- ఓపెన్ కేటగిరీలో 5187 స్థానాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలి తాలు వెలువడడంతో అందులో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్ధులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో చేరేందుకు వీలుగా తదుపరి సన్నాహాల్లో నిమగ్నమవుతున్నారు. దేశంలో 23 ఐఐటీ సంస్థలుండగా తమకు ఏ ఐఐటీలో సీటు దక్కుతుందన్న అంశాలపై వారంతా దృష్టి సారించారు. దేశం మొత్తం మీద ఐఐటీల్లో 10,575 సీట్లు ఉన్నాయి. అందులో శారీరక అంగవికలుర కు మూడుశాతం కోటా వర్తిస్తుంది. మొత్తం సీట్లలో ఓపెన్ కేటగిరీలో 5187 ఉండగా తక్కినవన్నీ వివిధ రిజర్వుడ్ కేటగిరీల కింద కేటాయించారు. ఓపెన్ కేట గిరీలో వికలాంగులకు 150 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 1537, ఎస్సీ వికలాంగులకు 48, ఎస్టీలకు 773, ఎస్టీ వికలాంగులకు 31 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలో నాన్ క్రిమీలేయర్‌కింద 2763, ఓబీసీ వికలాంగ అభ్యర్ధులకు 86 సీట్లు కేటాయించారు. అత్యధిక సీట్లు ఖరగ్‌పూర్ ఐఐటీలో (1341) ఉన్నాయి. రెండో స్థానంలో వారణాసి ఐఐటీ (1090 సీట్లు) ఉంది.
20 నుంచి ఐఐటీల్లో సీట్లు కేటాయింపు
15న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు వెలువడిన నేపథ్యంలో ఐఐటీల్లో ఈ నెల 20 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టేందుకు ఐఐటీల సంయుక్త కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ)ను ఈ నెల 15న నిర్వహించేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం నుంచే ఏఏటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆర్కిటెక్చర్ ప్రవేశ పరీక్షను ఈ నెల 15న ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు జోనల్ ఐఐటీల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వీటి ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనుంది. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 19లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది.