jee advanced exams
-
అడ్వాన్స్‌డ్‌లోనూ 'మెయిన్' అంశాలే
సాక్షి, అమరావతి: ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2022లో జాయింట్ అడ్మిషన్ బోర్డు చేసిన మార్పులతో విద్యార్థులపై ప్రిపరేషన్ భారం తగ్గుతోంది. విద్యార్థులు ఆయా అర్హత పరీక్షల్లో నేర్చుకున్న సిలబస్‌తో అనుసంధానమయ్యేలా మెయిన్, అడ్వాన్స్‌డ్‌లోని అంశాలను మార్పు చేశారు. దీనివల్ల విద్యార్థులు గతంలో మాదిరిగా ఒత్తిడికి లోనుకారని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ తొలివిడత పూర్తయింది. ఈ నెల 25 నుంచి రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్‌ను దేశవ్యాప్తంగా 6.29 లక్షల మంది రాస్తున్నారు. వీరిలో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించనున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో కుస్తీ.. ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసినవారిలో అత్యధికులు ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా ఉద్యుక్తులవుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై దృష్టి సారించారు. మెయిన్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌లో ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ బోర్డుల సబ్జెక్టులతోపాటు ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్‌లోనే డెప్త్.. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి అడ్వాన్స్‌డ్‌లో ఎలాంటి మార్పు లేకున్నా.. మెయిన్‌లోని అంశాలే కొంత లోతుగా ఉంటున్నాయని అంటున్నారు. అందువల్ల విద్యార్థులు ఎక్కువగా వీటిపై దృష్టి సారించాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జేఈఈ మెయిన్ కెమిస్ట్రీలో అదనపు అంశాలు చేర్చారని.. ఈసారి వాటిని అడ్వాన్స్‌డ్‌కు కూడా కొనసాగిస్తున్నందున ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఆ అంశాలను మెయిన్‌లో బాగా ప్రిపేర్ అయ్యేవారికి మేలు చేకూరుతుందంటున్నారు. కెమిస్ట్రీపైన గతంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రకారం.. 20%కి పైగా ప్రశ్నలు ఉండేవని.. విద్యార్థులు వీటిపై ఎక్కువగా దృష్టి సారించేవారని అంటున్నారు. ఇప్పుడు మెయిన్‌కు చదివే వాటిని మళ్లీ పునశ్చరణ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని అంశాలు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాటికోసం డిగ్రీ, పీజీ స్థాయిల్లోని అంశాలను కూడా తీసుకొని బోధన చేయాల్సి వస్తోందంటున్నారు. అడ్వాన్స్‌డ్‌లో కొత్త అంశాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈసారి కొత్తగా గణితంలో స్టాటిస్టిక్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ వంటి అంశాలను చేర్చారు. ఇవి అడ్వాన్స్‌డ్‌లో గతంలో లేవు. మెయిన్‌లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటిని అడ్వాన్స్‌డ్‌లోనూ చేర్చడంతో విద్యార్థులకు వెసులుబాటు కలుగుతోందని ప్రముఖ కోచింగ్ సంస్థ అకడమిక్ డీన్ మురళీరావు అన్నారు. విద్యార్థులు మెయిన్‌లో వీటిని బాగా చదివి ఉంటారు కాబట్టి ఆ మేరకు ఇతర అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. అదనపు సమయాన్ని 10% వరకు ఇతర అంశాలకు కేటాయించవచ్చన్నారు. -
ఒకసారి ఐఐటీ సీటు వదులుకుంటే ఇక నో చాన్స్..!
సాక్షి, అమరావతి: గతంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వచ్చిన సీటును వదిలేసుకున్నవారికి జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ సంస్థ ఐఐటీ బాంబే షాకిచ్చింది. అలాంటివారు ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. దీని ప్రకారం.. గతంలో కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన సీటుకు అంగీకారం తెలిపి.. తర్వాత చేరని విద్యార్థులకు అడ్వాన్స్డ్–2022 పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే ఐఐటీల్లో చేరి మధ్యలో మానేసినవారికి కూడా చాన్స్ లేదని పేర్కొంది. అదేవిధంగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)–2021 కౌన్సెలింగ్‌లో కేటాయించిన ఐఐటీ సీటును ఆమోదించి.. ఆ తర్వాత చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందువరకు దాన్ని ఉపసంహరించకుండా కొనసాగి ఉంటే వారికి కూడా అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగే అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కులు సాధించినవారే ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కి అర్హులని పేర్కొంది. జేఈఈ మెయిన్ పేపర్ 2ఏ, 2బీల్లో అర్హత ఉన్నా అడ్వాన్స్డ్ రాయకుండా నేరుగా ఏఏటీ పరీక్షకు అవకాశం ఉండదని తెలిపింది. అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ఐఐటీ బాంబే ఈ విషయాలు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌కు నమోదు చేసిన కేటగిరీలే కొనసాగింపు విద్యార్థులు తమ రిజర్వేషన్, తదితర కేటగిరీలకు సంబంధించి జేఈఈ మెయిన్‌లో నమోదు చేసిన అంశాలే జేఈఈ అడ్వాన్స్డ్కూ యథాతథంగా కొనసాగుతాయని ఐఐటీ బాంబే తెలిపింది. మెయిన్‌లో తప్పుగా కేటగిరీలను నమోదు చేస్తే వాటిని అడ్వాన్స్‌డ్‌లో సరిచేసుకునేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో జనరల్ కేటగిరీ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద నమోదు చేసుకున్న విద్యార్థులు ఆ పత్రాలను సమర్పించకపోతే.. జనరల్ కటాఫ్ మార్కులు సాధిస్తేనే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులని పేర్కొంది. ఇదే నిబంధన ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీకి వర్తిస్తుందని తెలిపింది. అలాగే రాష్ట్రాల జాబితాలో ఓబీసీ నాన్ క్రిమీలేయర్ కేటగిరీలో ఉండి.. సెంట్రల్ ఓబీసీ జాబితాలో లేని కేటగిరీల విద్యార్థులు కూడా ఆ కేటగిరీ ప్రయోజనాలు పొందలేరని వెల్లడించింది. రక్షణ సర్వీసుల్లో పనిచేసేవారి పిల్లల రిజర్వేషన్లు కూడా కొన్ని కేటగిరీల వారికే వర్తించనున్నాయి. యుద్ధాల్లో లేదా శాంతిస్థాపన కార్యక్రమాల్లో మరణించిన, వికలాంగులైన, కనిపించకుండాపోయిన వారి సంతానానికి మాత్రమే ఈ కోటా సీట్లు దక్కుతాయి. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ కాగా, జేఈఈ అడ్వాన్స్డ్–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. వాస్తవానికి ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 4న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జూలై నెలల్లోకి వాయిదా పడడంతో అడ్వాన్స్డ్ పరీక్షను కూడా వాయిదా వేయక తప్పలేదు. కాగా జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి.. అర్హత పొందిన వారిలో టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. వీరికి మాత్రమే అడ్వాన్స్డ్–2022కు అవకాశం.. ► గతేడాది జోసా చివరి రౌండ్ కౌన్సెలింగ్‌కు ముందు ఉపసంహరించుకున్నవారు. ► బీఈ, బీటెక్‌లతోపాటు డ్యుయెల్ డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు ఐఐటీలు నిర్వహించే రెసిడెన్షియల్ ప్రిపరేటరీ కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు. ► గతేడాది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో సీట్లు వచ్చినవారు. అయితే వీరికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► గతేడాది సీటు పొందినా దాన్ని ఆమోదించడం, ఫీజు చెల్లించడం, విద్యా సంస్థలో రిపోర్టు చేయనివారు ► 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొని రెండు పేపర్లూ రాయనివారు.. జేఈఈ మెయిన్–2022లో అర్హత సాధించినవారు. ► జేఈఈ మెయిన్ బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించిన పేపర్–1ను కాకుండా పేపర్ 2ఏ, 2బీలను రాసినవారు. -
అడవి బిడ్డలకు ఐఐటీ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అడవి బిడ్డలు 2014లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటంటే ఒక్కటే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీ సీట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 2019లో ఐఐటీ, ఎన్ఐటీల్లో 20 సీట్లు, 2020లో 48 సీట్లు సాధించిన గిరిజన విద్యార్థులు ఈ ఏడాది 89 సీట్లు సాధించి విద్యారంగంలో పెను సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారి ప్రతిభా పాటవాలు కొండకోనల మధ్య అణగారిపోకుండా రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. గిరిజన గురుకుల కళాశాలలకు చెందిన 225 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కళాశాలలు మూసివేయటంతో వారికి ఇబ్బంది కలగకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారా అధ్యాపకులు శిక్షణ కొనసాగించారు. ప్రధానాచార్యులు, అధ్యాపకులు సైతం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్టడీ మెటీరియల్ అందించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యేటట్టు గిరిజన సంక్షేమ అధికారులు ప్రోత్సహించారు. ఇటువంటి గట్టి ప్రయత్నాల కారణంగా 225 మంది విద్యార్థుల్లో 214 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. వారిలో 9 మంది నేరుగా ఐఐటీకి అర్హత సాధించారు. మరో 21 మంది విద్యార్థులకు ప్రిపరేటరీ కోర్స్ (ఏడాదిపాటు ఐఐటీ నిపుణులతో శిక్షణ) అనంతరం మళ్లీ ఎటువంటి అర్షత పరీక్ష లేకుండా నేరుగా ఐఐటీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. మరో 59 మంది విద్యార్థులు 7 వేల లోపు ర్యాంకులు సాధించారు. వీరికి జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చిన ర్యాంకులతో ఎన్ఐటీకి అర్హత లభించింది. సాంకేతిక సహకారం అందిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండె ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన గిరిజన గురుకులాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లుకు అర్హత సాధించిన గిరిజన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పొరపాటున కూడా అవకాశాలు కోల్పోకుండా చూసేలా సాంకేతిక సహకారం అందిస్తాం. మాక్ కౌన్సెలింగ్‌లో నిపుణులతో తగిన సాంకేతిక తోడ్పాటును అందించి అవగాహన కల్పిస్తాం. ఐఐటీ, ఎన్ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు మొదటి ఏడాది ఫీజు చెల్లించడంతోపాటు ల్యాప్‌టాప్ కూడా అందిస్తాం. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోను ప్రభుత్వం అందించిన సహకారంతో రాణించిన విద్యార్ధులందరూ జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి మంచి భవిష్యత్ పొందాలి. – కె.శ్రీకాంత్ ప్రభాకర్, కార్యదర్శి, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ -
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మరో ఛాన్స్
సాక్షి, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్–2020లో అవకాశం దక్కని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని సంబంధిత జాయింట్ అడ్మిషన్ల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్–19 కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన, అడ్వాన్స్‌డ్‌కు సరైన సన్నద్ధత లేక సఫలం కాలేకపోయిన వారికి ఇదో మంచి అవకాశం. అయితే వీరు జేఈఈ అడ్వాన్స్డ్–2021లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్–2021కు ఈ అభ్యర్థులు 2020 మెయిన్స్ అర్హతతోనే హాజరుకావచ్చు. వీరు 2021 జేఈఈ మెయిన్స్‌ను రాయాల్సిన అవసరం లేదు. కేవలం 2020 జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు మాత్రమే ఇది పరిమితం. కేవలం ఒక్క అవకాశం మాత్రమే ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జేఏబీ నిబంధనల నుంచి సడలింపు కోవిడ్–19ను దృష్టిలో ఉంచుకుని జాయింట్ అడ్మిషన్ల బోర్డు (జేఏబీ) అర్హత తదితర నిబంధనల నుంచి వీరికి సడలింపు ఇచ్చింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చి అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు, సఫలం కాలేకపోయిన వారికి సమానావకాశాలిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏటా నమోదిత విద్యార్థులలో నాలుగింట ఒక వంతు మంది ఆ పరీక్షకు హాజరు కావడం లేదు. సమన్యాయం చేసేందుకు.. జేఈఈ అభ్యర్థులకు సమన్యాయం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 అడ్వాన్స్‌డ్‌కు అవకాశం పొందిన అభ్యర్థులు అదనపు అభ్యర్థులుగా పరిగణిస్తారు. 2021 జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి సంఖ్యకు వీరు అదనం. అర్హతలు, వయసు, ఇతర అంశాల్లో కూడా వీరికి సడలింపు ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్–2020కు 2.5 లక్షల మంది అర్హత సాధించగా.. వారిలో 1.50 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం, ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఒక అభ్యర్థికి రెండు ప్రయత్నాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆయా విద్యార్థులు చివరి సంవత్సరం లేదా ఆ సంవత్సరం పరీక్ష రాయక రెండవ ప్రయత్నంలో ఉన్నవారికి సడలింపు ఇస్తున్నారు. అదే జేఈఈ మెయిన్స్‌ను వరుసగా మూడుసార్లు రాసేందుకు అవకాశం ఇస్తున్నారు. జేఈఈ మూడుసార్లు రాసినా అడ్వాన్స్‌డ్‌ను వరుసగా రెండేళ్లు రాయడానికి మాత్రమే వీలుంటుంది. ఈ సంఖ్యను పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుటినుంచో డిమాండ్ చేస్తున్నారు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్ష ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో 30 చోట్ల ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటరాధారితంగా ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ► పేపర్–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి. ► అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. ► కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా సమర్పించాలి. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. ► కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్ స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్ నంబర్ కనిపిస్తాయి. ► రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ కావచ్చు. ► ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలి. ► షూస్ కాకుండా ఓపెన్ పాదరక్షలు మాత్రమే ధరించాలి. -
సీటు రాకుంటే వేటు!
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు తమ పరిధిలోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)లకు జేఈఈ లక్ష్యాలు నిర్ధేశించాయి. అత్యుత్తమ ర్యాంకులు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ప్రతి సీఓఈ కనీసం 3 నుంచి 5 సీట్లు వచ్చేలా కృషి చేయాలని హెచ్చరించాయి. గతవారం జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చి న విషయం తెలిసిందే. అందులో ఈ రెండు సొసైటీల నుంచి 706 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 432, ఎస్టీ గురుకుల సొసైటీ నుంచి 274 మంది ఉన్నారు. తాజాగా ఈ విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధం చేయాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. యుద్ధ ప్రాతిపదికన తరగతులు ప్రారంభించాలని సూచించాయి. వీటితో పాటు బోధకులు, ప్రిన్సిపాళ్లకు పలు రకాల నిబంధనలు విధించాయి. ర్యాంకులొస్తేనే ఉద్యోగం... జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మరో పదిహేను రోజుల సమయం ఉండడంతో విద్యార్థులకు బోధన, అభ్యసన కార్యక్రమాలు పెంచుకోవాలని సొసైటీలు ఆదేశించాయి. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టును నాలుగు గంటల పాటు బోధించాలని సూచించాయి. మెయిన్ పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉండాలని, లేకపోతే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితిని పరీక్షా సమయంగా భావించి పనిచేయాలని సూచిస్తూ... ప్రిన్సిపాల్స్ స్థానికంగా ఉంటూ అడ్వాన్స్డ్ బోధన, అభ్యసన తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నాయి. ఫలితాలు సంతృప్తికరంగా లేకుంటే బోధకులను విధుల నుంచి టర్మినేట్ చేస్తామని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆపరేషన్ విభాగం ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్డ్యూటీ) జారీ చేసిన సంయుక్త ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నిబంధన ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విధులను అత్యంత భయపడుతూ నిర్వహిస్తున్నామని, ఇలాంటి షరతులు పెడితే స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండదని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్‌లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్‌లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్‌ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్‌ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో భాష్యం విజయకేతనం
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చెప్పారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థి చుండూరు రాహుల్ ఓపెన్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకుతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీలో కల్లూరి హరిప్రసాద్ అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడని చెప్పారు. జేఈఈ లక్ష్యంగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దుతూ ఏటా సంచలన విజయాలను నమోదు చేస్తున్నామన్నారు. నారాయణ శ్రీచైతన్య హవా హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ సత్తా చాటిందని ఆ విద్యాసంస్థల డెరైక్టర్లు పేర్కొన్నారు. అత్యధిక టాప్ ర్యాంకులతోదేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. విద్యా సంస్థల డెరైక్టర్లు డాక్టర్ బీయస్ రావు, డాక్టర్ పి.సింధూర నారాయణ, సుష్మ, శ్రీనిశిత్ విలేకరులతో మాట్లాడుతూ, ఓపెన్ కేటగిరీలో 50 శాతం టాప్ ర్యాంకులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఆలిండియా 4, 5, 7, 8, 10.. ఇలా 50 శాతం టాప్ ర్యాంకులు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి తొలి ర్యాంకును, ఆలిండియా నాలుగో ర్యాంకులను జీవితేష్ దుగ్గాని, ఆలిండియా ఐదో ర్యాంకును సాయితేజ తాళ్లూరి, ఆలిండియా ఏడో ర్యాంకును జి.నిఖిల్ సామ్రాట్, 8వ ర్యాంకును సాయి ప్రణీత్ రెడ్డి, పదో ర్యాంకును విఘ్నేశ్వర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. శ్రీగాయత్రి విజయభేరి హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ గాయత్రి విద్యార్థులు ఆలిండియా టాప్ ర్యాంకుల సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ పీవీఆర్కే మూర్తి తెలిపారు. వివిధ కేటగిరీల్లో 1,000 లోపు 32 ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. శ్రీ గాయత్రి లక్ష్య, ఇంటెన్సివ్ ప్రోగ్రాం, ఐసీసీ ప్రోగ్రామ్ వల్లే తాము ఈ ఘన విజయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్స్ రికార్డు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు సంచలనం సృష్టించారని విద్యాసంస్థల చైర్మన్ కేకేఆర్ తెలిపారు. తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 4, 13, 16, 25.. వంటి ఆలిండియా టాప్ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచీల విద్యార్థుల నుంచి సాధించినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేఈఈలో విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలను తెలియజేశారు. ‘శశి’ ప్రభంజనం హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో మరోమారు సత్తా చాటారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రిన్స్ కమల్ తేజ జాతీయ స్థాయిలో 296 వ ర్యాంకు, టీ సుందర్ 389 వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. హాజరైన 92 మందిలో 51 మంది ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. 5 వేల లోపు 19 ర్యాంకులు, 8 వేలలోపు 23 ర్యాంకుల సాధించారన్నారు. ‘విశ్వభారతి’ పూర్వ విద్యార్థికి 8వ ర్యాంకు హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గుడివాడ విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థి సుంకేశుల సాయి ప్రణీత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించాడని స్కూల్ చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ తెలిపారు. మరో పూర్వ విద్యార్థి వి.నిరంజన్ ఆలిండియా 12 వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ఆర్’ ప్రతిభ హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. జి.రవితేజ జాతీయ స్థాయిలో (రిజర్వేషన్ కేటగిరీ) 16వ ర్యాంకు, భూక్యా రాంనాయక్ 48వ ర్యాంకు సాధించారు. సన్నతి ప్రవీణ్ 50వ ర్యాంకు సాధించాడు. వీరితో పాటు మరో 61 మంది ఐఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారని వరదారెడ్డి వివరించారు. వారిని డైరక్టర్లు మధుకర్, సంతోష్‌రెడ్డి తదితరులు అభినందించారు. -
ర్యాంకర్ల మనోగతం
బాంబే ఐఐటీలో సీఎస్ఈ: జీవితేశ్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే తన లక్ష్యమని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా నాలుగో ర్యాంకు సాధించిన జీవితేశ్ చెప్పాడు. ఈయన తండ్రి శివకుమార్ వీటీపీఎస్‌లో ఏడీఈగా పని చేస్తున్నారు. పదో తరగతి వరకు విజయవాడలో చదివిన జీవితేశ్.. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 981 మార్కులు సాధించాడు. తెలంగాణ ఎంసెట్‌లో 35, ఏపీ ఎంసెట్‌లో 78వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా: సాయితేజ ‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు నారాయణ శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ ఫ్యాకల్టీ గెడైన్స్‌తోనే ఈ విజయం సాధ్యపడింది. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవడం నా లక్ష్యం. ఆ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అవుతా’’ అని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించిన తాళ్లూరి సాయితేజ చెప్పాడు. టాప్-5లో స్థానం దక్కుతుందని ముందుగా ఊహించానన్నారు. గుంటూరు జిల్లా కూచిపూడికి చెందిన వీరి కుటుంబం చాలా సంవత్సరాల కిందట హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్థిరపడింది. నాన్న చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్. తెలంగాణ ఎంసెట్‌లో సాయితేజ మొదటి ర్యాంకు సాధించగా... ఏపీ ఎంసెట్‌లో ఏడో ర్యాంకు పొందాడు. ఎంసెట్‌లో 3.. అడ్వాన్స్‌డ్‌లో 7 వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్ సామ్రాట్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. నిఖిల్ తండ్రి ప్రసాద్ విద్యాశాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. బాంబే ఐఐటీలో సీఎస్ఈ చేస్తానంటున్న నిఖిల్ తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు, ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు సాధించాడు. బాంబేలో చదువుతా: ప్రణీత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి రాజగోపాల్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. అమ్మ శ్రీలత గృహిణి. చిన్నతనం నుంచే చదువులో ముందుండే ప్రణీత్... తెలంగాణ ఎంసెట్‌లో 31, ఏపీ ఎంసెట్‌లో 53వ ర్యాంకు పొందాడు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తానని చెప్పాడు. స్పేస్ సైంటిస్ట్ అవుతా: విఘ్నేష్ రెడ్డి బాంబే ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తానని జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు సాధించిన కొండా విఘ్నేష్ రెడ్డి చెప్పాడు. ఈయనది నెల్లూరు జిల్లా. నాన్న శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ సరళాదేవి గృహిణి. ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. ‘‘నాకు అంతరిక్షం అంటే చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తి. స్పేస్ సైంటిస్ట్ కావడమే నా జీవిత లక్ష్యం. 2025 నాటికి ఇస్రో ప్రపంచాన్ని శాసిస్తుందని నా నమ్మకం. అప్పటికి ఇస్రోలో నా పాత్ర ఉండాలి’’ అని విఘ్నేష్‌రెడ్డి పేర్కొన్నాడు. -
23 ఐఐటీల్లో 10,575 సీట్లు
ఓపెన్ కేటగిరీలో 5187 స్థానాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలి తాలు వెలువడడంతో అందులో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్ధులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో చేరేందుకు వీలుగా తదుపరి సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. దేశంలో 23 ఐఐటీ సంస్థలుండగా తమకు ఏ ఐఐటీలో సీటు దక్కుతుందన్న అంశాలపై వారంతా దృష్టి సారించారు. దేశం మొత్తం మీద ఐఐటీల్లో 10,575 సీట్లు ఉన్నాయి. అందులో శారీరక అంగవికలుర కు మూడుశాతం కోటా వర్తిస్తుంది. మొత్తం సీట్లలో ఓపెన్ కేటగిరీలో 5187 ఉండగా తక్కినవన్నీ వివిధ రిజర్వుడ్ కేటగిరీల కింద కేటాయించారు. ఓపెన్ కేట గిరీలో వికలాంగులకు 150 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 1537, ఎస్సీ వికలాంగులకు 48, ఎస్టీలకు 773, ఎస్టీ వికలాంగులకు 31 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలో నాన్ క్రిమీలేయర్‌కింద 2763, ఓబీసీ వికలాంగ అభ్యర్ధులకు 86 సీట్లు కేటాయించారు. అత్యధిక సీట్లు ఖరగ్‌పూర్ ఐఐటీలో (1341) ఉన్నాయి. రెండో స్థానంలో వారణాసి ఐఐటీ (1090 సీట్లు) ఉంది. 20 నుంచి ఐఐటీల్లో సీట్లు కేటాయింపు 15న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు వెలువడిన నేపథ్యంలో ఐఐటీల్లో ఈ నెల 20 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టేందుకు ఐఐటీల సంయుక్త కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)ను ఈ నెల 15న నిర్వహించేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం నుంచే ఏఏటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షను ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు జోనల్ ఐఐటీల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వీటి ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనుంది. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 19లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. -
మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 29 ర్యాంకులను మనోళ్లే కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులను సాధించారు. మే 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ఐఐటీ గువాహటి ఆదివారం ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో దేశంలోనే అత్యధిక మార్కులను సాధించిన తెలుగు విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రం మొదటి మూడు ర్యాంకులను సాధించలేకపోయారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అమన్ బన్సాల్ మొదటి ర్యాంకు సాధించగా.. హరియాణా యమునానగర్‌కు చెందిన భవేశ్ డింగ్రా 2వ ర్యాంకు సాధించాడు. జైపూర్‌కే చెందిన కునాల్ గోయల్ మూడో ర్యాంకు సాధించాడు. టాప్ 10 ర్యాంకుల్లో 4, 5, 7, 8, 10 ర్యాంకులను తెలుగు విద్యార్థులు సాధించారు. వీరంతా అబ్బాయిలే కావడం గమనార్హం. ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో దేశంలోనే అత్యధిక మార్కులు(345) సాధించిన తాళ్లూరి సాయితేజ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్‌లో టాప్-5 విద్యార్థుల జాబితాలో లేని దుగ్గాని జీవితేశ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నాలుగో ర్యాంకు సాధించాడు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ (ఎన్సీఎల్) కేటగిరీలో జాతీయ స్థాయిలో జీవితేశ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో టాప్-20లో 8 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. ఓపెన్‌లో 75 మార్కులొస్తే ర్యాంకు.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 372 మార్కులకు (ఫిజిక్స్-124, కెమిస్ట్రీ-124, మ్యాథ్స్-124) నిర్వహించారు. ఇందులో ప్రతి సబ్జెక్టులో 10 శాతం మార్కులు, మొత్తంగా 372 మార్కులకు కనీసం 35 శాతం(130కిపైగా) మార్కులు వస్తేనే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్లు పరిగణిస్తామని ఐఐటీ గువాహటి ప్రకటించింది. అయితే ర్యాంకుల ఖరారు సందర్భంగా మాత్రం ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను మార్చలేదు. కానీ మొత్తం మార్కుల్లో రావాల్సిన కనీస అర్హత మార్కులను భారీగా తగ్గించింది. ఓపెన్ కేటగిరీలో 20 శాతం మార్కులు సాధించిన వారికి ర్యాంకులను కేటాయించింది. అంటే ఓపెన్‌లో 75 మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటించి ర్యాంకులను కేటాయించింది. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లోనూ మొత్తం మార్కుల్లో కనీస అర్హత మార్కులను తగ్గించింది. సర్వర్ డౌన్‌తో తంటాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ఐఐటీ గువాహటి ముందుగానే ప్రకటించింది. తీరా ర్యాంకులు వెలువడే సమయానికి సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం కొంతసేపు వెబ్సైట్ పని చేసింది. ఆ తర్వాత మళ్లీ డౌన్ అయింది. ఎట్టకేలకు సాయంత్రానికల్లా విద్యార్థులు తమ ర్యాంకులను తెలుసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో టాప్ ర్యాంకర్లు.. ర్యాంకు పేరు ప్రాంతం 1 అమన్ బన్సాల్ జైపూర్ 2 భవేష్ డింగ్రా యమునానగర్ 3 కునాల్ గోయల్ జైపూర్