడం, రెండేళ్ల నుంచి సరిగా తరగతులు లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు.

ఇదే పరిస్థితి జేఈఈ మెయిన్‌ వంటి ఇతర పోటీ పరీక్షలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్ల జేఈఈ మెయిన్‌ కటాఫ్‌లతో పోల్చుకుంటే ఈసారి కటాఫ్‌ తగ్గడం లేదా వాటితో సమానంగా ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. పైగా ఇంటర్మీడియెట్‌లో సిలబస్‌ను కుదించి విద్యార్థులకు బోధించారు.

జేఈఈకి మాత్రం గతంలోని సిలబస్‌నే యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌లో కుదించిన చాప్టర్ల నుంచి జేఈఈ మెయిన్‌లో ప్రశ్నలు అడిగితే చాలా మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. ముఖ్యంగా కోచింగ్‌ సదుపాయాలు లేని గ్రామీణ విద్యార్థులు ఈసారి నష్టపోయే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. 

2021లో జనరల్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ 87.89
జేఈఈ మెయిన్‌–2021లో 11,44,248 మంది దరఖాస్తు చేయగా 9,39,008 మంది పరీక్షకు హాజరయ్యారు. అప్పట్లో నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. కటాఫ్‌ స్కోరులు జనరల్‌ 87.89, ఈడబ్ల్యూఎస్‌ 66.22, ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ 68.023, ఎస్సీ 46.88, ఎస్టీ 34.67, దివ్యాంగుల కోటాలో 0.00963గా నమోదయ్యాయి.

2019, 2020 జేఈఈ మెయిన్‌ కటాఫ్‌లతో పోల్చుకుంటే 2021 కటాఫ్‌ స్కోరులో తగ్గుదల కనిపించింది. 2019లో జనరల్‌ కటాఫ్‌ 89.75 ఉండగా 2020లో 90.37గా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా అనంతరం జరుగుతున్న ఈ పరీక్షల్లో కటాఫ్‌ 2021 కంటే తగ్గడం, లేదా సమానంగా ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


2016కి ముందు కటాఫ్‌ స్కోర్లు 100పైనే..
జేఈఈ మెయిన్‌ గణాంకాలను పరిశీలిస్తే.. 2016 కంటే ముందు మెయిన్‌లో జనరల్‌ కటాఫ్‌ స్కోర్‌ 100కు మించి ఉండడం గమనార్హం. ఆ తర్వాత సంవత్సరాల్లో ఇది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో అత్యల్పంగా జనరల్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ 74గా ఉంది. జేఈఈకి ఎంతమంది హాజరైనా వారు బాగా రాయడంపైనే కటాఫ్‌ స్కోర్‌ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జేఈఈ మెయిన్‌లో నిర్దేశిత కటాఫ్‌ స్కోర్లు సాధించిన టాప్‌ 2.50 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ రెండున్నర లక్షల మందిని ఆయా రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ 27 శాతం ఉంటారు. తక్కినవారంతా జనరల్‌ కేటగిరీలోకి వస్తారు.

ఈ కేటగిరీల్లో దివ్యాంగులు (పీడబ్ల్యూడీ) 5 శాతం మంది ఉంటారు. అలాగే సూపర్‌ న్యూమరరీ కోటా కింద జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. ఇలా మొత్తంగా 2.50 లక్షల మందిని ఆయా కేటగిరీల్లో ఎంపిక చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు.

త్వరలో అడ్మిట్‌ కార్డులు
జేఈఈ మెయిన్‌ను ఈసారి రెండు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మలి విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వర కు జరుగుతాయి. తొలి విడత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఒకటి, రెండురోజుల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది.

ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందు పరిచింది. అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలు పొందొచ్చని స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement