సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను జూన్‌లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్‌ఆర్‌డీ తాజా షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్‌డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్‌ఆర్‌డీ భావిస్తోంది. జూన్‌లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది.
రెండింటిపైనా కసరత్తు...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్‌డ్ నిర్వహించే పరిస్థితి లేదు.
జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్‌ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్‌డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్‌ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్!
Published Mon, Apr 20 2020 1:23 AM | Last Updated on Mon, Apr 20 2020 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment